ఓట్లు పడతాయా లేదా అన్నది తర్వాతి సంగతి. ప్రచారంలో ఓ స్టార్ ఉన్నాడంటే ఆ జోషే వేరు. అందుకే రాజకీయపక్షాలు ఎవరన్నా సిన్మా సెలబ్రిటీ ఆసక్తిచూపగానే క్షణం ఆలస్యం చేయకుండా కండువాలు కప్పుతుంటాయి. తెలుగుదేశానికి అలాంటి పర్మినెంట్ బ్రాండ్ అంబాసిడర్ బాలయ్యే. నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న మాస్ నటుడు. హిందూపురం ఎమ్మెల్యే. చంద్రబాబుకు స్వయానా బావమరిది వియ్యంకుడు. ఇక బావ కళ్లల్లో ఆనందం చూడాలనే ఉంటుంది కదా.
ఒకప్పుడు ఎన్టీఆర్‌కి ఘన విజయం కట్టబెట్టింది సిన్మా బ్యాక్‌గ్రౌండే. చిరంజీవి రాజకీయంగా భంగపడ్డా ఆయన పొలిటికల్ బొమ్మ ఆ మాత్రమన్నా ఆడిందంటే అది మెగాస్టార్‌గా ఆయనకున్న క్రేజ్‌తోనే. ఇప్పుడే పవన్‌కళ్యాణ్ హడావుడి కూడా ఆ కోటాలోనే. పవన్‌కళ్యాణ్ అయినా పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయాడుగానీ బాలయ్య మాత్రం హిందూపురంనుంచి తొడగొట్టి గెలిచాడు. బాలయ్య సిన్మా వస్తోందంటేనే ఫ్యాన్స్‌కి ఫుల్లు కొట్టినంత కిక్కొచ్చేస్తుంది. ఇప్పుడు వీరసింహారెడ్డి సిన్మా ప్రమోషన్ దుమ్మురేపింది. ఈ సిన్మా ప్రమోషన్ బాధ్యతను టీడీపీ తీసుకుందేమోనన్నంత హడావుడి కనిపించింది. ఒంగోలులో ఈ సిన్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ చేయడానికి ప్రకాశం టీడీపీ శక్తివంచనలేకుండా కష్టపడింది. కార్యకర్తలను తరలించి ప్రోగ్రాంని హిట్ చేయించే బాధ్యతని ఒంగోలు మాజీ ఎమ్మెల్యేనే భుజాన వేసుకున్నారని సమాచారం. పాసులిచ్చి మరీ పొలిటికల్ మీటింగ్‌లా జనసమీకరణ చేశారంటున్నారు.
ఇక ఒంగోలులో జరిగిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిన్మా డైరెక్టర్ గోపీచంద్ మలినేని వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి థాంక్స్ చెప్పారు. కార్యక్రమం విజయవంతం కావడానికి బాలినేని ఎంతో సహకరించారంటూ సభాముఖంగా డైరెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ప్రోగ్రాంలా జరిగిన ఈవెంట్‌లో వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తావన ఆసక్తికలిగించింది. డైరెక్టర్ గోపీచంద్‌ది ప్రకాశం జిల్లానే. తన సొంత గడ్డపై ఈ ఫంక్షన్ జరగాలని కోరుకున్న గోపీచంద్ దానికోసం ఎమ్మెల్యే బాలినేని సహకారం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. బాలినేని చొరవతోనే ఏ ఇబ్బందీ లేకుండా ఫంక్షన్‌కు అనుమతులు వచ్చాయని, కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోయిందని చెబుతున్నారు. సిన్మాలో వైసీపీమీద సెటైర్ డైలాగులున్నా ఫంక్షన్‌కి అదే పార్టీ నాయకుడి సహకారం తీసుకోవడం వింటానికి వెరయిటీగానే ఉంది.