అంతా చట్టబద్దమే..నయన జోలికి వెళ్లలేరు!

By KTV Telugu On 26 October, 2022
image

విఘ్నేష్‌ శివన్‌తో కొన్నేళ్ల సహజీవనం. పెళ్లయిన నాలుగునెల్లకే సంతానం. కవలపిల్లల్ని ఎత్తుకుని నయనతార దంపతులు ప్రత్యక్షమైతే ఏమిటీ వింతని అంతా నోరెళ్లబెట్టారు. సెలబ్రిటీ కపుల్స్‌ కదా. తలుచుకుంటే పిల్లలు కొదవా ఏంటి! కరెన్సీతో కొట్టి సృష్టికి ప్రతిసృష్టి చేయగలరు. కానీ కొంతమంది చాదస్తం బ్యాచ్‌ ఉంటారుగా..అనైతికమనీ, చట్టవిరుద్ధమని నానా గొడవ చేశారు. కోర్టుకీడుద్దామనుకున్నారు. కానీ చివరికేమైంది…ఇంతకంటే ఏమవుతుంది? పెళ్లి, సంతానం అంతా చట్టబద్ధమేనని కమిటీ క్లీన్‌చిట్‌ ఇచ్చేసింది. నయనతార దంపతుల కవల సంతానం దుమారం రేపింది. మరీ పెళ్లయిన నాలుగు నెల్లకే నయన-విఘ్నేష్‌ జంట కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో సరోగసి నిబంధనలు పాటించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. సెలబ్రిటీ కపుల్‌ని వదిలేశామన్న అపప్రద ఎందుకని తమిళనాడు ప్రభుత్వం ‘విచారణ’కు ఆదేశించింది. కమిటీ కూడా లాంఛనంగా నివేదిక సమర్పించింది. ఏమిచ్చిందన్న ఉత్కంఠకు అవకాశమే లేదు. నయనతార దంపతుల సరోగసి చట్టబద్ధమేనని కమిటీ తేల్చేసింది.

కమిటీ నివేదిక ప్రకారం 2021 నవంబరులోనే సరోగసికి ఒప్పందం జరిగింది. నయనతార, విఘ్నేష్ కవలపిల్లల విషయంలో నిబంధనలు ఉల్లంఘించలేదు. ఎందుకంటే 2016లోనే వీళ్లిద్దరికీ పెళ్లయిపోయింది. పిల్లల్ని కంటానికి ఏడాది ముందే సరోగసికి సంబంధించి అగ్రిమెంట్ జరిగింది. నయన-విఘ్నేష్‌లకు ఎలాంటి ఇబ్బందీ లేదని త్రిసభ్య కమిటీ నివేదికతో తేలిపోయింది. అంతా చట్టబద్ధమే. అఫీషియల్‌గా తమిళనాడు ప్రభుత్వం అదే చెప్పబోతోంది. గుండెలు బాదుకునేవాళ్లు సైలెంట్‌గా ఉండటం బెటర్‌. ఎందుకంటే ఎంత చించుకున్నా మిగిలేది కంఠశోషే!