“మా’’ తుఝే సలాం !

By KTV Telugu On 8 May, 2022
image

“పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. ఆమె ఒడిలోనే మొదలవుతుందని మన జన్మ” .. అమ్మ లేకపోతే ఈ ప్రపంచం లేదు. సృష్టికి మూలం అమ్మ. ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. అందుకే అమ్మ తర్వాతే ఎవరైనా అంటారు. ప్రపంచంలో ప్రతీ దానికి ప్రత్యామ్నాయం ఉంటుంది కానీ అమ్మకు ఉండదు. “అమ్మ” అనే పదానికి అర్థాలు, నిర్వచనాలు చెప్పాలనుకోవటం అర్థరహితమే. ఎంత మంది ఎన్ని పాటలు రాసినా.. ఎన్ని మాటలు కట్టినా అమ్మ పలుకులో తీయదనం పెరుగుతుందే కానీ తగ్గదు. ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం !

అమ్మగురించి ఎంత చెప్పుకున్నా లోటే !

ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తియ్యని రాగం, అమ్మేగా.. అమ్మేగా తొలిపలుకు నేర్పుతున్న భాషకి అని సిరివెన్నెల సీతారామశాస్త్రి పాడిన పాట ప్రసిద్ధికెక్కింది. అంగట్లో అమ్మ ప్రేమ దొరకదు, అమ్మ మనసు అమృత ధార, అమ్మ కడుపు చూస్తుంది.. ఆలు జేబు చూస్తుంది, అమ్మ ప్రాణం పోసేది.. అమ్మ ప్రాణిని మోసేది. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడట. నడకే కాదు అమ్మ నాగరికతను నేర్పుతుంది. దారి తప్పిన వాళ్లకి జ్ఞానబోధ చేస్తుంది. అమ్మకు కుట్రలు, కుతంత్రాలు ఉండవు. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు మారుపేరే మాతృమూర్తి. అన్ని రుణాలను తీర్చవచ్చును గాని అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదు. అందుకే అమ్మ రుణం తీరేది కాదంటారు. డిల్లికి రాజైనా తల్లికి కొడుకే అంటే.. రాజు కంటే ఆమె తల్లే గొప్పదని అర్థం.

మాతృమూర్తే తొలి గురువు !

పదిమంది ఉపాధ్యాయులు ఒక ఆచార్యునితో సమానం. వందమంది ఆచార్యులు ఒక తండ్రితో సమానం. వెయ్యి మంది తండ్రులు ఓ తల్లితో సమానమని మన పెద్దలు అంటారు. ఈ విధంగా ఆమె తొలి గురువు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలు చెబుతుంటారు. అందుకే.. అమ్మను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. ఆరుసార్లు భూమికి ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో, పదివేల సార్లు కాశీ వెళితే ఎంత ఫలమో, వందసార్లు సామేశ్వరంలో సేతు దర్శనం చేసి స్నానిస్తే ఎంత ధన్యత కల్గుతుందో… ఆ ఫలమంతా కలిసి ఒక్కసారి తల్లికి నమస్కరిస్తే కలుగుతుంది. అమ్మ అంటే నడుస్తున్న దైవం.. భూలోకంలో దేవుని ప్రతిరూపం అమ్మ. నిత్య స్మరణీయురాలు అమ్మ. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తన బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. అందుకే అమ్మకు అంత విలువ. తన బిడ్డలకు ఎటువంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. తను కడుపు మాడ్చుకొని తన కన్నబిడ్డల కడుపు నింపుతుంది అమ్మ. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఎంత చెప్పుకున్నా తరగని గని అమ్మ.

అమ్మ స్పర్శ చాలు బిడ్డ ఆరోగ్యానికి !

అమ్మే బిడ్డకు తొలి వైద్యురాలు. ఆమె స్పర్శే అన్ని మనోవ్యాధులకు మందులాంటిది. ఆ విషయం తల్లులందరికీ ప్రాక్టికల్‌గా తెలుసు. బిడ్డ ఏడుస్తున్నప్పుడు అలా నిమిరితే చాలు శాంతిస్తుంది. స్పర్శ తగిలితే చాలు ప్రశాంతంగా నిద్రిస్తుంది. అంతేకాదు ఆమె బిడ్డను ముద్దాడినపుడు ఆ బిడ్డ శరీరంపై ఉండే సూక్ష్మక్రిములు అమ్మ శరీరంలోకి వెళతాయి. అపుడు ఆ శరీరం వాటికి వ్యతిరేకంగా పనిచేసే రోగ నిరోధక కణాల్ని తయారుచేస్తోంది. అవే అమ్మ పాల ద్వారా బిడ్డకు చేరి రక్షణ కవచంగా కాపాడతాయి. అమ్మతో మంచి అనుబంధం ఉన్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. మెదడులో వుండే హిప్నోకాంపస్ అనే భాగం మన జ్ఞాపకశక్తికీ, తెలివితేటలకూ, ఒత్తిడిని తట్టుకునే శక్తికీ ఆధారభూతమైంది. అమ్మ ప్రేమ లభించేవారిలో అది దాదాపు పదిశాతం పెద్దదిగా ఉన్నట్లు తేలింది. అమ్మను ప్రేమించే వ్యక్తి స్ర్తీలందరినీ గౌరవిస్తాడు.

అమ్మ ప్రేమకు విలువ కట్టలేం !

పురుషుడు ఒక సమయంలో ఒక విషయంమీద మాత్రమే దృష్టి పెట్టగలడు. కానీ మహిళ మాత్రం ఒకేసారి గంపెడు బాధ్యతలు నెత్తిమీద పడినా బెదిరిపోదు. లక్ష్యాలు ఒకేసారి ఎన్నున్నా అంతిమంగా విజయం సాధించగలదు. ఎందుకంటే ఆమె ప్రతీ లక్ష్యంలోనూ మాతృత్వ అనుబంధం కల్గి వుంటుంది. కాబట్టే బహుళ బాధ్యతలున్నా ఆమెను బాధపెట్టలేవు. మరిన్ని బాధ్యతలకు కూడా ఆమె సిద్ధంగా ఉండి, మరింత శక్తిమంతురాలు అవుతుంది. కొన్నాళ్ల క్రితం అమెరికాలో అమ్మ సేవలకు గంటల ప్రకారం లెక్కలు కట్టారు. ఆమె సేవలకు కట్టిన విలువ ఎంతో తెలుసా? సంవత్సరానికి అక్షరాలా 70 లక్షల రూపాయలు అని తేల్చారు. అంటే నెలకు ఐదు లక్షలన్నమాట. కాని బిడ్డకు పెన్నిధి లాంటి అమ్మ ప్రేమకు వెలకట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా?

ప్రతీ రోజూ అమ్మదే.. కానీ ప్రత్యేకంగా ఒక్క రోజు ఎందుకు చేస్తున్నారంటే?

ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్నే ప్రపంచ మాతృదినోత్సవంగా జరుపుకుంటారు. 1872 లో జూలియవర్డ్ హోవే అనే మహిళ.. మదర్స్ డేను నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆమె అమెరికాలో ఈ ప్రతిపాదన చేసింది. ప్రపంచం శాంతంగా ఉండాలంటే మనల్ని కన్న మాతృమూర్తులను తరించుకోవాలని విన్నవించింది. అలా.. మదర్స్ డే జరపాలనే ఆలోచనలకు బీజం పడింది. తర్వాత అన్న మేరీ జర్విస్ అనే మహిళ కూడా మదర్స డే కోసం పోరాడింది. కాకపోతే.. ఆమె బతికుండగా మదర్స్ డేను ఏర్పాటు చేయలేకపోయారు. ఆమె 1905 మే 9న మృతి చెందింది. దీంతో ఆమె కూతురు మిస్ జెర్విస్ మదర్స్ డే కోసం చాలా ప్రయత్నించింది. అలా.. 1911 నుంచి అమెరికాలో మాతృదినోత్సవం జరుపుతున్నారు. 1914 నుంచి దాన్ని అధికారికంగా నిర్వహించడం మొదలు పెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం స్టార్ట్ చేశారు. తర్వాత అది ప్రపంచమంతా విస్తరించింది. మాతృమూర్తులకు ఓ రోజును కేటాయించడం గొప్పే కదా అనుకొని ప్రతి దేశం కూడా మాతృదినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించింది. అలా.. మే రెండో ఆదివారాన్ని ప్రపంచ వ్యాప్తంగా మాతృదినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అది మదర్స్ డే ప్రాముఖ్యత.