పేదలకు ఆకలి చావులేనా..
ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. నాగులో నాగన్న….ఇదీ పాత పాటే. ఇవాళ కూడా ఈ పాటకు రిలవెన్స్ ఉంది.. ఇండియాలో ఇంకా స్టార్ట్ కాని బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ధరలు పరిగెడుతుంటే, అలాంటి పాటలు పాడుకోక చేయగలిగిందేముంది. పెట్రోల్ ఇప్పటికే రూ. 150 దిశగా పరుగులు తీస్తోంది. వంట నూనెలు రూ. 200 టచ్ అవుతున్నాయి. కూరగాయలు… వాటిని అమ్మే వాడి ఇష్టం అన్నట్లుగా ఉన్నాయి. ఇక బియ్యమంటారా.. ఆ మాట వింటేనే భయమేస్తోంది. ప్రస్తుతం రూ. 40 నుంచి రూ. 55 వరకు విక్రయమవుతున్న బియ్యం ధరలు త్వరలో వేగం పుంజుకుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గోధుమల పరిప్థితి కూడా అంతేనట..
ఐరోపా యుద్ధం ప్రపంచానికే శాపం
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. సప్లై దారులు మూసుకుపోవడం, ఉత్పత్తులు ఆగిపోవడంతో ఆహార సంక్షోభం ఖాయమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్ పాస్ స్వయంగా ప్రకటించారు. పుతిన్ ప్రేరేపిత విలయంతో కోట్లాది మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్నారు. ఆహార పదార్థాల ధరలు 37 శాతం పెరుగుతున్నాయని డేవిడ్ మాల్ పాల్ లెక్కలు కట్టారు. ఆహార ధాన్యాలే కాకుండా వంట నూనెలు, మొక్కజొన్న ధరలు చుక్కలనంటాయి. పంటలకు అవసరమైన ఎరువులు కూడా కొనలేని స్థాయికి పెరిగాయి.
పేదదేశాలకు గడ్డుకాలం
యుద్ధంతో పేద దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆయా దేశాలు అ్పుల కుప్పలుగా మారుతున్నాయి. 60 శాతం దేశాలు అప్పులు తీర్చలేక నానా తంటాలు పడుతున్నాయి. అప్పులు తీర్చలేని దేశాలకు కొత్త అప్పులు దొరకడం కష్టం. దానితో ఆహార ధాన్యాలు ఎగుమతి చేసేందుకు కొన్ని దేశాలు ముందుకు వచ్చినా.. కొనేందుకు వారి వద్ద నిధులు లేని దుస్థితి నెలకొంది. దానితో ఆఫ్రికాలోని కొన్ని దేశాలు, ఆసియా దేశాల్లో ఆకలి చావులు ఖాయమనిపిస్తోంది.
ఎగుమతులకు భారత్ రెడీ
ఇండియా పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుతానికి దేశంలో ఆహార కొరత లేదు. ఏప్రిల్ మొదటి వారానికి దేశంలో 76 మిలియన్ టన్నుల బియ్యం, గోధుమలు దేశ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ కార్పొరేషన్ గోదాముల్లో నిల్వ ఉన్నాయి. చిరు ధాన్యాల ఎగుమతుల్లో భారత్ అగ్రభాగాన ఉంది. ఆ ధైర్యంతోనే అవసరమైన వారికి ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తామని ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు హామీ ఇచ్చారు…
భారత్ భయమేంటి ?
ధాన్యాగారాల నిండా గింజలున్నా…భారత ప్రజలు మాత్రం భయపడుతున్నారు.అందుకు అనేక కారణాలున్నాయి. ఈ ఏడాది పంట దిగుబడి బాగా తగ్గిపోతుందని సాగు విస్తీర్ణ గణాంకాలు చెబుతున్నాయి. ఎరువుల ధరలు పెరగడంతో సహజంగానే ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది. ఇక ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే దేశంలో నిల్వలు తగ్గిపోతాయి. వ్యాపారుల ఇష్టారాజ్యమైన మనదేశంలో ధరలపై ప్రభుత్వ నియంత్రణ దాదాపు శూన్యమేనని చెప్పాలి. ఉల్లి ధరలు పెరిగితే మార్కెట్లోకి కొన్ని టన్నుల ఉల్లిని విడుదల చేసినంత సులభంగా బియ్యం, గోధమలను ఇవ్వలేదు. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం కోటాను కొంత మేర పెంచడం మినహా… ఓపెన్ మార్కెట్లో కౌంటర్లు పెట్టి బియ్యం, గోధుమలు అమ్మిన సందర్భమూ లేదు. కరోనా తర్వాత ఆహార ధాన్యాల రేట్లు భారీగానే పెరిగాయి. ఇప్పుడు ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు ఫోర్త్ వేవ్ కు సిద్ధమవుతున్నాయి. లాక్ డౌన్లు వస్తే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తారు. అందుకే బియ్యం కిలో వంద రూపాయలు అమ్మినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని మార్కెట్ వర్గాలే చెబుతున్నాయి…