ఆస్కార్ “నాటు” కొట్టుడు – ఇది ఇండియాకు స్పెషల్

By KTV Telugu On 13 March, 2023
image

అద్భుతాలు ఆకాశంలో నుంచి ఊడి పడవు మనమే చేయాలి. అదృష్టం కొద్దీ రావు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కష్టానికి తగ్గట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. ఇక్కడ ప్రపంచాన్ని జయించడం అంటే పీఠం వేసుకుని కూర్చోవడం కాదు ఎంచుకున్న రంగంలో ప్రపంచ స్థాయికి ఎదగడం. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం చూపించింది. ఆస్కార్ అవార్డును నాటు నాటు పాట సాధించింది. ఇది అనితర సాధ్యమైన విజయం. ఓ తెలుగు సినిమా ఆ స్థాయికి వెళ్లడం ఆషామాషీ కాదు. అసలు బాలీవుడ్ సినిమా కూడా ఆ స్థాయికి వెళ్లడం అసాధ్యం. కానీ తమ సినిమాను గొప్పగా తీరిదిద్దడం ప్రజల ముందు ఉంచడం మాత్రమే కాదు అంతే అద్భుతంగా ప్రపంచ వేదిక ముందు ప్రమోట్ చేసుకున్నారు. ఇంత పర్ ఫెక్ట్ ప్లానింగ్ అందరికీ రాదు. ఎంతో సమయం కేటాయించాలి. అంతకు మించిన వ్యూహాత్మక అడుగులు పడాలి. ప్రపంచ వేదిక ముందు ఏ మాత్రం అనుభవం లేకపోయినా అద్భుతంగా ప్రమోట్ చేసుకున్నారు. తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసుకున్నారు.

భారత్ కు చెందిన సినిమాలకు అంతర్జాతీయ వేదికల మీద వచ్చిన అవార్డులను చూస్తే ఒకే ఒక్క లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. అదేమిటంటే దేశ దరిద్రాన్ని ప్రపంచం ముందు ఉంచడం ఇది కాస్త కఠినంగా ఉండవచ్చు కానీ వాస్తవం. స్లమ్ డాగ్ మిలియనీర్ అనే సినిమాకు నాలుగు అవార్డులు వచ్చాయి. ఈ సినిమా పేరు ఇంగ్లిష్‌లో ఓ సామెత కావొచ్చు కానీ సినిమా మొత్తం భారత్‌లో ఇంత దుర్భరమైన పరిస్థితులు ఉంటాయా అని నమ్మేలా ఉంటుంది. ఈ సినిమా ప్రపంచం మొత్తం చూసింది. ఇండియాలో ఓ రకమైన నిరుపేద దేశం ఇమేజ్ పెంచింది. దేశంలో పేదరికం లేదని చెప్పలేం కానీ ఇప్పుడు దేశం ఎంతో మెరుగుపడింది. కానీ ఆ పేదరికాన్ని హైలెట్ చేసి ప్రపంచం ముందు ఉంచిన కథకే అవార్డులు దక్కాయి. ఎందుకిలా జరిగింది ఇదొక్కటే కాదు అంతర్జాతీయంగా ఏదైనా సినిమా భారత్ గురించి తీయాలంటే ఎక్కడా ఓ క్లాస్ కథను తీసుకోరు. మొత్తంగా దేశంలో పాములు ఉంటాయి కప్పలు ఉంటాయి సర్కస్ జనాలు అన్నట్లుగా చూపిస్తారు. ఇలా సినిమాల్లో ఇండియన్ అంటే ఓ రకమైన బ్యాడ్ ఇమేజ్ తెచ్చి పెట్టారు. ఇప్పుడు వీటన్నింటినీ పటా పంచలు చేస్తూ తొలిసారి ఆర్ఆర్ఆర్ ఓ అద్భుతమైన ఎంటర్ టెయినర్ గా ఇండియా నుంచి ప్రపంచం ముందు నిలబడింది.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కి ఆస్కార్ రావడం సామాన్యమైన విషయం కాదు. అవార్డులను ఎంపిక చేసే వారి మైండ్‌లో ఆ సింగర్ల స్థానం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. వారికి అసలు కీరవాణి అనే పేరు కూడా తెలిసి ఉండదు. కానీ తాను ఎవరిని అనే విషయాన్ని పాటల ద్వారానే సంగీతం ద్వారానే వారికి తెలియచేశారు. ప్రపంచ యువనికపై భారత్ సంగీతానికి ఓ ప్రత్యేకతను తెచ్చి పెట్టారు. ఆస్కార్ విజయం అందిన తర్వాత దేశం మొత్తం పులకరించింది. ప్రధానమంత్రి మోదీ కూడా శుభాకాంక్షలు చెప్పారు. అందరూ రెస్పాండ్ అయ్యారు. వారు చేసింది కమర్షియల్ సినిమానే కావొచ్చు. గతంలో ఆర్ట్ సినిమాలకే అవార్డులు వచ్చేవి. ఆర్ట్ సినిమాలంటే మన లోపాల్ని మనం ఎత్తి చూపించుకోవడం వాటిని అంతర్జాతీయంగా ప్రదర్శించి అవార్డులు ఆశించడం కానీ ఇప్పుడు ఆ ఆర్ట్ మారిపోయింది. మనం కూడా హాలీవుడ్ స్థాయి కమర్షియల్ సినిమాలకు వెళ్తున్నామని మేకర్లు నిరూపిస్తున్నారు.

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సాధించిన ఫీట్‌తో ఇండియన్ సినిమాలు కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా ఇంగ్లిష్ ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా లభిస్తున్న ప్రోత్సాహమే వారికి ఉత్సాహం ఇస్తుంది. ఇది మరిన్ని అంతర్జాతీయ స్థాయి సినిమాలు రావడానికి కారణం అవుతుంది. అంటే భారతీయ సినిమా రేంజ్ పెరుగుతుంది. అదే జరిగితే భారత్ ప్రపంచ పటంలో ప్రముఖంగా మారితోందని చెప్పుకోవడం అతిశయోక్తి ఎందుకవుతుంది. ఆస్కార్ దారిలో ఆర్ఆర్ఆర్ ఎన్నో అసామాన్యమైన అడుగులు వేసింది. ఆస్కార్ అకాడమీ సభ్యుల్ని ఆకట్టుకోవడానికి ఆర్ఆర్ఆర్ టీం సినిమాను ది బెస్ట్ అన్న రీతిలో ప్రమోట్ చేసుకున్నారు. అనుకున్న ఫలితం సాధించారు. ఈ విజయం వారికి మాత్రమే మేలు చేయదు. దేశ సినిమా రంగానికి మేలుచేస్తుంది. భారత సినీరంగం ప్రపంచ స్థాయికి వెళ్లడానికి ఓ వారధిలా ఉపయోగపడుతోంది. అసాధ్యం అనుకున్నదాన్ని ఆర్ఆర్ఆర్ టీం అనుకున్న విధంగా సుసాధ్యం చేసుకుంది. జయహో ట్రిపుల్ ఆర్ టీం.