ఆ స్వామి ప్రాణంతీసింది హనీట్రాపేనా!

By KTV Telugu On 27 October, 2022
image

హనీట్రాప్‌..నాయకులకే కాదు స్వాములకూ గండం!

ఎంతవారలైనా కాంతాదాసులే. పరస్త్రీని కన్నెత్తిచూడని వాడు కూడా అనుకోకుండా హనీట్రాప్‌లో ఇరుక్కోవచ్చు. బయటపడలేక ఉక్కిరిబిక్కిరికావచ్చు. కైలాస దేశాన్ని సృష్టించిన నిత్యానందస్వామి అంతటివాడికే ఆడవాళ్లతో ఇబ్బందులు తప్పలేదు. ఇక మామూలు స్వాములో లెక్కా! ఏదో ఒక బలహీన క్షణంలో ఓ మాటతూలినా, పక్కచూపు చూసినా పరువు గంగపాలే. కర్నాటకలో ఓ స్వామీజీ ఆత్మహత్యలో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి.

కర్నాటక రామనగర్‌లో కంచుగల్ బండే మఠానికి చెందిన బసవలింగ స్వామీజీ బలవన్మరణానికి పాల్పడ్డారు. పదిమందికీ జ్ఞానబోధ చేసే స్వామీజీ ఉరితాడుకు వేలాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనకు అంత మానసిక క్షోభ కలిగించిందెవరు? ఎంక్వయిరీ చేస్తున్న పోలీసులకు కొత్త ఆధారాలు దొరుకుతున్నాయి. బసవలింగ స్వామీజీని ఓ మహిళ హనీట్రాప్‌ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఓ మహిళ వీడియోకాల్స్‌తో బ్లాక్‌ మెయిల్‌ చేసిందని నిర్ధారణకు వచ్చారు.
కంచుగల్‌బండే మఠంలోని తన ప్రార్థనాగదిలో అక్టోబర్ 24న బసవలింగ స్వామి ఉరేసుకున్నారు. తనని పీఠాధిపతి బాధ్యతలనుంచి తప్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన సూసైడ్‌ నోట్‌లో రాశారు. గుర్తు తెలియని ఓ మహిళ తనతో ఇలా చేయించిందని కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. దీంతో ఆ మహిళ డబ్బుకోసం తనే బ్లాక్‌మెయిల్‌కి పాల్పడిందా, వేరెవరి ప్రోద్బలంతోనైనా ఈ కుట్రకు తెరలేపిందా అన్న చర్చ జరుగుతోంది.
కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కీలకమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన స్వామీజీ ఆత్మహత్యకు పాల్పడం సంచలనంగా మారింది. కర్ణాటక రాజకీయాల్లో వర్గాలు, మతం పాత్ర కీలకం. దీంతో ఆ స్వామీజీని కొందరు టార్గెట్‌ చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. కన్నడనాట కొందరు స్వామీజీలు రాజకీయ నాయకులతో పాలునీళ్లలా కలిసిపోయారు. వారిలో వారికున్న పోటీతో ఇలాంటి హనీట్రాప్‌కి ప్లాన్‌ చేసి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. నీడని కూడా నమ్మలేని రోజులివి. ముక్కుమొహం తెలియని మహిళలతో కాల్‌ కలిపినా, కాలు కదిపినా కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్లే!