సమంత కన్నీటి వెనక అంతులేని వ్యథ

By KTV Telugu On 9 January, 2023
image

తన అందం అభినయంతో స్వల్పకాలంలోనే తెలుగు తమిళ్‌ సినీ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చకున్నారు సమంత. 2010లో ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరపై తళుక్కుమని మెరిశారు. ఆ తరువాత ఎన్నో హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు సమంత. తన పేరునే ఒక బ్రాండ్‌గా మార్చుకున్నారు. కెరీర్‌ పరంగా హైస్పీడ్‌తో తూసకుపోతున్న సమయంలోనే తన మొదటి తెలుగు సినిమాలో తనతో కలిసి నటించిన నాగ చైతన్యతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 2017లో సమంత నాగ చైతన్యల పెళ్లి జరిగింది. అందం, అభినయం, అభిమానులు, కావలసినంత డబ్బు, చేతినిండా సినిమాలు. అక్కినేని ఇంటి కోడలిగా గుర్తింపు. ఇంకేం కావాలి. జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ అక్కడినుంచి సమంత జీవితం మలుపు తిరిగింది. వివాహ బంధం బీటలు వారింది. 2021లో నాగచైతన్య, సమంత విడిపోయారు. అప్పటినుంచి సమంత ఒంటరిగా ఉంటున్నారు. మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు.

హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రతో ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తరువాత యశోద సినిమాలో ప్రధాన పాత్రలో నటిచింది. ఆ సమయలోనే ఆమెకు మరో షాక్ తగిలింది. సమంత ఆరోగ్యం క్షీణించింది. గత ఏడాది యశోద మూవీ రిలీజ్‌కి కొన్ని రోజులు ముందు తాను మయోసైటిస్ అనే దీర్ఘకాలిక కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు ఆవిడే స్వయంగా ప్రకటించారు. ఆ మూవీ డబ్బింగ్‌ వర్క్‌ని కూడా సెలైన్ సాయంతో పూర్తి చేస్తున్న ఫొటోని సమంత షేర్ చేశారు. ఈ విషయం తెలిసి ఆమె అభిమానించేవారి గుండె ముక్కలయ్యింది. తమ అభిమాన నటి త్వరగా కోలుకోవాలని దేవుళ్లను ప్రార్థించారు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం సమంతకు ధైర్యం చెప్పారు. అసలు మయోసైటిస్‌ అంటే మన రోగ నిరోధక శక్తి మనపైనే తిరగబడి దాడికి తెగబడే విచిత్ర పరిస్థితి. దీనివల్ల కండరాలు బలహీనపడిపోతాయి. ఊపిరి తీసుకునే కండరాలు దెబ్బతింటాయి. భుజాలు, మెడ, చేతులు, కాళ్లు, పొత్తికడుపు, వెన్నెముక కండరాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. చిన్న వస్తువులను కూడా పైకెత్తలేరు. కొన్నిసార్లు లేచి నిలబడటమూ కష్టమే. ఆహారాన్ని మింగడం అసాధ్యంగా అనిపిస్తుంది.

అయితే సరైన చికిత్స తీసుకుంటే మయోసైటిస్‌ నుంచి బయటపడవచ్చనేది డాక్టర్లు ధైర్యం చెప్పారు. ఎంతో ఇష్టపడి చేసుకున్న వివాహం మూన్నాళ్ల ముచ్చట అయింది. ఆ తరువాత అయినా జీవితం సాపీగా సాగిపోతుంది అనుకుంటే ఈ మాయదారి జబ్బు సోకింది. అదే వేరేవాళ్లు అయితే తీవ్రమైన మనోవేధనతో కుప్పకూలిపోయేవారు. కానీ సమంత తట్టుకున్నారు. యశోధ సినిమా విడుదల సందర్భంలో ప్రముఖ యాంకర్‌ సుమ కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సమంత. ఆ ఇంటర్వ్యూలో ఆమె తన మనసు విప్పి మాట్లాడారు. జీవితంలో కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఇంకొక్క అడుగు ముందుకు వేయలేనేమో అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడి వరకు వచ్చానా అనిపిస్తుంది. నేను ఇలాగే పోరాడతా. నాలానే చాలా మంది పోరాడుతున్నారు. ఈ పోరాటంలో మేం గెలుస్తాం అంటూ సమంత కంటతడి పెట్టుకున్నారు.  తన ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో జరిగే ప్రచారంపై స్పందిస్తూ ప్రస్తుతానికి నేను చనిపోలేదు చనిపోను. కాబట్టి అలాంటి హెడ్‌లైన్స్ పెట్టవద్దు కానీ నా పరిస్థితి క్లిష్టమైనదే. అయినప్పటికీ నేను పోరాడతాను అన్నారు సమంత.

అప్పటినుంచి సమంత చికిత్స తీసుకుంటూ ఉన్నారు. కొన్ని సినిమాలను వాయిదా వేసుకున్నారు. మరికొన్ని సినిమాలను వదులుకున్నారు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు అందరికీ దూరంగా ఉన్న సమంత శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చారు. వైట్ కలర్ శారీలో, కళ్లజోడు ధరించి ఆమె డిఫరెంట్‌ లుక్ లో కనిపించారు. ఈ సినిమా గురించి, తన గురించి దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతున్నప్పుడు ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ చిత్రంలో సమంతనే హీరో అన్నారు. కేవలం సమంతను నమ్మి దిల్ రాజు ఈ ప్రాజెక్టులో భాగమై కోట్ల రూపాయలు పెట్టారని అన్నప్పుడు అమె కళ్ల నుంచి కన్నీరు ఉప్పొంగింది. తనకు ఓపిక లేకపోయినా ఎంతో శక్తిని తెచ్చుకుని ఈవెంట్ కు హాజరయ్యానని చెప్పారు సమంత. ఈ సినిమాకు తనను ఎంపిక చేసిన గుణశేఖర్ కు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ఆమె ముఖంలో, మాటల్లో, కళ్లల్లో చెప్పలేని బాధ, అంతులేని ఆవేదన కన్నీటి రూపంలో బయటకొచ్చాయి. సమంతను కన్నీరు పెట్టుకోవడం చూసి ఆమె అభిమానులే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.