బుర్రిపాలెం బుల్లోడు తారల్లో కలిసిపోయాడు
కోట్లమంది అభిమానుల ఆరాధ్యనటుడు ఇక లేడు. సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూతతో ఆయన అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరిన కృష్ణ(79) చికిత్సపొందుతూ తుదిశ్వాసవిడవటంతో చిత్రపరిశ్రమ విషాదం అలుముకుంది. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో కృష్ణ స్వగ్రామం. 1942 మే 31న వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు.
అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆయనకెంతో ఆసక్తి. 1965లో కృష్ణ ఇందిరను పెళ్లాడారు. వీరికి ఐదుగురు సంతానం. తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. కొంతకాలం క్రితం విజయనిర్మల, ఇటీవలే ఇందిర కన్నుమూశారు. ప్రముఖహీరో మహేష్‌బాబు ఆయన కుమారుడు.
1964లో ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన తేనె మనసులు సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలైంది. ఆ సినిమా ఘన విజయం సాధించింది. రెండో సినిమా కన్నె మనసులులో నటిస్తుండగానే గూఢచారి 116లో కృష్ణకు అవకాశం వచ్చింది. తెలుగులోనే తొలి జేమ్స్‌బాండ్ సిన్మాగా గూఢచారి 116 హీరోగా కృష్ణ జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ సిన్మాతో కృష్ణకు ఏకంగా 20 సినిమాల్లో అవకాశం వచ్చింది. బాపు తీసిన పూర్తి ఔట్‌డోర్ చిత్రం సాక్షి కృష్ణ ఇమేజిని పెంచింది. విజయనిర్మలతో ఆయన కలిసి నటించిన మొదటిచిత్రం అది. 70-71వ దశకంలో కృష్ణ సిన్మాలు ఏడాదికి కనీసం పది విడుదలయ్యేవి. 1968లో 10 సినిమాలే రికార్డు అనుకుంటే 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలతో తిరుగులేని కథానాయకుడిగా కృష్ణ అవతరించారు. అవిశ్రాంతంగా రోజుకు కృష్ణ మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరుతెచ్చుకున్న కృష్ణ నాలుగు దశాబ్దాల్లో 340 సినిమాల్లో నటించారు. 1970లో పద్మాలయ నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. స్వీయ దర్శకత్వంలో 16 సినిమాలు తెరకెక్కించారు. వెండితెరపై కొత్త ప్రయోగాలు ఆయన సొంతం. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) అన్నీ కృష్ణవే.