ఆస్కార్ నామినేషన్ల జాబితాలో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ గట్టి పోటీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికే భారత్తో పాటు విదేశాల్లోనూ దుమ్ము రేపింది. థియేటర్లలోకి వచ్చి 10 నెలలు గడిచినా ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన చర్చలు మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇటీవల ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఒక భారతీయ సినిమా పాటకు ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం ఇదే మొదటి సారి. దాంతో మరోసారి రాజమౌళి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా తెలిసివచ్చింది. అందరిమీదా సెటైర్లు వేసే రామ్గోపాల్ వర్మ కూడా రాజమౌళి ప్రతిభను తన స్టైల్లో మెచ్చుకున్నారు.
అర్జంటుగా రాజమౌళి భద్రత పెంచుకోవాలి. దేశంలోని కొందరు దర్శకులు స్వచ్ఛమైన అసూయతో రగిలిపోతున్నారు. రాజమౌళిని అంతమొందించేందుకు రెడీ అవుతున్నారు. అందులో తానూ ఒకడి అని సరదాగా ట్వీట్ చేశారు. తానేదో తాగి ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని బయటపెట్టేస్తున్నానంటూ ఆ ట్వీట్ లో చమత్కరించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆర్జీవి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా యూనిట్ ఇటీవల ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోను రీ ట్వీట్ చేశారు. ఓ భారతీయ సినీ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో దాదాసాహెబ్ ఫాల్కే నుంచి రాజమౌళి సహా ఇప్పటి వరకు ఎవరూ ఊహించి ఉండరని ప్రశంసలు కురిపించాడు. ఆర్జీవీ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.