ఢిల్లీకి బాబు.. పొత్తుపై క్లారిటీ వచ్చేనా?

By KTV Telugu On 25 November, 2022
image

డిసెంబర్ 5న ఢిల్లీకి చంద్రబాబు
మోడీతో ప్రత్యేక భేటీ ఉంటుందా?
బీజేపీతో పొత్తు కోరుకుంటున్న బాబు
మోడీ అందుకు అవకాశమిస్తారా?

ఏపీలో పొత్తుల అంశం హీటెక్కిస్తోంది. జగన్‌ను ఎదుర్కొనేందుకు వచ్చే ఎన్నికల్లో జనసేనతో పాటు బీజేపీతో కలిసి వెళ్లాలని ఆరాటపడుతున్నారు చంద్రబాబు. కానీ పవన్‌కల్యాణ్‌ అయితే ఓకే అంటోన్న బీజేపీ, బాబును మాత్రం పక్కనబెడుతోంది. దీంతో ఒంటరైపోయిన టీడీపీ అధినేత మోడీ నుంచి ఒక్క పిలుపు వస్తే బాగుండని ఎదురుచూస్తున్నారు. మొన్నా మధ్య విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని పవన్‌కల్యాణ్‌తో అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత అప్పటివరకు తనతో ఉన్న పవన్ ఒక్కసారిగా దూరమయ్యారు. జనసేనాని టీడీపీకి దూరమవుతున్నారనే సంకేతాలు రాజకీయంగా మొదలయ్యాయి. అప్పట్నుంచి ఢిల్లీ నుంచి బాబుకు ఒక్క పిలుపు వస్తే బాగుండని తమ్ముళ్లు కోరుకుంటున్నారు. ఇప్పుడు రానే వచ్చింది. డిసెంబర్ 5న ఢిల్లీకి రావాలంటూ కేంద్రమంత్రి జోషి నుంచి చంద్రబాబు పిలుపు వచ్చింది. అయితే అది పొత్తులపై చర్చకోసం కాదు. హస్తిన వేదికగా ప్రధాని అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకే బాబుకు ఆహ్వానం అందింది. భారత్‌లో నిర్వహించే జీ 20 భాగస్వామ్య దేశాల సమ్మిట్‌పై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రాష్ట్రపతి భవన్ లో 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది.

వెళ్లేది.. రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికే అయినా అక్కడే మరో రెండు రోజులు ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అయిపోగానే బాబు మోడీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వారితో పొత్తులపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశం కానున్నారనే చర్చ జరుగుతోంది. ఆ మధ్య ఢిల్లీ వెళ్లినప్పుడు బాబుతో ప్రత్యేకంగా మాట్లాడిన మోడీ మరోసారి కలుద్దామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కేంద్రం నుంచి వచ్చిన పిలుపుతో బాబు హస్తినకు వెళుతున్నారు. సందర్భం వేరైనా వారితో మరిన్ని విషయాలు మాట్లాడే సమయం దొరుకుతుందనే ఆశాభావంతో చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు 2014 ఎన్నికల పొత్తు రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు ఛాన్స్ లేదని తేల్చి చెబుతున్నారు. పవన్ తన నిర్ణయం ఏంటనేది స్పష్టత ఇవ్వటం లేదు. బాబు మోడీతో భేటీ అయితే పొత్తుపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముందని తమ్ముళ్లు ఆశిస్తున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఒకేసారి ఢిల్లీకి వెళ్లనుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా ప్రధాని సమక్షంలో ఈ ఇద్దరు నేతలు హాజరు కానుండడం విశేషం. గతంలోనూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కూడా కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానం పంపింది. అప్పుడు మోడీ బాబును పలకరించారు. మళ్లీ మాట్లాడుదామని పంపించారు. ఈ సారి కూడా పలకరింపులకే పరిమితమవుతారా లేకపోతే చంద్రబాబు కోరుకుంటున్నట్లుగా పొత్తులపై మాట్లాడేందుకు అవకాశమిస్తారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.