అపర కుబేరుడికి అదో గుదిబండే
దారినపోయే కంపని తగిలించుకున్నట్లుంది ఎలాన్‌మస్క్ పరిస్థితి. ట్విటర్ టేకోవర్ తర్వాత ఇంటాబయటా బద్నాం అవుతున్నాడీ ప్రపంచ కుబేరుడు. పాశుపతాస్త్రం అవుతుందనుకున్న ట్విటర్ మస్క్ జేబుకి చిల్లు పెడుతోంది. ట్విటర్ కొనుగోలుకోసం ఎలాన్ మస్క్ మరికొన్ని టెస్లా షేర్లను విక్రయించారు. దీంతో షేర్ల విలువ మరింత పతనమై మస్క్ నికర సంపద 200 బిలియన్ డాలర్ల దిగువకు చేరింది. నవంబరు 4 నుంచి 8 మధ్య దాదాపు 19.5 మిలియన్ల షేర్లను మస్క్ అమ్మారు. గత ఆగస్టులోనూ 7 బిలియన్ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించారు.
ఇప్పటిదాకా ఎలాన్మస్క్ని ప్రపంచ కుబేరుడిగా నిలబెట్టింది టెస్లా షేర్లే. ట్విటర్కోసం ఆయన అమ్మేస్తుండటంతో టెస్లా షేరు ధర దారుణంగా పతనమైంది. ఒక్కరోజే టెస్లా షేరు 2.9 శాతం పతనమైంది. ఈ ఏడాది ఇప్పటిదాకా కంపెనీ స్టాక్ విలువ 52 శాతం తగ్గింది. ఆ దెబ్బతో ఎలాన్‌మస్క్ సంపద ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ జాబితాలో 200 బిలియన్ డాలర్లకంటే జారిపోయింది. సాంకేతికంగా ఆయనే లిస్ట్‌లో టాప్‌లో ఉన్నా ట్విటర్ దెబ్బకి సంపద మంచుకొండలా కరిగిపోయేలా ఉంది.
44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ని కొనుగోలుచేసిన మస్క్ మోర్గాన్ స్టాన్లీ సహా మరికొన్ని బ్యాంకుల నుంచి నిధులు సమకూర్చుకుంటున్నారు. కొంతమంది ఈక్విటీ ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. వారిలో ఎవరైనా తప్పుకుంటే మస్క్‌కి తడిసిమోపెడవుతుంది.
ట్విటర్ టేకోవర్ తర్వాత ఉద్యోగులమీద వేటేస్తున్నారు. బ్లూటిక్‌కి ఫీజు నిర్ణయించి యూజర్లతో ఛీ కొట్టించుకుంటున్నారు. ఇప్పుడు ట్విటర్ పిట్ట సంపదను తినేస్తుండటంతో మస్క్‌కి ఏం చేయాలో తోచడంలేదు. తప్పేదేముంది చేసుకున్నవాళ్లకి చేసుకున్నంతని ఊరికే అన్నారా.