ఇలాంటి తప్పులు మళ్లీ చేయకూడదు బాబూ…?

By KTV Telugu On 22 November, 2022
image

ఒక్క మాటకు వంద విశ్లేషణలు.
వచ్చే ఎన్నికలే లాస్ట్ ఛాన్స్ అవుతాయన్న చంద్రబాబు.
పార్టీలో అంతర్లీనంగా పుట్టుకొస్తున్న కొత్త సమస్యలు.
ఒకటి రెండు సార్లు ఓడిపోతే రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనా.
ఓడి గెలిచిన నితీశ్.
సుదీర్ఘ విరామం తర్వాత రెండో సారి బిజు పట్నాయక్ సీఎం.
పదేళ్లు విపక్షంలో ఉన్న టీడీపీ.
ఇప్పుడు ఐదేళ్లు కాకుండానే తొందరెందుకో.
పటిష్టమైన పార్టీని కొత్త తరానికి అప్పగించొద్దా !

లాస్ట్ చాన్స్… రాజకీయాలకు పనికొచ్చే మాటేనా. అంతటి నిరాశావాదంతో పాలిటిక్స్ లో మనుగడ సాధ్యమా. అర్థం పర్థం లేని డైలాగులతో కేడర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారా ? అసలు చంద్రబాబు చేస్తున్నదీ సహేతుకమేనా ?

చంద్రబాబు ఒక మాటకు వంద రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమ అధినేత మాస్టర్ స్ట్రోక్ కొట్టారని పార్టీలో కొందరు నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు. ఇప్పటికైనా జనం అర్థం చేసుకుని చంద్రబాబుకు ఓటెయ్యాలని టీడీపీ అనుకూల వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా అంతర్లీనంగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. 2024లో జరిగే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అవుతాయని చంద్రబాబు అనడం సహేతుకం కాదన్న వాదన ఇప్పుడు బలపడుతోంది.

ఒకటి రెండు సార్లు ఓడిపోతే రాజకీయ జీవితం ముగిసిపోయినట్లు కాదు. అదే నిజమైతే దేశంలో కమ్యూనిస్టు పార్టీలే ఉండేవి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వారే కాదు. బిహార్ సీఎంగా ఇప్పుడు రికార్డ్ సృష్టించిన నితీశ్ కుమార్ తన రాజకీయ జీవిత ప్రారంభంలో వరుస వైఫల్యాలు చవిచూశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్ రెండు సార్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. మొదటి సారి సీఎం కావడానికి రెండో సారి ఆ పీఠంపై కూర్చోవడానికి కనీసం పాతికేళ్ల దూరం ఉంది. వాళ్లెవరూ నిరాశావాదాన్ని ప్రదర్శించే లేదు చంద్రబాబు మాత్రం అలా ఎందుకు భయపడుతున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

టీడీపీ అధికారపక్షం నుంచి ప్రతిపక్షంగా మారిన తర్వాత కేడర్ కొంత నిర్వీర్యమైన మాట వాస్తవం. వైసీపీ అధినేత జగన్ చూపిస్తున్న దూడుకుతో పాటు ప్రభుత్వం పెడుతున్న కేసులు కూడా వారిలో కొంత ఆందోళనకు కారణమవుతోంది. పైగా చంద్రబాబు నిదానంగా నిర్ణయాలు ప్రకటించడం, నియోజకవర్గాల ఇంఛార్జ్ ల నియామకంలో అలసత్వం వారిని మరింతగా కృంగదీశాయి. బాదుడే బాదుడు లాంటి కార్యక్రమాల ద్వారా పార్టీ అధినేత జనంలో ఉంటూ కేడర్లోని నిరాశను పోగొడుతున్న తరుణంలోనే ఆఖరి ఛాన్స్ అంటూ వదిలిన డైలాగుతో పరిస్థితి మొదటికొచ్చింది.

రాజకీయ పార్టీలు సుదీర్ఘకాలం మనుగడ సాగించాలి. అధికారంలేనప్పుడు ఉద్యమాలు నిర్వహిస్తూ అధికారం దిశగా అడుగులు వేయాలి. అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత పార్టీ పగ్గాలను తదుపరి తరం చేతిలో పెట్టాలి. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా నిరాశావాద ప్రకటనలిస్తున్నారు. అధికారాన్ని కోల్పోయి ఐదేళ్లు కూడా నిండకముందే అంత టెన్షన్ ఎందుకు వచ్చింది, సెంటిమెంట్ కార్జును ఎందుకు వాడాల్సి వచ్చిందని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. గతంలో పదేళ్లు విపక్షంలో ఉండి మళ్లీ అధికారానికి రాలేదా. ఒక టర్మ్ ప్రతిపక్షంలో ఉన్నందుకే ఇంతగా ఫీలైపోవాలా అన్ని కేడర్ ప్రశ్నించుకుంటున్నారు.

అసెంబ్లీలో తన భార్య పట్ల అవమానకర పదజాలం వాడారని ప్రెస్ మీట్ లో చంద్రబాబు భోరున ఏడ్చారు. ప్రత్యర్థులకు అదో ఆయుధంగా పనికొచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు పిరికివాడంటూ కథనాలు వండి వార్చారు. సాధరణంగానే చంద్రబాబుకు భయస్తుడన్న పేరుంది. బెదిరిస్తే పార్టీ టికెట్ ఇచ్చేస్తారని చెబుతారు. పార్టీ శ్రేణుల మనోధైర్యం దెబ్బతిన్న తరుణంలో ఇలా లాస్ట్ ఛాన్స్ అంటూ మాట్లాడటం సరికాదని పార్టీ కేడరే చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేయకుండా ఉంటే మంచిది.