ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందా ? ధరాఘాతం జానాన్ని గగ్గోలు పెట్టిస్తోందా ? ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక మీనమేషాలు లెక్కిస్తోందా ? నిధులు లేక అనేక రంగాలు కుదేలవుతున్నాయా ? దేశంలో అసలేం జరుగుతోంది ?
ఉక్రెయిన్ – రష్యా యుద్ధ కాండ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న ఇండియాను కూడా దెబ్బతీస్తోంది. యుద్ధం ప్రారంభమైన వెంటనే అంతర్జాతీయ ద్రవ్య నిధి తొలుత భారత్ నే హెచ్చరించింది. వేగంగా విస్తరిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తప్పవని అనుమానాలు వ్యక్తం చేసింది. యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే భారత్ సహా ప్రపంచ దేశాలకు అంత మంచిదని సూచించింది. అయినా అక్కడ యుద్ధం ఆగలేదు. ఇక్కడ తిరోగమనమూ ఆగలేదు…
ఈ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి దాదాపు 100 రోజులవుతోంది. దాడి నేపధ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే కాకుండా, వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఈ సంవత్సరం ఏప్రిల్లో 7.8 శాతానికి పెరిగింది. మే 2014 నుండి ఇదే అత్యధికం. వనస్పతి నూనె, గోధుమలు, ఆవాల నూనె, పంచదార తదితర సరకులైతే అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 2021లో ఇదే సమయానికంటే ఈ ఏడాది మే 31న వనస్పతి నూనె ధర 26.6 శాతం ఎక్కువ. గోధుమలు 14.3 శాతం, ఆవనూనె, పంచదార ధరలు గతేడాది ఇదే రోజుతో పోలిస్తే ఈసారి వరుసగా 5.1 శాతం, 4.1 శాతం అధికంగా ఉన్నాయి.
ఉక్రెయిన్ లో మిలియన్ టన్నుల వంట నూనెలు ఆగిపోవడంతో ఇక్కడ రేట్లు పెరిగాయి. మరో పక్క రష్యా నుంచి రావాల్సిన ముడి చమురు కూడా ఆగిపోయింది. దానితో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు సుమారు 80 డాలర్లుగా ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం మొదలు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 128 డాలర్లు వరకు పెరిగింది. మే 31 న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర… 122.8 డాలర్లకు చేరుకోవడంతో ముడిచమురు ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం చాలా ఆలస్యంగా దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి…