1. ఏపీలో పాగా వేసేందుకు గులాబీ దళపతి యోచన
2. ఏపీలో పలువురు తటస్థ నేతలతో సంప్రదింపులు
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తరువాత ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన. ముందుగా చెప్పినట్లుగానే దసరా రోజున మధ్యాహ్నం ఒంటి గంటా 19 నిమిషాలకు బీఆర్ఎస్ పార్టీ జెండా, ఎజెండాలను ఆవిష్కరించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సర్వసభ్య భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీని జాతీయ స్థాయికి ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తోంది, దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులేంటి అన్నది కేసీఆర్ వివరించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ జెండా, అజెండాను వెల్లడించారు. ఇక నుంచి టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారుతుంది. సర్వసభ్య సమావేశానికి హాజరైన 283 మంది సభ్యులు.. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పునకు సంబంధించిన తీర్మానంపై సంతకాలు చేశారు. ఈ సమావేశానికి ముందు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. జేడీయూ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన కేసీఆర్ను కలుసుకున్నారు. అలాగే తమిళనాడు వీసీకే అధ్యక్షుడు తిరుమావలవన్ ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతో వచ్చి కేసీఆర్ను కలిసారు.
జాతీయ స్థాయిలో కలిసొచ్చే పార్టీలను కలుపుకుని పోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఏపీలో కూడా BRSకు మంచి ఆదరణ ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు జరిపారని సమాచారం. సంక్రాంతి తరువాత విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ సభకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.