చైనాలో ఏదో జరుగుతోంది..అంత రహస్యమెందుకు?

By KTV Telugu On 2 October, 2022
image

*జింగ్‌పింగ్‌ గాయబ్‌.. చైనా ఆర్మీపాలనలోకి వెళ్తుందా?

చైనాలో ఏం జరుగుతోంది? మొత్తానికి ఏదో జరుగుతోంది? అయితే ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలీదు. జిన్‌పింగ్‌ని గృహనిర్బంధంలో ఉంచారంటారు. చడీచప్పుడు లేకుండా సైనిక తిరుగుబాటు జరిగిందంటారు. లేదు లేదు పార్టీపై, ప్రభుత్వంపై పట్టుకోసం జిన్‌పింగే కొత్త వ్యూహానికి తెరలేపారంటారు. జనాభాలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశం. సైనికపాటవ పరంగా కూడా ముందున్న దేశం. ప్రజాస్వామ్య విప్లవాన్ని ట్యాంకర్ల కింద నిర్దాక్షిణ్యంగా చిదిమేసిన దేశం. అందుకే ఆ దేశంలో పరిణామాలపై ప్రపంచమంత అంత ఆసక్తి. అయితే అన్నీ ఊహాగానాలే. అంచనాలే. వేటికీ ఆధారంలేదు. ఇప్పటిదాకా చైనా పాలకుల నుంచి, ఆ దేశం మీడియా నుంచి వీసమెత్తు సమాచారం బయటికి పొక్కలేదు.
చైనా చరిత్రే పెద్ద మిస్టరీ. మొదట్నించీ మిగిలినవారిది ఓ దారైతే డ్రాగాన్‌ది మరో దారి. నా దారే రహదారి అంటుంది ఆ దేశం. చైనా ఆలోచనలు, ఎత్తుగడలు, వేసే ప్రతీ అడుగూ అనుమానాస్పదంగానే ఉంటుంది. కరోనా నియంత్రణకూడా అత్యంత రహస్యం. అసలా మహమ్మారిని పుట్టించిందే చైనా అని ప్రపంచదేశాల అనుమానం. అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడ్డా ఆ దేశానిది వితండవాదమే. అలాంటి దేశంలో ఇప్పుడేదో జరుగుతోందన్న ప్రచారం ప్రపంచాన్ని ఆలోచనలో పడేస్తోంది.
సెప్టెంబరు 15-16 తేదీల్లో షాంఘై సమావేశంలో చివరిసారి కనిపించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. ఆ మీటింగ్‌కి భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా వచ్చారు. అంతే…అప్పట్నించీ జిన్‌పింగ్‌ కదలికలు ఎవరికీ కనిపించడంలేదు. బీజింగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన్ని ఆర్మీ అదుపులోకి తీసుకుందంటున్నా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కమ్యూనిస్టు పార్టీ, ఆ దేశ విదేశాంగశాఖ, చైనా అధికారిక మీడియా అన్నీ ఎక్కడికక్కడే గప్‌చుప్‌. అలాటిందేమీ లేకపోతే చైనా అధ్యక్షుడు అందరికీ కనిపించాలి. తన గొంతు వినిపించాలి. లేకపోతే అధికారిక వివరణ అన్నా రావాలి. అలాంటివేమీ లేవు. తమకు వ్యతిరేకంగా ఎవరన్నా నోరెత్తితే చీల్చిచెండాడేసే చైనా అధికారిక మీడియా సైలైంట్‌గా ఉంది. అక్టోబర్‌16న కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా 20వ కాంగ్రెస్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యే 2,300 మంది ప్రతినిధుల్లో ఎక్కువమంది ఆయనకు అనుకూలమైనవారే. జింగ్‌పింగ్‌ స్టేటస్‌ ఆరోజు తేలిపోతుంది.
రూల్‌ ప్రకారం 2023లో దిగిపోవాల్సిన జింగ్‌పింగ్‌ జీవితాంత అధ్యక్షుడిగా ఉండాలనుకోవడమే తిరుగుబాటుకు దారితీసిందనే బలమైన రూమర్‌ నడుస్తోంది. జిన్‌పింగ్ తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆయన మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికకావడం మెజార్టీ నేతలకు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే సైన్యం జోక్యం చేసుకుందన్న బలమైన వాదన ఉంది. ఒకవేళ జింగ్‌పింగ్‌ని బలవంతంగా దించేసి సైన్యం అధికారపగ్గాలు చేపడితే మాత్రం భారత్‌కు పెద్దగండం ముంచుకొచ్చినట్లే!