ఉద్దవ్ ఆశలు సజీవం.. భవిష్యత్తుకు భరోసా!
నోటా సెకండ్ప్లేస్.. చివరికి అదే గెలుస్తుందేమో!
నోటా(NOTA).. నన్ ఆఫ్ ద ఎబౌవ్. అంటే ఈ బ్యాలెట్లో ఉన్న అభ్యర్థులెవరికీ ఓటేయడం ఇష్టంలేదని. బ్యాలెట్లో అభ్యర్థులతో పాటు ‘నోటా’ను చేర్చడం ప్రజాస్వామిక అభిప్రాయానికి పెద్దపీట వేయడమే. సాధారణంగా నోటాకు తక్కువ ఓట్లే పడుతుంటాయి. కొన్నిచోట్ల మాత్రం ఈ బటన్తోనే అభ్యర్థుల జాతకాలు తారుమారవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఓ చోట నోటా నోరెళ్లబెట్టేలా చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులను నివ్వెరపరిచింది.
మహారాష్ట్ర అంధేరీ(తూర్పు) నియోజకవర్గం నుంచి శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం నుంచి రుతుజా రమేష్ లాట్కే 66వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు బీజేపీ కూడా అభ్యర్థిని దించకపోవటం రుతుజాకి కలిసొచ్చింది. అయితే అదే సమయంలో ఈ బైపోల్లో అంధేరీ ఓటర్లు అనుకోని సర్ప్రైజ్ ఇచ్చారు.
రుతుజాతో పాటు బరిలో ఉన్న ఆరుగురు అభ్యర్థులకంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అంటే అక్కడ సమీప ప్రత్యర్థి ‘నోటా’నేనన్నమాట! నోటా విషయం పక్కనపెడితే ఏక్‌నాథ్‌షిండే తిరుగుబాటుతో డీలాపడ్డ ఉద్దవ్‌థాక్రే వర్గానికి ఉప ఎన్నికల బూస్టప్ ఇచ్చింది. షిండే వర్గం తిరుగుబాటు తర్వాత ఉద్దవ్ వర్గం తొలి విజయాన్ని అందుకుంది. బీజేపీ తప్పుకున్నప్పుడే రుతుజా విజయం లాంఛనప్రాయం అయింది. ఊహించినట్లే ఓటర్లు ఆమెకు భారీ మెజారిటీ కట్టబెట్టారు. త్వరలో ముంబై స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో బైపోల్ గెలుపు థాక్రే వర్గం జోష్ నింపింది. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి ఉంటే ఫలితం ఎలా ఉండేదోగానీ నడిసంద్రంలో మునుగుతున్న సమయంలో ఉద్దవ్ ఊపిరి నిలపటానికో ఆసరా దొరికింది.