తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.
ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు తరచుగా రాష్ట్రంలో పర్యటించి వెళ్తున్నారు. ఏడాది డిసెంబర్ నాటికి శాసనసభ గడువు ముగియనుంది. అంటే ఎన్నికలకు మరో సంవత్సరం మాత్రమే సమయముంది. ఈ మేరకు అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు కూడా ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వరుసగా జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించి రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్న బీజేపీ ఈసారి అధికారం తమదే అనే ధీమాతో ఉంది. టీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా తలపడుతూ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. టీఆర్ఎస్ బలగాలన్నీ మునుగోడులో మోహరిచాయి. బీజేపీని ఓడించి తమకు ఎదురు లేదని నిరూపించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ను ఓడించడం ద్వారా రాష్ట్రంలో అధికారానికి బాటలు వేసుకోవాలనే ఆశయంతో బీజేపీ పనిచేస్తోంది. మరోవైపు శుక్రవారం బీజేపీ రాష్ట్ర శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాబితా విడుదల చేశారు. నియోజకవర్గాల ఇంచార్జీలే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో… తాజా జాబితాతో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించినట్టే అనుకుంటున్నారు.