ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు, అధికారులు ఏమిటో తెలియనట్లుగా ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో శాంతిభద్రతల అంశంపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఏపీ బీహార్ అయిపోయిందని ప్రతిపక్షం గగ్గోలు పెడుతోంది. ఇక అదే సమయంలో లక్షలాది మంది విద్యార్థుల శ్రమ అయిన పరీక్షల నిర్వహణలోనూ చేతులెత్తేసింది. అరికట్టాల్సిన ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో స్పష్టత లేదు కానీ.. అవన్నీ టీడీపీ వాళ్లే చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రజాధనంతో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ఆరోపిస్తున్నారు. ఓ ముఖ్యమంత్రి చేయాల్సింది ఆరోపణలా ? పరిపాలనా ? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
టీడీపీ వాళ్లు రేపులు చేస్తే శిక్షించవద్దని ఎక్కడైనా ఉందా ?
ఏపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచార అంశం.. వాటిపై హోంమంత్రి చేస్తున్న బాధ్యతా రాహిత్య ప్రకటనలు ఏపీలో కలకలం రేపాయి. ఇప్పుడు హోంమంత్రికి తోడుగా సీఎం జగన్ కూడా వచ్చారు. ఆ నేరాలన్నీ టీడీపీ నేతలే చేసి.. వారే యాగీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓ సీఎం చెప్పాల్సిన మాట అది కాదు. నేరాలు ఎవరు చేసినా కట్టడి చేయగలిగిన వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయనది. కానీ ఆ వ్యవస్థ పనితీరును ఏ మాత్రం పట్టించుకోకుండా నేరాలు టీడీపీ వాళ్లు చేస్తున్నారని ఆరోపిస్తే సమస్య పరిష్కారమవుతుందా ? ప్రజలు ప్రభుత్వ బాధ్యతను తీర్చేసిందని అనుకుంటారా ? నేరాలు ఎవరు చేసినా నేరస్తులే. వాళ్లకు పార్టీలు ఉండవు. కుల మతాలు ఉండవు. చట్టం అందరికీ సమానం. నేరం చేసిన వాళ్లను శిక్షించలేని అసహాయతను జగన్ అలా వ్యక్తం చేశారన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోతోంది.
నారాయణ, చైతన్య కాలేజీలే చేస్తే ప్రభుత్వ టీచర్లపై కేసులెందుకు ?
పేపర్ లీకేజీల పని నారాయణ, చైతన్య కాలేజీల పనేనని సీఎం హోదాలో ఉన్న జగన్ ఏ మాత్రం బాధ్యత లేకుండా ఆరోపించారు. ఓ ప్రతిపక్ష నాయకుడిగా ఆరోపణలు చేయడం వేరు.. సీఎంగా అధికారిక కార్యక్రమంలో మాట్లాడటం వేరు. నారాయణ, చైతన్య కాలేజీలు పేపర్ లీక్ చేస్తే చర్యలు తీసుకోవద్దని చట్టంలో ఉందా ? ఎందుకు తీసుకోవడం లేదు ? అదే సమయంలో పేపర్ లీక్ పేరుతో కనీసం వంది మంది వరకూ ఉపాధ్యాయులు.. ఇతర ప్రభుత్వ స్కూల్స్ సిబ్బందిని అరెస్ట్ చేశారు. వారందరూ నారాయణ, చైతన్య స్కూల్స్‌కు చెందిన వారా ?. రాజకీయంగా నారాయణ, చైతన్యలను టార్గెట్ చేసి.. ప్రజల్లో ఆరోపణలు చేయడం.. చట్ట పరంగా తమ సమస్యలపై పోరాడుతున్న ఉద్యోగ సంఘాలను బెదిరించడానికి ఉపాధ్యాయులపై కేసులు పెట్టడానికి పేపర్ లీకేజీలను వాడుకుంటున్నారని అందరికీ అర్థమవుతోంది. కానీ సమస్య పరిష్కారానికి ఏం చేస్తున్నారో మాత్రం ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే ఏమైనా చేస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు మరి.
సీఎం సీటు అధికార, బాధ్యతలపై అవగాహన లేదా !?
ఏపీ సీఎం వ్యవహారశైలి, మాటలు… అధికార బాధ్యతలపై ఏ మాత్రం అవగాహన లేనట్లుగా ఉన్నాయన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సీఎం జగన్ రాసిన స్పీచ్‌లను ఎక్కువగా చదువుతారు. ఎవరైనా ఆయన స్పీచ్‌లను రాసిస్తున్నారా లేకపోతే.. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. ఎలా జరిగినా సీఎం అధికార బాధ్యతల విషయంలో జగన్‌కు స్పష్టతలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లడానికి ఇలాంటి వ్యాఖ్యలు కారణం అవుతున్నాయి. ఇలాంటి ప్రసంగాల వల్ల జగన్ పై నెగెటివ్ ఇమేజ్ ఏర్పడుతోంది. ఆయనకేమీ తెలియదని విపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే వైసీపీ అగ్రనాయకత్వం ఇప్పటికైనా మేలుకుని జాగ్రత్త పడాల్సిఉంది. లేకపోతే… రాజకీయం చేయడానికి పరిపాలన చేయడానికి తేడా లేకుండా పోతుంది.