బాలీవుడ్‌కి పోయిన ప్రాణం లేచొచ్చింది. ఈమధ్య వరుస ఫ్లాప్‌లతో కళతప్పిన బాలీవుడ్‌ని మళ్లీ రొమ్మువిరుచుకుని నిలబడేలా చేసింది బాద్‌షా పఠాన్ సిన్మా. బాయ్‌కాట్ వివాదాలతో సిన్మా తీయాలంటే భయపడే పరిస్థితినుంచి ఇండస్ట్రీని బయట పడేసింది. కొన్నేళ్లుగా ట్రాక్ రికార్డ్ అంతంతమాత్రంగా ఉన్న షారుక్‌ఖాన్‌కి ఇదో బిగ్గెస్ట్ హిట్. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా 7700 స్క్రీన్లపై విడుదలై ఇప్పటికీ చాలాచోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది పఠాన్ యాక్షన్ థ్రిల్లర్.
ఓవర్సీస్‌లోనూ పఠాన్ దుమ్మురేపుతోంది. అమెరికాలో బాహుబలి-2 కలెక్షన్లను బద్దలుకొట్టింది. అమెరికాలో ట్రిపుల్ ఆర్ 14.3 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేస్తే పఠాన్ వసూళ్లు దాన్ని కూడా మించిపోయాయి. 13రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా అంచనాలకు మించి 835 కోట్ల గ్రాస్ వసూలుచేసింది షారుక్‌ఖాన్ సిన్మా. డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దాదాపు వందకోట్లు పెట్టి కొనుక్కుందంటేనే పఠాన్ సిన్మాకున్న క్రేజ్ అర్ధమవుతుంది.
రిలీజ్‌కి ముందు తీవ్ర దుమారం రేపింది పఠాన్. అందులో దీపికా పదుకునే అందాల ఆరబోత ఆమె ఆరెంజ్ డ్రెస్‌లో చేసిన ఎక్స్‌పోజింగ్‌తో సిన్మా తెరపైకొస్తుందో లేదోనన్న అనుమానాలు వచ్చాయి. సిన్మా బహిష్కరణకు కొన్ని సంఘాలు పిలుపునిచ్చాయి. కానీ హాలీవుడ్ తరహా టేకింగ్‌తో పఠాన్ ప్రేక్షకులను మెప్పించింది. మాంచి యాక్షన్ థ్రిల్లర్‌కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులను పఠాన్ సంతృప్తి పరచగలిగింది. దీంతో చిన్న చిన్న అవరోధాలన్నీ దూదిపింజల్లా తేలిపోయాయి. ఈ సిన్మాకి షారుక్‌ఖాన్ తీసుకున్న పారితోషికం వందకోట్లని సమాచారం. తన కారణంగా ప్రొడ్యూసర్స్ నష్టపోతారని బాద్‌షా మొదట టెన్షన్ పడ్డా సిన్మా బాక్సాఫీస్‌ని దున్నేయటంతో అంతా హ్యాపీ. ఉత్తరాదిలో మరో చెప్పుకోదగ్గ సిన్మా లేకపోవటంతో పఠాన్ జోష్ ఏమాత్రం తగ్గలేదు. పఠాన్ దూకుడు చూస్తుంటే ఆ సిన్మా వెయ్యికోట్ల కలెక్షన్ రికార్డ్ సృష్టించేలా ఉంది.