ఆన్ లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేయలేమా… నేరగాళ్లు తప్పించుకునేందుకు మనమే అవకాశం ఇస్తున్నామా.. ఆసియా టైగర్ చేసిన పని మనం చేయలేకపోతున్నామా.. పరిస్థితి చేయి దాటకముందే కఠిన చర్యలు చేపట్టడం అనివార్యం కాదా…
దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏటా దాదాపు 50 వేల కేసులు నమోదవుతుండగా.. వెలుగులోకి రాని కేసులు చాలానే ఉన్నాయి. అందులో ఆన్ లైన్ వేధింపులు సింహభాగంగా ఉన్నాయని సైబర్ నిపుణులు అంచనా వేస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విటర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ఇప్పుడు సైబర్ బుల్లీయింగ్ కు కేంద్ర బిందువు అవుతున్నాయి. బయటకు చెప్పుకోలేక బాధితులు లోలోన కుమిలిపోతున్నారు. ధైర్యం చేసి పోలీసుల దగ్గరకు వెళ్లినా తక్షణ న్యాయం జరుగుతుందన్న విశ్వాసమూ కలగడం లేదు.
2020లో జపాన్ రెజ్లర్ హనా కిమురాను కొందరు ఆన్ లైన్ నేరగాళ్లు వేధించారు. టీవీ రియాల్టీ షో అయిన టెర్రస్ హౌస్ లో ఆమె పాల్గొన్నారు. రెజ్లింగ్ దుస్తులు ధరించినందుకు కొందరు ఆమెను గేలి చేస్తూ పోస్టులు పెట్టారు. నేరుగా ఆమెనే ట్యాగ్ చేయడంతో అవి చదువుకుని హనా కుమిలిపోయారు. ఎన్ని రోజులైనా వేధింపులు ఆగకపోవడంతో హనా ఆత్మహత్య చేసుకున్నారు. వెదికి వెదికి ముగ్గురు నిందితులను పట్టుకున్న జపాన్ సైబర్ క్రైమ్ పోలీసులు.. వారికి మాత్రం కఠిన శిక్షలు వేయించలేకపోయారు. పదివేల యెన్… అంటే మన కరెన్సీలో దాదాపు ఆరువేల రూపాయలు జరిమానా, నెల రోజుల జైలు శిక్ష విధించడంతో సరిపెట్టాల్సి వచ్చింది….
హనా ఆత్మహత్య కేసులో జపాన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్ బుల్లీయింగ్ నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని గొంతెత్తారు. హనా తల్లి క్యోకోకు దేశం మొత్తం అండగా నిలిచింది. దానితో దిగివచ్చిన జపాన్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అలాంటి నేరాలకు దిగిన వారికి రెండు లక్షల రూపాయలు, ఏడాది జైలు శిక్ష విధిస్తామని ప్రకటించారు. అయితే ఇదీ కూడా చాలదని మరింత కఠిన శిక్షలు అవసరమని జపానీయులు కోరుతున్నారు…
రెండు దశాబ్దాలుగా సైబర్ నేరాలపైనా, ఆన్ లైన్లో వేధించేవారిపైనా నిఘా పెట్టి కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నిస్సహాయులైన బాధితులను ఆదుకునేందుకు ప్రస్తుతమున్న ఐపీసీ సెక్షన్ 388…420….463….499…500…503 చాలవని సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. ఈ మెయిల్స్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపడం, వెబ్ హ్యాకింగ్ లాంటి చర్యలను నిరోధించేందుకు ఈ సెక్షన్లున్నప్పటికీ నేరగాళ్లు సులభంగా తప్పించుకునే మార్గాలు కూడా ఉన్నాయని వాదిస్తున్నారు. సోషల్ మీడియా ప్రొఫైల్ ను హ్యాక్ చేసి వేధించే వారి సంఖ్య రోజురోజుకు పెరగడానికి కారణం కఠిన శిక్షలు లేకపోవడమే.. వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని వదిలిపెట్టకూడదన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి…
సైబర్ నేరాలకు బాధితులవుతున్న వారిలో 37 శాతం మంది ఇండియాలోనే ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇచ్చేయ్యడంతో వారేమీ చేస్తున్నారు.. వారెలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అర్థం కావడం లేదు. భారతీయ పిల్లల్లో 43 శాతం మంది సైబర్ బుల్లీయింగ్ కు గురయ్యారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. వాటిని నిరోధించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అది సమర్థంగా అమలు కావడం లేదు. అందుకే ఇప్పుడు సమర్థవంతంగా పనిచేసే కొత్త చట్టం అవసరం. ఇక తెలంగాణ ప్రభుత్వం తన వంతు కర్తవ్యంగా సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తెలంగాణ పోలీసు మహిళా భద్రత విభాగం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ‘సైబర్ అంబాసిడర్లు’ పేరిట ప్రచారకర్తలుగా ఎంపిక చేసింది. సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వారికి వివరిస్తూ ఆ ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి మెలకువలు నేర్పిస్తున్నారు. మహిళలపై సైబర్ వేధింపుల నిరోధానికి గతంలో చేపట్టిన ‘సైబ్-హర్’కు కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు.