విడాకులు తీసుకుని విడిపోయేంత విభేదాలేం లేవు. చిన్నచిన్న మాటపట్టింపులు, నాలుగ్గోడలమధ్య ఇగోలు. ఇంతకుమించి వాళ్లిద్దరి మధ్యా పెద్దగా అడ్డుగోడలేం లేవు. అయినా సోషల్‌మీడియా సాక్షిగా విడిపోయారు. విడిపోతున్నట్లు ప్రకటన చేసి ఇన్నాళ్లయినా ఇద్దరూ ఇప్పటికీ సింగిల్సే. సల్మాన్ వదిన భర్తను వదిలేయగానే మరో తోడు చూసుకుంది. హృతిక్‌రోషన్ దంపతులూ అంతే. కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా అందరికీ కనిపించిన నాగచైతన్య సమంతా ఇప్పటికీ మరో తోడు వెతుక్కోలేదు. నాగచైతన్యకు దూరమయ్యాక సమంతానే ఎక్కువ నిందలు భరించింది. ఎందుకంటే చైతూని తప్పుపట్టడానికి అభిమానులకు సామాన్యులకు ఏ కారణం కనిపించలేదు. కానీ సమంతా గతంలో సిద్ధార్థతో ప్రేమాయణం నడపటంతో తప్పు తనదేనని అంతా వేలెత్తిచూపించారు.
సమంత కూడా కొన్నాళ్లపాటు వేదాంతధోరణితోనే సోషల్‌మీడియా పోస్టింగులు పెట్టింది. ఈమధ్య అరుదైన రుగ్మతతో ఆమె ఆరోగ్యం క్షీణించటంతో పాపం సమంత అంటూ అంతా జాలిపడ్డారు. అక్కినేని కుటుంబ కోడలిగా ఉండి ఉండాల్సిందని అనుకున్నారు. కానీ కలిసి బతకాలో లేదో తేల్చుకోవాల్సిందే ఆ జంటకదా. విడాకుల తర్వాత సమంత గురించి ఇప్పటిదాకా ఏ కామెంట్ చేయని నాగచైతన్య మొదటిసారి ఆసక్తికర పోస్ట్ చేశాడు. సమంతతో కలిసి నటించిన ఏమాయ చేశావే విడుదలై 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సిన్మాలో తామిద్దరం ఉన్న స్టిల్‌ని చైతూ పోస్ట్ చేయడం ఆసక్తి రేపింది.
సమంత చైతూకు సంబంధించిన జ్ఞాపకాల్పి సోషల్ మీడియా నుంచి తీసేసింది. అలాంటిది విడిపోయిన ఏడాదిన్నర తర్వాత సమంతను గుర్తుచేసుకుంటూ చైతూ పోస్ట్ చేసి తన జ్ఞాపకాల్లో ఆమె ఇంకా ఉందని గుర్తుచేశాడు. సెలబ్రేటింగ్ 13 ఇయర్స్ అంటూ చైతూ సిన్మా స్టిల్ పోస్ట్ చేసినా ఆమెను తను మర్చిపోలేకపోతున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూపర్‌హిట్ కొట్టిన ఆ సిన్మాలో ఆ జంటని చూసి అంతా ముచ్చటపడ్డారు. చివరికి ఈ జంట జీవితభాగస్వాములు కావటంతో చిలకాగోరింకల్లా ఉన్నారని మెచ్చుకున్నారు. కానీ అవి రెండూ ఒక గూటిలో లేకపోవటం మాత్రం చూట్టానికి కూడా అందరికీ బాధగానే ఉంది.