రష్యా లెక్క తప్పుతోంది.. చివరికి ఏమవుతుంది?

By KTV Telugu On 2 November, 2022
image

ఒకే రోజు వెయ్యిమంది..ఇంకెన్ని శవాలు లేస్తాయో!

ఉక్రెయిన్‌ని ఎడతెరిపిలేని దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే సమయంలో ఉక్రెయిన్‌ అదనుచూసి చావుదెబ్బకొడుతోంది. రష్యాని వ్యూహాత్మకంగా దెబ్బతీస్తోంది. దీంతో నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి. అయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమయ్యాక ఎదురైన చేదు అనుభవాల్లో రష్యాకి మరో ఊహించని దెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ దాడిలో ఒక్కరోజులోనే వెయ్యిమంది రష్యా బలగాలు ప్రాణాలు కోల్పోయాయి.

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వేలమంది సైనికుల్ని కోల్పోయింది. కానీ ఎంతమంది అనేది ఇప్పటికీ రష్యా రహస్యంగానే ఉంచుతోంది. ఇక భారీగా ట్యాంకులు, ఆయుధసామగ్రి రష్యా చేజారాయి. దీంతో ఇరాన్‌ మేడ్‌ డ్రోన్లతో దొంగదెబ్బ తీస్తోంది. మరోవైపు ముంచుకొస్తున్న మంచు ముప్పుని అడ్డుపెట్టుకుని ప్రతికూలవాతావరణంతో ఉక్రెయిన్‌ ఊపిరి తీయాలనుకుంటోంది. కానీ ఉక్రెయిన్‌ కూడా చావోరేవో అంటూ తెగబడుతోంది. ఉక్రెయిన్‌ లెక్క ప్రకారం ఫిబ్రవరిలో రష్యా యుద్ధానికి దిగినప్పటినుంచీ 71వేలమంది సైనికులను నష్టపోయింది. ఒక్కరోజే వెయ్యిమందిని హతమార్చినట్లు ప్రకటించింది.
రష్యా రిజర్వుబలగాలను పంపుతోందిగానీ ఆయుధాలు సమకూర్చలేకపోతోంది. దీంతో దీన్ని ఉక్రెయిన్‌ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఆయుధాలు లేకుండా మోహరిస్తున్న రష్యా రిజర్వు బలగాలు ఉక్రెయిన్‌ చేతిలో చావుదెబ్బ తింటున్నాయి. ఆయుధనిల్వలు తరిగిపోవటంతో రష్యా 1959 నాటి ఏకేఎం రైఫిల్స్‌ వాడాల్సి వస్తోంది. ఓటమిని ఒప్పుకునేందుకు రష్యా సిద్ధంగా లేదు. వెన్ను చూపాల్సి వస్తే ఎంతకైనా తెగించేలా ఉంది. ఆఫ్గానిస్తాన్‌లో అమెరికా సేనలతో కలిసి తాలిబన్లపై పోరాడిన ప్రత్యేక దళాల సైనికుల్ని కూడా రష్యా దించుతోంది. చివరిగా బ్రహ్మాస్త్రాన్ని బయటికితీస్తే పశ్చిమదేశాలు కూడా ప్రత్యక్షపోరుకు దిగేలా ఉన్నాయి.