ఆ గొంతు మూగబోయింది. ఎన్నో భాషల్లో వేలపాటలు ఆలపించిన స్వరం అనుమానస్పదంగా ఆగిపోయింది. దక్షిణాదికే కాదు యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ గాయకురాలు వాణీజయరాం హఠాత్తుగా కన్నుమూశారు. అపూర్వ రాగంగళ్ చిత్రానికి తొలిసారి జాతీయ పురస్కారం అందుకున్నారామె. శంకరాభరణం సిన్మాలో “మానస సంచరరే” పాటకి రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. స్వాతికిరణం సిన్మాలో “ఆనతి నియ్యరా హరా” పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా మరోసారి జాతీయ అవార్డు దక్కించుకున్న గొప్ప గాయకురాలు వాణీజయరాం.
19 భాషలు, 20 వేల పాటలు. ఓ గాయని ట్రాక్ రికార్డులో ఇంత ఘనత మామూలు విషయం కాదు. వేలాది భక్తి పాటలు, ప్రైవేటు ఆల్బమ్స్‌తో దేశవ్యాప్తంగా ఆమెకు సంగీతాభిమానులు ఉన్నారు.
సంగీతమే మూలమైన స్వాతికిరణం సిన్మాకోసం కళాతపస్వి వాణీజయరాంని ఎంచుకున్నారంటే ఆమె గొంతులోని శ్రావ్యత అర్ధంచేసుకోవచ్చు. తెలుగులో సుశీల, జానకిలాంటి గొప్ప గాయనిలు ఉన్నా వాణీజయరాం గొంతు పల్లవించే తీరే వేరు. శృతిలయలులో ఆలోకయే శ్రీబాలకృష్ణం, ఇన్నిరాసుల ఉనికి పాటలతో తన్మయత్వం చెందనివారున్నారా. శంకరాభరణంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే దొరకునా ఇటువంటి సేవ, బ్రోచేవారెవరురా, మానస సంచరరే, ఏ తీరుగ నను దయచూచెదవో పాటలన్నీ ఆమె గొంతునుంచి జాలువారినవే.
నోరుతిరగని పదాలు కూడా ఆమె గొంతులోంచి ఆర్ధ్రంగా స్వచ్ఛమైన ప్రవాహంలా తన్నుకొస్తాయి. అందుకే దిగ్గజదర్శకులు ఆమెకు ప్రాధాన్యమిచ్చేవారు. సీతాకోకచిలుకలో వాణీజయరాం పాట ఇప్పటికీ గిలిగింతలు పుట్టిస్తుంది. మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా, అలలు కలలు పాటలు సంగీతసాగరంలో విహారం చేయిస్తాయి. భక్తితో పాటు రక్తిపాటలతోనూ ప్రేక్షకులను ఊపేయడం వాణీజయరాంకే సాధ్యమైంది. తన సుస్వరాలే జ్ఞాపకాలుగా 77 ఏళ్ల సంపూర్ణ జీవితాన్ని గడిపిన వాణీజయరాంకి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం దక్కింది. సంగీతరంగానికి వాణిజయరాం చేసిన సేవలకు ఇదో గుర్తింపు. కాకపోతే ఆ పురస్కారాన్ని అందుకోకముందే ఆమె కన్నుమూయడం విషాదం. భౌతికంగా లేకపోయినా వాణీజయరాం పాట సంగీత ప్రపంచంలో ఎప్పటికీ సజీవమే.