రిషి భారతీయుడే కాదు.. పాకిస్తానీ కూడా!

By KTV Telugu On 26 October, 2022
image

రిషి సునాక్‌ పూర్వీకులది పాకిస్తానా! – రిషి సునాక్‌. ప్రపంచమంతా ఇప్పుడు ఈయనగురించే చర్చ. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్‌ ప్రధాని కావటాన్ని ప్రపంచమంతా అబ్బురంగా చూస్తోంది. మా పనివాడు భారతీయుడు, మా వంటవాడు భారతీయుడని పొగరుగా తలెగరేసిన తెల్లదొరలను ఆ భారతీయుడే ఏలబోతున్నాడు. మన దేశాన్ని దాదాపు రెండు శతాబ్దాలపాటు దాస్యశృంఖలాల్లో మగ్గేలా చేసిన బ్రిటీష్‌ సామ్రాజ్యానికి ఇవాళ భారతీయుడే దిక్సూచి కావడంతో అందరి గుండెలూ ఉప్పొంగుతున్నాయి. భారతీయులు మనవాడని రిషి సునాక్‌ గురించి గర్వంగా చెప్పుకుంటుంటే అటు దాయాది దేశంలోనూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
రిషి సునాక్‌ మావాడు అంటున్నారు పాకిస్తాన్‌ పౌరులు. ఆయన పూర్వీకులు తమ గడ్డమీద పుట్టారని సంబరాలు చేసుకుంటున్నారు. సునాక్‌ తాత, మామ్మ గుజ్రన్‌వాలా నగరంలో జన్మించారు. ఒకప్పుడు అవిభజిత భారత్‌లోని ఆ నగరం విభజన తర్వాత పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో ఉంది. దీంతో రిషిని తమ దేశస్తుడిగా ప్రకటించాలంటూ పాకిస్థాన్‌ నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. రిషి సునాక్‌ పుట్టేదాకా ఆయన పూర్వీకులు ఎక్కడెక్కడ ఉండేవాళ్లో సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.
నిజమే..రిషి సునాక్‌ తాతది గుజ్రన్‌వాలానే. ఇప్పుడది పాకిస్తాన్‌లో ఉన్నమాట కూడా వాస్తవమే. అయితే రిషి పూర్వీకులు వలస వెళ్లేనాటికి ఇండియా-పాకిస్థాన్ ఇంకా విడిపోలేదు. కాబట్టి భారతీయ మూలాలనో, పాకిస్తాన్‌ పూర్వీకులనో ప్రత్యేకంగా చెప్పటం సాధ్యంకాదు. భారత్‌కి చెందినవాడా, పాకిస్తానీయుడా అన్న ప్రశ్నే తలెత్తదు. రిషి పూర్వీకులు కెన్యా, టాంజానియా, బ్రిటన్ దేశాల్లో స్థిరపడ్డారు. ఓ రకంగా అది విశ్వకుటుంబం. అయినా ఆయన బ్రిటన్‌ ప్రధాని అయ్యాడు కాబట్టి చంకలు గుద్దుకుంటున్నారుగానీ లేకపోతే పట్టించుకునేవాళ్లా!