అభిమానులకు దేవుడు ఆ ధృవతార

By KTV Telugu On 17 November, 2022
image

తెలుగు సినీ పరిశ్రమలో నేలకొరిగిన నాలుగో స్థంభం
దివికేగిన నటశేఖరుడు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగో స్థంభం నేలకొరిగింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వెళ్లిపోయిన తర్వాత నేనూ వస్తున్నానంటూ నటశేఖరుడు దివికి పయనమయ్యాడు. సగటు సినీ అభిమాని ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయాడు. సూపర్ స్టార్ లేని లోటును భరిస్తూ గడిపెయ్యాల్సిందేనా అన్నది వారు వేసుకుంటున్న ప్రశ్న.

కృష్ణ ఒక వ్యవస్థ
ఆర్టిస్టులకు ఆయన మినిమమ్ గ్యారెంటీ
నిర్మాతలు నిశ్చింతగా ఉండగలిగే హీరో

ఘట్టమనేని శివరామకృష్ణమూరి. ఒక సాధారణ నటుడు కాదని చెప్పేందుకు వెనుకాడకూడదు. ఆయన ఒక వ్యవస్థ. సినీ సామ్రాజ్యాన్ని సింహాసనంపై కూర్చుని శాసించిన నాయకుడాయన. ఆర్టిస్టులకు ఆయన మినిమమ్ గ్యారెంటీ. 24 క్రాప్ట్స్ కు ఆయనే దేవుడు. సినిమా సూపర్ హిట్ అయినా అట్టర్ ప్లాప్ అయినా నిర్మాతలు నిశ్చింతగా ఉండగలిగే హీరో ఎవరైనా ఉన్నారంటే ఆయనే కృష్ణ. అందుకే ప్రతీ ఒక్కరి హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.

కృష్ణకంటూ ఒక భారీ ఫ్యాన్ ఫోలోయింగ్
కృష్ణ అభిమానులు పట్టువదలని విక్రమార్కులు
1970లు…1980లల్లో మాస్ హీరో
అత్యధిక డ్రెస్సులో కనిపించిన హీరో కూడా ఆయనే

నటసార్వభౌముడు ఎన్టీఆర్ సినీ పరిశ్రమను ఏలుతున్న రోజుల్లో సైతం కృష్ణకంటూ ఒక భారీ ఫ్యాన్ ఫోలోయింగ్ ఉండేది. బీ క్లాస్, సీ క్లాస్ ప్రేక్షకులకు ఆయనే మాస్ హీరో. ఏడాదికి 19 సినిమాలు చేయగల కథానాయకుడు కూడా ఆయనే. అందుకే ఆయన అభిమానులు పట్టువదలని విక్రమార్కులనే చెప్పాలి. 1970లు,1980ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా కేంద్రాల్లో ఎక్కడ చూసినా కృష్ణ కటౌట్లే కనబడేవి జనంపై కృష్ణ గారడీ పనిచేసేది. మా కృష్ణ గారు ఈ సినిమాలో 47 డ్రెస్సులు మార్చారా అని గొప్పగా చెప్పుకునేందుకు ఫ్యాన్స్ ఇష్టపడేవారు. ఇక మల్టీస్టారర్ సినిమాల్లో అయితే సెకెండ్ హీరో కంటే కృష్ణగారికి ఎక్కువ ఎలివేషన్ ఇవ్వాలని ఎక్కువ డ్రెస్సులు ఆయనకే ఉండాలని ఫ్యాన్స్ గొడవలు చేసేవారు. మద్రాసు వెళ్లి కృష్ణ దగ్గర విజ్ఞప్తులు కూడా చేసేవారనుకోండి.

ఈ సినిమా కాకపోతే మరో సినిమా అనుకునే ఫ్యాన్స్
పట్టణాల్లో ఏ మూల చూసినా పది మంది కృష్ణ అభిమానులు

మొదటి రోజే సినిమా అడ్డం కొట్టినా కృష్ణ అభిమానులు ఎన్నడూ నిరాశ చెందిందీ లేదు. ఏమీ కాదులే వచ్చే వారమే ఇంకో సినిమా వస్తుంది. అది హండ్రెడ్ డేస్ గ్యారెంటీ అని ప్రచారం చేసేవాళ్లు. టీవీలు, సెల్ ఫోన్లు లేని ఆ రోజుల్లో పట్టణాల్లో సాయంత్రం పూట ఏ మూల చూసినా పది మంది కృష్ణ అభిమానులు నిల్చుని సూపర్ స్టార్ మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. నెక్ట్స్ మూవీ ఎలా ఉంటే బావుంటుందని లెటర్లు రాసి మద్రాసులో కృష్ణ ఇంటికి పోస్ట్ చేసేవారు.

మెత్తగా కనిపించే అగ్రెసివ్ ఫ్యాన్స్
ఫ్యాన్స్ కోసం ఎప్పుడూ తెరిచి ఉండే కృష్ణ నివాసం తలుపులు
అభిమానులకు కృష్ణ కుటుంబ సభ్యులంతా ఫ్రెండ్స్

కృష్ణ అభిమానులు చాలా డిఫరెంట్. మెత్తగా కనిపించే అగ్రెసివ్ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు చేసేవారు. అందరితో కలిసిపోయేవారు. కృష్ణను ఎవరైనా విమర్శించినా సినిమా ఫ్లాప్ అయిందని ఎవరైనా ఎగతాళి చేసినా పిచ్చికొట్టుడు ఖాయం. విషయం పోలీసు స్టేషన్ దాకా చివరకు రాజీ మార్గాలు వెదకాల్సి వచ్చేది. అభిమానుల కోసం కృష్ణ నివాసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఏ రోజు, ఏ టైమ్ లో వెళ్లినా కృష్ణను కలిసే అవకాశం ఉండేది. 50 శాతం పైగా అభిమానులు కృష్ణ కుటుంబ సభ్యులకు పరిచయస్తులే. కృష్ణ గారి మాతృమూర్తి ఆయన అభిమానులను పేరు పెట్టి పిలిచే వారని చెబుతారు. పేద ఫ్యాన్స్ కు ఆమె ఆర్థికసాయం చేస్తారని అంటారు. అందుకే కృష్ణ ఫ్యాన్స్ ఒక ఫ్యామిలీ. వారిది ఒక కుటుంబ వ్యవస్థ.