గుజరాత్ లో ఢిల్లీ పాఠాలు… మోదీకి రివర్స్ లో కేజ్రీవాల్ ఎత్తులు

By KTV Telugu On 25 July, 2022
image

ఫ్రీ..ఫ్రీ…ఫ్రీ… మళ్లీ మొదలైందీ ఉచితాల వితరణ. గుజరాత్ ఎన్నికల్లో విజయం కోసం కేజ్రీవాల్ మళ్లీ ఉచితాల బాట పట్టారు. ఆప్ ను గెలిపిస్తే నెలకు 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అని హామీ ఇచ్చేశారు. దేశమూ, రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో ఉచితాల కరెక్టెనా… సమాజం ఒప్పుకుంటుందా.. ఓ సారి చూద్దాం..

రాజకీయ నాయకులు హామీలతో బతికేస్తున్నారు. జనం కూడా హామీలకు అలవాటు పడిపోయి ఓట్లేస్తున్నారు. అదే ధైర్యంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక హామీ ఇచ్చారు. గుజరాత్ లో ఆప్ గెలిస్తే గృహ వినియోగదారులకు నెలకు 300 యూనిట్ల కరెంట్ ఫ్లీగా ఇస్తామని చెప్పేశారు. జనం చీకుచింతా లేకుండా ఫ్యాన్లు, లైట్లు వేసుకోవచ్చని ఆశ చూపారు. పైగా గతేడాది డిసెంబరు 31 వరకు విద్యుత్ బకాయిలను కూడా మాఫీ చేస్తామన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుల పార్టీ అని అర్థం , సామాన్యులను ఆకట్టుకునేందుకు ఎలాంటి హామీలివ్వాలో పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ బాగానే రీసెర్చ్ చేశారు. ఇటీవలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా ఎదిగేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. ఆ దిశగానే హామీల వర్షం కురిపిస్తోంది. ఢిల్లీలో ఉచిత విద్యుత్ పథకం సక్సెస్ అయిన వేళ గుజరాత్ కు కూడా ఆ పథకాన్ని వర్తింప జేస్తామని కేజ్రీవాల్ ధైర్యంగా చెబుతున్నారు. ఆయన హామీ ఇచ్చిన వెంటనే బీజేపీ ఎదురుదాడి చేసింది. ప్రజలకు స్వీట్స్ పంచి… ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. దానికి కూడా కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. ఆలయంలో పంపిణీ చేసేవి స్వీట్్స కాదని అది ప్రసాదమని వివరణ ఇచ్చుకున్నారు. బీజేపీతో డైరెక్ట్ ఫైట్ కే ఆయన రంగంలోకి దిగారు…

ఆప్ తొలుత అధికారం చేపట్టిన ఢిల్లీలో ఇప్పుడు ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. 200 నుంచి 400 యూనిట్ల వరకు 50 శాతం వరకు సబ్సిడీ అంటే నెలకు 800 రూపాయలు సబ్సిడీ అందుతుంది. ఉచిత విద్యుత్ ప్రకటించడానికి ముందు అక్కడ 200 యూనిట్ల వరకు ప్రతి యూనిట్ కు రెండున్నర రూపాయలు ఛార్దీలు వసూలు చేసే వారు. ఢిల్లీలోని 50 లక్షల నివాసాలకు ఉచిత విద్యుత్ అందుతుండగా..  తొలి నాళ్లలో ఏడాదికి ప్రభుత్వం విద్యుత్ బోర్డుకు 1200 కోట్ల రూపాయలను సబ్సిడీగా చెల్లించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ భారం 3 వేల 20 కోట్లు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది 3 వేల 300 కోట్ల వరకు చేరుతుంది. దానితో కేజ్రీవాల్ ప్లాన్ బీ ని అమలు చేయబోతున్నారు. అక్టోబరు 1 నుంచి అడిగిన వారికి మాత్రమే ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన చెబుతున్నారు. అంటే… కట్టగలిగిన వాళ్లు విద్యుత్ ఛార్జీలు చెల్లించవచ్చు అన్నట్లుగా ఆయన సందేశమిచ్చారు.

అన్ని రాష్ట్రాల్లాగే గుజరాత్ కు అప్పులున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం అవి 3 లక్షల కోట్లుగా నిర్ధారించారు. అనధికారికంగా అంటే పెండింగ్ బిల్లులు లాంటివి మరో లక్ష కోట్లయినా ఉండొచ్చు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. కాగ్.. ఇటీవల గుజరాత్ ప్రభుత్వాన్ని హెచ్చరిచింది. అప్పుల్లో 61 శాతాన్ని ఎట్టి పరిస్తితుల్లో వచ్చే ఏడేళ్ల కాలంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్ర జీడీపీ 9 శాతం చొప్పున పెరుగుతుండగా, అప్పులు 11 శాతం చొప్పున పెరుగుతున్నాయి. నిజానికి ఢిల్లీ కంటే గుజరాత్ చాలా పెద్ద రాష్ట్రం. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ఉచిత విద్యుత్ హామీ  నెరవేర్చితే ఏటా మూడు నుంచి ఐదు వేల కోట్ల వరకు భారం పడుతుంది. కేజ్రీవాల్ వాదన మాత్రం మరోలా ఉంది. 27 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన అంటున్నారు. అవినీతిని నిరోధించగలిగితే ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యమేనని ఆయన వాదన….

ఉచిత హామీలకు జనం పడిపోవడం ఖాయం. గుజరాత్లో కేజ్రీవాల్ గెలవడం అంత సులభం కాకపోయినా.. విజయం సాధిస్తే మాత్రం ఉచిత విద్యుత్ ఇవ్వడం అంతే ఖాయం. ఏదేమైనా… రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడితే మాత్రం ఆర్థిక అవస్థలకు తెర తీసినట్లే అవుతుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు…