మొన్న కశ్మీరీ ఫైల్స్ నేడు కేరళ స్టోరీ. రెండు సినిమాల విషయంలోనూ రాజకీయ పార్టీల్లో స్పష్టమైన చీలిక. మతోన్మాదం రాజేస్తున్నారంటూ రెండు సినిమాల పట్ల బిజెపి వ్యతిరేక పార్టీలు భగ్గుమన్నాయి. బిజెపి మాత్రం ఈ రెండు సినిమాలు అద్భుతాలే అని కొనియాడుతోంది. ఇటువంటి సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని కూడా కమలనాథులు అంటున్నారు. ఈ సినిమాలను వ్యతిరేకించే వారిని ద్రోహులుగానే చూస్తున్నారు వారు. లవ్ జీహాద్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ది కేరళ స్టోరీ చిత్రంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ మూవీకి మద్దతుగా నిలుస్తుండగా కొన్ని రాష్ట్రాలు సినిమాపై ఆంక్షలు విధించడం హాట్‌టాపిక్‌గా మారింది. కేరళకు చెందిన ముగ్గురు మహిళలు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి ఐసిస్ ఉగ్రవాద సంస్థలోకి వెళ్లడమనేది కేరళ స్టోరీ కథ. గతంలో కశ్మీరు ఫైల్స్ లోనూ హిందువులను ముస్లింలు ఊచకోత కోసిన అంశాన్ని హైలెట్ చేశారు. అయితే అప్పట్లో అది ఏకపక్షంగా చిత్రీకరించారని ఒకమతంపై విద్వేషం రగిల్చే ఉద్దేశంతోనే సినిమా తీశారని వామపక్ష మేథావులు ఆరోపించారు. అయితే సినిమా మాత్రం పెద్ద హిట్ అయ్యింది. దాన్ని బిజెపి మెచ్చుకుంది కూడా. కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే ఇపుడు మరోసారి కేరళ స్టోరీలోనూ మతాల మధ్య చిచ్చు రేపేలా సినిమా తీశారని ఆరోపణలు వచ్చాయి. సున్నితమైన అంశాలను వివాదస్పదం చేస్తూ సినిమాలు తీయడం తగదని బిజెపియేతర పార్టీలు విమర్శించాయి.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సినిమాపై నిప్పులు చెరిగారు. ఇటువంటి సినిమాలు ప్రదర్శించడానికి వీల్లేదన్నారు. ఈ సినిమా ప్రదర్శనపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే దానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈనెల 15న పిటిషన్ లోని ఆరోపణలపై ఇరు వర్గాల వాదనలు వింటామని సుప్రీం పేర్కొంది . ఈ కేసును అత్యవసరంగా లిస్ట్ చేయాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది సీజేఐ ధర్మాసనం. ఈ విషయంలో కేరళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందా అని ప్రశ్నించగా సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరించినట్లు సిబల్ తెలిపారు. కేరళ స్టోరీ చిత్రాన్ని కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ప్రభుత్వాలు కేరళ స్టొరీ సినిమాపై కొరడా ఝుళిపించాయి. బిజెపితో నిత్యం సమరం చేసే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమతా బెనర్జీ బెంగాల్ లో కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించారు. సినిమా కారణంగా రాష్ట్రంలో మతాల మధ్య వైషమ్యాలు పెరిగి హింసాయుత దాడులకు ఆస్కారం ఉండచ్చన్న కారణంతోనే సినిమాని నిషేధించినట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా నిలిచింది బెంగాల్.
అయితే మమతా బెనర్జీ అమాయకులైన కేరళ అమ్మాయిల పక్షాన ఆలోచించకుండా ఇస్లాం ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేలా వ్యవహరించడం దుర్మార్గమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ కూటమిలో ఉంటూ బిజెపితో రోజూ పోరాటం చేస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కేరళ స్టోరీ విషయంలో సీరియస్ గానే ఉన్నారు. తమిళనాడులో కొన్ని థియేటర్లే సినిమా ప్రదర్శనను నిలిపివేశాయి. కలెక్షన్లు తగ్గడం వల్లనే సినిమాను తమ థియేటర్ల నుండి తీసేసినట్లు థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి. దీనిపై చిత్ర నిర్మాతలు సీరియస్ అయ్యారు. ఈ వైఖరిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. కేరళ స్టోరీ నిర్మాతను బహిరంగంగా ఉరి తీయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎన్సీపీ నేత జితేంద్ర అవాద్. కశ్మీర్ ఫైల్స్ చిత్రం తరహాలోనే ది కేరళ స్టోరీకి మద్దతుగా నిలుస్తున్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు. మధ్యప్రదేశ్ లోని బిజెపి ప్రభుత్వం ఇప్పటికే పన్ను మినహాయింపు ఇవ్వగా తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు స్వయంగా ట్వీట్ చేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఢిల్లీ బెంగళూరు సహా పలు చోట్ల ది కేరళ స్టోరీ స్పెషల్ స్క్రీనింగ్స్ నిర్వహిస్తున్నారు కమలం నేతలు.
గతంలో తాను నటించిన కశ్మీరీ ఫైల్స్ సినిమాకు వ్యతిరేకంగా రాద్ధాంతం సృష్టించిన వారే ఇపుడు కేరళ స్టోరీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్యమాలు చేస్తున్నారని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆరోపించారు. నేను ఇంత వరకు కేరళ స్టోరీ సినిమా చూడలేదు అయితే వాస్తవాలకు దగ్గరగా ఉండే ఇలాంటి సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావడం మాత్రం చాలా సంతోషంగా ఉందని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. వివేక రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీరీ ఫైల్స్ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు. కేరళ స్టోరీ సినిమా విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టించింది. యూట్యూబ్ లో దాని ట్రెయిలర్ విడుదల కాగానే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కర్నాటక ప్రచార సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అయితే కేరళ స్టోరీ సినిమాను మెచ్చుకున్నారు. తద్వారా దానికి మద్దతు తెలిపారు. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించిన కేరళ స్టోరీ సినిమాలో ఆదా శర్మ, యోగిత, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళకు చెందిన 32 వేల మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారని వారంతా కూడా ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరిపోయారన్నది కేరళ స్టోరీ ఇతివృత్తం. అయితే ఇంతమంది ఐసిస్ లో చేరినట్లు ఏంటి సాక్ష్యం ఆధారాలు ఎక్కడ అని అన్ని వర్గాల నుండి ప్రశ్నలు వెల్లువెత్తడంతో ఈ సంఖ్యను ముగ్గురు అమ్మాయిలుగా మార్చారు.
అలనాటి బాలీవుడ్ నటీమణి షబానా అజ్మీ దీనిపై తనదైన శైలిలో స్పందించారు. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా నిషేధించాలంటూ గతంలో కొందరు ఎలా డిమాండ్ చేశారో ఇపుడు కేరళ స్టోరీని నిషేధించాలంటూ మరికొందరు అలాగే డిమాండ్ చేస్తున్నారన్నారు. అయితే సెన్సార్ బోర్డు నుండి ఆమోదం పొందిన తర్వాత ఏ సినిమాని అయినా నిషేధించాలని అడిగే హక్కు ఎవరికీ లేదని షబానా అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టు పార్టీలు సినిమాపై విరుచుకు పడ్డాయి. లేనిపోని కథను తెరపైకి తెచ్చి సంఘ్ పరివార్ దృక్కోణంలో సినిమా తీసి ప్రజల మధ్య చిచ్చు రేపేలా సినిమా తీశారని ఆరోపించాయి. ఫాతిమా బా అనే అమ్మాయి కేరళ కు చెందిన ఓ హిందూ మహిళ . ఇస్లాం లోకి కన్వర్ట్ అయ్యాక ఐసిస్ ఉగ్రవాదుల్లో చేరిపోతుంది. చివరకు ఆఫ్ఘనిస్థాన్ జైల్లో బందీగా ఉంటుంది. ఫాతిమా బా గా ఆదాశర్మ నటించింది. కేరళలో నర్స్ గా పనిచేసే ఈమె ఉగ్రవాదిగా మారిపోతుంది. 2016 నుండి 2018 మధ్య కాలంలో వేలాదిగా కేరళ అమ్మాయిలు ఇస్లాంలోకి మారిపోయి ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారన్నది స్టోరీ లైన్.
అయితే భారత ప్రభుత్వ లెక్కలతో పాటు అమెరికా లెక్కల ప్రకారం మొత్తం భారత దేశం నుండి ఐసిసి ఉగ్రవాద సంస్థలో చేరిన వారు కేవలం 66 మందే. అది కూడా మొత్తం దేశం నలుమూలల నుండి. ముస్లిం జనాభా ఉన్న ఏదేశంతో పోల్చినా కూడా ఇది చాలా తక్కువే. అయితే కేరళ స్టోరీ సినిమాలో మాత్రం వాస్తవాలు పక్కన పెట్టి తప్పుదోవ పట్టించేలా కథ వండి వార్చారన్న విమర్శలు వచ్చాయి. సినీ క్రిటిక్స్ అయితే సినిమా గురించి గొప్ప రివ్యూలు ఇవ్వలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా మాత్రం త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ర్యాంక్ ఇచ్చింది. మిగతా వన్నీ సినిమాని డిజాస్టర్ గానే అభివర్ణించాయి. సినిమాని మరింతగా ప్రమోట్ చేసే పనిలో బిజెపి దాని అనుబంధ సంఘాలు బిజీగా ఉంటే దాన్ని విమర్శించే పనిలో బిజెపియేతర పార్టీలు నిమగ్నమై ఉన్నాయి. కేరళ స్టోరీ వివాదాస్పద మారిన వేళ చిత్ర దర్శకుడు ఇతర సిబ్బందికి గుర్తుతెలియని నంబర్ నుంచి బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేపింది. ఒంటరిగా బయటకు వెళ్లొద్దు మీరు మంచి పనులు చేయలేదంటూ బెదిరించాడు ఆగంతకుడు. ఈ విషయాన్ని ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు డైరెక్టర్ సుదీప్తో సేన్. దీంతో యూనిట్ సభ్యులకు భద్రత పెంచారు పోలీసులు.