టాలీవుడ్ టూ హాలీవుడ్..దటీజ్ కృష్ణ
బాహుబలి, ట్రిపులార్ లాంటి సిన్మాల తర్వాత పాన్ ఇండియా సిన్మాలగురించి ఇండస్ట్రీ చర్చించుకుంటోంది. ఇప్పుడు మార్కెట్ ఉంది. టెక్నాలజీ పెరిగింది. కానీ ఎప్పుడో 50ఏళ్లక్రితమే ఈ ట్రెండ్‌కి ఆద్యుడయ్యారు నటశేఖర కృష్ణ. కల్లోకూడా సాధ్యంకానిదాన్ని చేసి చూపించారు. టాలీవుడ్ సినిమాను అర్ధ శతాబ్దం కిందటే హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు బుర్రిపాలెం బుల్లోడు. కృష్ణ హీరోగా కేఎస్‌ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన మోసగాళ్లకు మోసగాడు సిన్మా అప్పట్లో ఓ సంచలనం. మెకన్నాస్ గోల్డ్, ఫర్ ఏ ఫ్యూ డాలర్స్ మోర్‌లాంటి ఇంగ్లీష్ సినిమాలకు అప్పట్లోనే మద్రాస్‌లో మంచి ఆదరణ లభించింది. దీంతో మనం కూడా ఇలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులకు మరపురాని అనుభూతి మిగులుతందని భావించారు కృష్ణ. రచయిత ఆరుద్రని సంప్రదించి తెలుగు నేటీవిటీకి తగ్గట్లు ఆ రేంజ్ కథ రాయమని కోరారు. దీంతో ది గుడ్, ది బ్యాడ్ అండ్ అగ్లీ హాలీవుడ్ మూవీ ప్రేరణతో ఆరుద్ర ఈ సినిమా కథ రాశారు.
మోసగాళ్లకు మోసగాడు సిన్మాని కృష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్‌పై నిర్మించారు. ఆ రోజుల్లోనే బడ్జెట్ రూ.8 లక్షలు.1971 ఆగస్టు 27లో తొలి తెలుగు కౌబాయ్ చిత్రంగా విడుదలైన మోసగాళ్లకు మోసగాడు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. బాక్సాఫీస్ దగ్గర 50కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత 50కోట్ల గ్రాస్ సాధించిన మూడో హీరోగా కృష్ణ నిలబడ్డారు. మోసగాళ్లకు మోసగాడు సిన్మా తమిళంలో మొసక్కరనుక్కు మొసక్కరన్, హిందీలో గన్‌ఫైటర్ జానీ పేరుతో రిలీజైంది. అక్కడ కూడా రెస్పాన్స్ అదిరిపోవటంతో కృష్ణ ఈ సినిమా నిడివిని తగ్గించి ది ట్రెజర్ హంట్ పేరుతో ఇంగ్లీష్ వెర్షన్‌లో రిలీజ్ చేశారు. దీంతో అక్కడ కూడా సిన్మా హిట్‌కొట్టింది. తెలుగు నుంచి ఇంగ్లీష్‌కు డబ్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీగా మోసగాళ్లకు మోసగాడు రికార్డు సృష్టించింది. అందుకే కృష్ణకి ఎవరూ సాటిలేరు. ఎవరూ రాలేరు.