భారతదేశంలో వ్యభిచారం చట్ట వ్యతిరేకం. ఈ విషయంలో స్పష్టత ఉంది. అయితే తాజాగా సుప్రీంకోర్టు సెక్స్ వర్క్‌ను వృత్తిగా గుర్తిస్తూ సంచలాత్మక తీర్పు ఇచ్చింది. దీనిపై ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది సుప్రీంకోర్టుపై విమర్శలు చేస్తున్నారు. మరికొంత మంది కరెక్టే చెప్పిందంటున్నారు ? అసలు సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది? కొంత మంది వాదిస్తున్నట్లుగా వ్యభిచారం లీగలైజ్ అయిపోతుందా ?
అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ?
”వృత్తితో సంబంధం లేకుండా రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద పరువు మర్యాదలతో జీవించే హక్కు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి వుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చట్టం కింద సెక్స్ వర్కర్లకు సమానమైన రక్షణ వుంటుంది. ‘వయస్సు, సమ్మతి’ ప్రాతిపదికన అన్ని కేసుల్లో క్రిమినల్ చట్టాన్ని సమానంగా వర్తింపచేయాలి. పైగా సెక్స్ వర్కర్ వయోజనులై వుండి, పూర్తి సమ్మతితోనే ఇందులో పాల్గొన్నపుడు వారిపై పోలీసులు ఎలాంటి నేరపూరితమైన చర్య తీసుకోరాదు, లేదా వారి విషయంలో అస్సలు జోక్యం చేసుకోరాదు.” అని జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద ప్రత్యేక అధికారాలను అమలు చేసిన తర్వాత ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
సెక్స్ వర్క్ చట్ట విరుద్ధం కాదు.. బ్రోతల్ సంస్థ నిర్వహణే నేరం !
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేయడమనేది చట్టవిరుద్ధం కాదు. కానీ బ్రోతల్ సంస్థ నిర్వహణే చట్ట విరుద్ధం. ఏ బ్రోతల్ సంస్థ పైనైనా దాడి చేసినపుడు ఏ సెక్స్ వర్కర్‌ను కూడా అరెస్టు చేయరాదని, శిక్షించరాదని లేదా వేధించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ బ్రోతల్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. వేశ్యా వృత్తిలో వుందనే కారణంతో సెక్స్ వర్కర్ పిల్లలను కూడా వారి తల్లి నుండి వేరు చేయరాదని పేర్కొంది. కనీసపు పరువు మర్యాదలతో జీవించడమనే ప్రాథమిక హక్కు, రక్షణ అనేది సెక్స్ వర్కర్లకు, వారి పిల్లలకు కూడా దక్కాలని కోర్టు స్పష్టం చేసింది. అరెస్టు సమయంలో, రెయిడ్ చేసేటపుడు, రెస్క్యూ ఆపరేషన్లపుడు సెక్స్ వర్కర్ల గుర్తింపులను వెల్లడించకుండా మీడియా జాగ్రత్త వహించాలని కోర్టు సూచించింది.
దేశంలో ఎన్నో కామాటిపురాలు !
దేశంలో వ్యభిచారం నేరం. అయినా కామాటిపురా లాంటి ప్రాంతాలు లేని ఊళ్లు ఎక్కడున్నాయి ? అంతా బహిరంగమే. ఏ చట్టం ఆపలేకపోయింది. అత్యంత పురాతనమైన ఈ వృత్తి ఇది. దీన్ని అసలు లేకుండా చేయడం ఎవరికీ సాధ్యం కాదు. వ్యభిచారాన్ని హఠాత్తుగా రూపుమాపాలనుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఆచరణయోగ్యం కాని అంశం. ప్రపంచంలో ఏ దేశమూ వ్యభిచారాన్ని సమూలంగా రూపుమాపిన దాఖలాలు అసలు లేవు. అయినా సరే, ఈ మహత్తర ఆదర్శాన్ని పూరించాలంటే మొదటగా ప్రస్తుతం ఉన్న సమస్యలకు సమాధానాలు వెతకాలి. ఆ దిశగా ప్రతిపాదిత చట్టం ఒక ముందడుగు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా, చట్టపరమైన, మానవహక్కుల పరమైన కోణాల్ని విస్మరించి కేవలం “నైతికత” కోణంలోంచీ ఈ సమస్యను చూడటం వల్ల సమస్య జఠిలమవుతుంది. కానీ పిల్లల్ని, మహిళల్ని ఎత్తుకుపోయి, వ్యభిచార కంపెనీల్ని నడిపే మాఫియాలను మాత్రం నిర్మూలించాలి. ఈ విషయంలో ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
సుప్రీంకోర్టు తీర్పుతోనే ఇంకా వ్యభిచారాన్ని విచ్చలవిడిగా నిర్వహించుకోవచ్చా అని కొంత మంది వితండవాదాలు వినిపిస్తూ ఉంటారు. ఇద్దరు మేజర్లు తమ ఇష్టప్రకారం శృంగారం పాల్గొనడం నేరం కాదని మాత్రమే చెప్పింది. దానర్థం… బ్రోతల్ హౌజ్ లు నడపడం.. అమ్మాయిల అక్రమ రవాణా.. బలవంతపు వ్యభిచారం.. ఇలాంటివన్నీ యథాతథంగా తీవ్ర నేరాలుగా ఉంటాయి. సుప్రీంతీర్పును ఆర్థం చేసుకోలేక… వివిధ కారణాలతో పెడర్థాలు తీసుకునేవారితోనే సమస్య వస్తోంది.