తెలంగాణ, ఏపీ కొంప కొలంబో – ఈ పథకం అక్కడ ఇక్కడ సేమ్ టు సేమ్ !

By KTV Telugu On 1 June, 2022
image

శ్రీలంకకీ మనకి అసలు పోలిక ఉందా…? తెలుగు రాష్ట్రాలు కూడా దివాళా తీస్తాయ్, పథకాలు మన కొంప ముంచుతాయ్ అనే ఆందోళనలకి అసలు కారణం ఏంటి…? వాస్తవాలు మీ ముందుకు తెచ్చేందుకు కే టీవీ సిద్ధమైంది. వరస కథనాలు అందిస్తోంది. అసలు లంకతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం.

మన పొరుగున ఉన్న ద్వీపదేశం శ్రీలంక ఆర్థిక వ్యవస్థ తునాతునకలైంది. లీటర్ పెట్రోల్ 400 రూపాయలు దాటిపోయి చాలా రోజులైంది.  కుటుంబాల్లో తిండి ఖర్చులు 500 శాతం పెరగడంతో ఆదాయ మార్గాల్లేక జనం రోడ్లెక్కారు. వాహనాలు తగులబెట్టారు. ఎంపీలపై దాడి చేసి కొట్టారు చివరకు ప్రధాని రాజీనామా చేసి వెళ్లిపోయారు. దేశానికి అప్పులు పెరిగిపోయి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోలేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పాల్సి. ఇప్పుడు తెలుగు రాష్టాలు కూడా శ్రీలంక తరహాలోనే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అప్పులు కుప్పలుగా మారిపోయాయి. ఆదాయం మూరెడు, అప్పులు బారెడు అన్నట్లుగా లోటు బడ్జెట్లతో సతమతమవుతున్నాయి. ఆదుకోవాల్సిన కేంద్రప్రభుత్వం ఇక మా వల్ల కాదు బాబూ అంటూ చేతులెత్తేసింది..

కొంపముంచి హామీలు

ఎన్నికల్లో గెలుపు కోసం శ్రీలంక అధికార పార్టీ ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చింది. వాటిని అమలు చేసేందుకు నానా తంటాలు పడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ  అదే పరిస్థితి నెలకొంది. ఉచిత పథకాలతో ఏపీ,  తెలంగాణలో ఖజానా ఖాళీ అవుతోంది. ఇల్లు కదలే అవసరం లేకుండానే జనానికి నెల గడిచిపోయే పరిస్థితి ఉంది. ఇంటి వద్దకే రేషన్ తెచ్చి ఇస్తున్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో రెండు పథకాలు అమలు తలకు మించిన భారమైంది. సొంత షాపులు ఉన్నవారికి జగనన్న చేదోడు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పథకాలు అమల్లో ఉన్నాయి.

రైతులను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి.తొలుత తెలంగాణలో రైతు బంధు మొదలైంది. తర్వాత ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి పథకాలనే ప్రవేశ పెట్టింది. పెన్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. పెన్షనర్ల సంఖ్య కూడా పెరగడం కారణంగా ఆ ఖాతాలో ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించలేకపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో సామాజిక వర్గాల వారీగా పథకాలు ఉన్నాయి. గొర్రెల పంపిణీ, చేనేత లక్ష్మీ ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు పార్టీలకు మహిళా ఓటర్లే టార్గెట్. వారిని ఆకర్షించేందుకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, బతుకమ్మ చీరెలు వస్తూనే ఉంటాయి.

అప్పులకే సరిపోతున్న ఆదాయం

దేశాన్ని పాలించిన నేతలే శ్రీలంకను ముంచేశారు. ఇప్పటి పాలకులే కాకుండా గత పాలకులు కూడా  శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఒకరికి మించి ఒకరు ఆర్థిక విధ్వంసానికి పాల్పడటమే కాక… ఇష్టారీతిన అప్పులు చేశారు. అప్పులు చేయడం, వాటికి వడ్డీ కట్టడంతో అనుత్పాదక వ్యయం పెరుగుతుంది. నిజమైన అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. నిజానికి అడిగినప్పుడల్లా అప్పులిచ్చి  శ్రీలంకను అథోగతి పాలు చేసిన ఘనత ఆసియా అగ్రరాజ్యం చైనాకు దక్కుతుంది..శ్రీలంకప్రభుత్వానికి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేందుకు ఖజానాలో  పైసా లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్పాదక వ్యయం చేసేందుకు నిధులు లేవు వచ్చిన ఆదాయం అప్పులు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీకే సరిపోతోంది.

సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్లు సంతోషంగానే ఉంటారు. అప్పులు పెరిగిపోయి రాష్ట్రాల్లే దివాలా తీస్తాయి.. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన ఒక సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ప్రస్తావనకు వచ్చాయి. ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాలు అప్పులు చేసుకుంటూ పోవడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరిస్తోంది. ఏపీ అప్పులైతే జీఎస్డీపీలో 60 శాతానికి చేరుకునే ప్రమాదం ఉంది. పైగా  ప్రతీ నెల రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులు ఢిల్లీలో మకాం వేసి కొత్త అప్పులకు పర్మీషన్లు అడుగుతున్నారు. ఈ పరిస్థితి పోయినప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయి….