ఆస్కార్‌ వేదికపై మన నాటుకొట్టుడు.. తగ్గేదేలే

By KTV Telugu On 13 March, 2023
image

రోమాంచిత ఘట్టం. ప్రతీ తెలుగువాడు నిలువెల్లా పులకించిపోయిన క్షణం. ఆ మాటకొస్తే యావత్‌ దేశ చిత్రపరిశ్రమ గుండె గర్వంతో ఉప్పొంగిపోయిన సందర్భం. 91 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో మరపురాని ఘట్టం. ఆస్కారం ఉందా లేదా అన్న అనుమానాలకు తెరదించుతూ విశ్వవేదికపై ఆస్కార్‌ కొట్టేసింది మన నాటు తెలుగుపాట. భారతీయ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్‌ అవార్డును సాకారం చేసింది రాజమౌళి బృందం ఆర్‌ఆర్‌ఆర్‌ సిన్మా. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులను స్టెప్పులేయించిన తెలుగు పాట నాటు నాటు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును గెలుచుకుని మన తెలుగోడి సత్తాని తొడగొట్టి చాటింది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది ట్రిపులార్‌.

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగీరిలో పోటీపడ్డ దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), అప్ల్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌) హోల్డ్‌ మై హ్యాండ్‌ (టాప్‌గన్‌ మావెరిక్‌), లిఫ్ట్‌ మి అప్‌ (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌) పాటలను పక్కకు నెట్టేసి ఆస్కార్‌ పురస్కారాన్ని దక్కించుకుంది మిరపతొక్కులాంటి మన నాటు పాట. ఆస్కార్‌ ప్రకటించగానే అప్పటిదాకా పడ్డ శ్రమనంతా మర్చిపోయింది ట్రిపులార్‌ టీం చిన్నపిల్లల్ల కేరింతలు కొట్టింది. భావోద్వేగంతో ఆ గొప్ప క్షణాలను గుండెల్లో దాచుకుంది. ఏడాదిక్రితం రిలీజైన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. విదేశీ వీక్షకులను కూడా అలరించి బాక్సాఫీస్‌ రికార్డుల్ని బద్దలు కొట్టింది.

ఆస్కార్‌ కంటే ముందు అంతర్జాతీయ వేదికపై గోల్డెన్‌ గ్లోబ్‌, హాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులను ఆర్‌ఆర్‌ఆర్‌ తన ఖాతాలో వేసుకుంది. హాలీవుడ్‌ దిగ్గజ దర్శకులు జేమ్స్‌ కామెరూన్‌ స్పీల్‌బర్గ్‌వంటి వారి ప్రశంసలు ఆ అవార్డులను మించిపోయాయి. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంది. చంద్రబోస్‌ రాసిన ఈ పాటని కీరవాణి తనయుడు కాలభైరవ రాహుల్‌ సిప్లిగంజ్‌ తమ స్వరంతో ఊపేశారు. ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీతో ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. చివరికి ఆస్కార్‌ అవార్డుదాకా మన సిన్మాని తీసుకెళ్లింది.