దర్శకేంద్రుడు వర్సెస్‌ తమ్మారెడ్డి.. మధ్యలో నాగబాబు

By KTV Telugu On 10 March, 2023
image

ట్రిపులార్‌. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ రేసులో నిలిచిన తెలుగుచిత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మన సిన్మా విశ్వవేదికపై నాటుకొట్టుడు కొడుతుందనే నమ్మకం పెరిగింది. కచ్చితంగా అవార్డు అందుకుంటామన్న నమ్మకంతోనే దర్శకుడు రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌, కీరవాణి, చంద్రబోస్‌ అంతా అక్కడే ఉన్నారు. ఈ సమయంలో టాలీవుడ్‌లో ముఖ్యుల కీచులాట ఇండస్ట్రీ పరువు తీస్తోంది. ఓపక్క ట్రిపులార్‌ని ఆ సిన్మా యూనిట్‌ మిగిలిన ప్రముఖులు కష్టపడి ప్రమోట్‌ చేస్తుంటే సీనియర్‌ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన అప్రస్తుత వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. ఆస్కార్‌ ట్రిప్పులకోసం పెట్టిన ఫ్లైట్ల ఖర్చే 80కోట్లదాకా ఉంటుందన్న తమ్మారెడ్డి.. ఆ డబ్బుతో ఎనిమిది సిన్మాలు తీయొచ్చని కామెంట్‌ చేశారు.

తమ్మారెడ్డి కామెంట్స్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇండస్ట్రీలో సీనియర్‌గా ఆ సిన్మాకి అవార్డు రావాలని కోరుకోవాలి. కానీ అక్కడికి వెళ్లడం దండగన్నట్లు మాట్లాడటంతో సహజంగానే చాలామందికి కాలుతోంది. ప్రాంతీయ సిన్మా పరిశ్రమల్లోనే వంద రాజకీయాలు ఉంటాయి. అలాంటిది ఆస్కార్‌ రేసులో నిలవడం మద్దతు కూడగట్టుకోవడం మామూలు విషయం కాదు. మన సిన్మాకి ఆస్కార్‌ వస్తే అది టాలీవుడ్‌కే గర్వకారణం. జపాన్‌లాంటి దేశంలోనూ సిన్మాని నెత్తిన పెట్టుకున్నారు. తమ్మారెడ్డి ఆ విషయం మర్చిపోయినట్లున్నారు. రానుపోను ఖర్చులు ఎక్కువే అయ్యుండొచ్చు. కానీ అకాడమీ అవార్డు వస్తే అవన్నీ లెక్కలోనివే కావు. అందుకే తమ్మారెడ్డి వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. నాగబాబు కూడా తన స్టయిల్‌లో స్పందించారు.

సిన్మాకు ఆస్కార్‌ ప్రమోషన్‌కోసం రూ.80 కోట్లు ఖర్చన్న తమ్మారెడ్డి వ్యాఖ్యలను రాఘవేంద్రరావు తప్పుపట్టారు. అంత ఖర్చయిందని చెప్పటానికి మీ దగ్గర అకౌంట్స్‌ ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. జేమ్స్‌ కామెరూన్‌ స్పీల్‌బర్గ్‌ వంటి హాలీవుడ్‌ పాపులర్‌ దర్శకులు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా అంటూ దర్శకేంద్రుడు సూటిగా ప్రశ్నించారు. నటుడు నాగబాబు కడుపుమండి సహజధోరణితో కాస్త గట్టిగానే మాట్లాడారు.
దీంతో తమ్మారెడ్డి భరద్వాజ తాను కూడా అదే స్థాయిలో స్పందించగలనంటూనే తనకు సంస్కారం ఉందన్నారు.

విద్యార్థుల సెమినార్‌లో తాను మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండున్నర గంటల పాటు తాను సినిమాల గురించి మాట్లాడితే అసలు విషయాన్ని వదిలేసి అందులో ఓ క్లిప్‌ని తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని తమ్మారెడ్డి అసహనం వ్యక్తంచేశారు. ఒకరు అకౌంట్లు అడగుతున్నారు. ఒకరు అసభ్య పదజాలంతో తిడుతున్నారు. చాలా అసహ్యంగా ఉందని తమ్మారెడ్డి రియాక్ట్‌ అయ్యారు. నాకు గుర్తింపు సమస్యలేదని దానికోసం పాకులాడాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఎత్తిపొడిచారు. మరి ఈ వివాదానికి తెరపడుతుందో లేదోగానీ ఈ సందర్భంగా ఓ సిన్మాలో రావు రమేష్‌ డైలాగ్‌ అందరికీ గుర్తుకొస్తోంది. శత్రువులు ఎక్కడో ఉండరు ఇంట్లో కూతుళ్లు పెళ్ళాల రూపంలో మన చుట్టే ఉంటారని. సిన్మాఇండస్ట్రీలో కూడా అంతే.