హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌ సింగ్‌కు ఈడీ నోటీసులు

By KTV Telugu On 16 December, 2022
image

తెలుగు టీవీ సిరియళ్లు ఒక పట్టాన అయిపోవు. జీడిపాకంలాగా ఏళ్లకేళ్లు సాగదీస్తూనే ఉంటారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు కూడా అలాంటిదే. ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు వాళ్లకు వీళ్లకు నోటీసులిచ్చి విచారణ పేరుతో హడావుడి చేస్తారు. ఆ తరువాత వాళ్లు అటు..వీళ్లు ఇటు..మళ్లీ ఎప్పుడో గుర్తుకొస్తుంది. అప్పుడు మళ్లీ నోటీసులు, విచారణలు ఇదో అంతులేని కథ.

తాజాగా టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసును మళ్లీ అటక మీదినుంచి దించారు. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇదే కేసులో గత ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన రకుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. ఆ రోజున తనకు అత్యవసరమైన పని ఉందని విచారణ మధ్యలోనే రకుల్ వెళ్లిపోయింది. దీంతో ఆమెను మరోసారి విచారించేందుకు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు.

డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌ చట్టం కింద గతంలో 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం అంతరికీ తెలిసిందే. ఈ కేసు విచారణకు ప్రత్యక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. గత ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు పలువురు టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను సిట్‌ ప్రశ్నించింది. వీరిలో పూరీ జగన్నాథ్‌, ఛార్మీ, రవితేజ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, దగ్గుబాటి రానా, ముమైత్ ఖాన్‌, నందు, తనిష్‌, తరుణ్‌, నవనీత్‌ తో పాటు పబ్‌ మేనేజర్, రవితేజ డ్రైవర్‌ శ్రీనివాసులు ఉన్నారు. ఇప్పుడు ఈ డ్రగ్స్‌ కేసును మళ్లీ తిరగదోడడంతో టాలీవుడ్‌లో కలకలం మొదలైంది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో వార్తల్లో నిలిచిన తాండూరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు చెందిన పైలట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.

బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విషయంలో ఈనెల 19న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు అధికారులు. గత ఏడాది ఫిబ్రవరి 26న బెంగళూరు తూర్పు డివిజన్‌ పోలీసులు సినీ ప్రముఖులకు మత్తు మందులు సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద లభించిన సమాచారంతో డ్రగ్స్ ఖాతాదారుల్లో తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారులు, శాసనసభ్యుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరిని బెంగళూరు పోలీసులు గతంలోనే విచారించారు. ఈ క్రమంలోనే అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. తనకు ఈడీ నోటీసులు వచ్చిన విషయాన్ని రోహిత్ కూడా ధ్రువీకరించారు. తనకున్న వ్యాపారాలు, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అడిగారని తెలిపారు.