సిన్మాల్లో సీన్లమీదో, డైలాగులపైనో, పాటల గురించో వివాదాలు తలెత్తడం కొత్తేం కాదు. కానీ ఆ పాటమీద మాత్రం కొన్నివారాల పాటు దుమారం రేగింది. సిన్మానే బ్యాన్ చేయాలనేదాకా వెళ్లింది. బేషరమ్ కాస్ట్యూమ్స్ వేసిన దీపికా పదుకునే భంగిమల కంటే ఆ సిన్మా హీరో షారూక్‌ఖాన్ కావడమే వివాదానికి మెయిన్ రీజన్ అనేది ఓపెన్ సీక్రెట్. అదే సమయంలో ఆ పాటలో ఎక్స్పోజింగ్ హద్దులు దాటిందన్న వాస్తవాన్ని కూడా ఒప్పుకోక తప్పదు. మసాలా సిన్మాలు వదిలేసి బాలీవుడ్లో ఐటమ్స్ చేసుకుంటున్న సన్నీలియోన్ కూడా సిగ్గుపడేలా ఉందా పాట చిత్రీకరణ.
అసలే ఈమధ్య బాలీవుడ్‌కి అస్సలు కలిసిరావడం లేదు.
ఏ సిన్మా మార్కెట్లోకొచ్చినా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతోంది. గతంలో బాలీవుడ్ సిన్మాలు వందలకోట్లు వసూలుచేసేవి. ఇప్పుడు పెట్టిన ఖర్చు కూడా రాకపోవటంతో ఓరకంగా బాలీవుడ్ సంక్షోభంలో ఉంది. ఈ టైంలో భావోద్వేగాలు రెచ్చగొడుతూ, వ్యతిరేక ప్రచారం చేస్తూ బాయ్‌కాట్ చేయాలన్న రాద్ధాంతంతో పఠాన్ సిన్మా పరేషాన్లో పడింది. దీంతో వేరేదారి లేక అంగాంగ ప్రదర్శనలకు బట్టలు చుట్టేసిందట సిన్మా టీం. అభ్యంతకరమైన యాంగిల్స్కి కత్తరేసిందట. దీపికా కాషాయ రంగు బికినీ, షారూక్ ఆకుపచ్చ చొక్కాలు పాటలో కనిపించవంటున్నారు. లిరిక్స్‌లో కొన్ని షాట్లను కూడా కట్ చేవౄరట. వీటితోపాటు రా, పీఎంఓ వంటి పదాలను వేరేవాటితో ఓవర్‌రైట్ చేశారని చెబుతున్నారు. ముందుజాగ్రత్తగా మరికొన్ని పదాలను మ్యూట్ చేశారని సమాచారం.
ఫ్లాప్‌లతో భోరుమంటున్న బాలీవుడ్‌ని పఠాన్ సిన్మా ఓదారుస్తుందనుకుంటే ఓ పాటతో పెద్ద కష్టమే వచ్చిపడింది. అందుకే మరో మాటలేకుండా ఆ పాటకు రిపేర్ చేశారంటున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కూడా పాటలో కొన్ని మార్పులు చేయాలనటంతో సిన్మా నిర్మాతలు డ్యామేజ్ కంట్రోల్‌కి సిద్ధమయ్యారు. ఏదో ఒక రంగు విషయంలో రాద్ధాంతం అనవసరమన్న ఆశాపరేఖ్లాంటి సీనియర్ నటి మాటలు ఈ కాలంలో ఎవరి చెవికెక్కవు. అమ్మ అన్నా బూతులా ప్రచారం చేసే సోషల్ మీడియా యుగంలో సిన్మాల పరిస్థితి ముల్లుపై పడ్డ అరిటాకులా అయిపోతోంది. మొత్తంమీద 13 కట్స్ తర్వాత పఠాన్ సిన్మాకి U/A సర్టిఫికెట్ లభించింది. జనవరి 25న సిన్మా రిలీజ్ అయ్యాక అంతా ఓకేనో నాట్ ఓకేనో తెలుస్తుంది.