జనసేన అధినేత పవన్ కళ్యాణ్…2024 అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్న పవన్…పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో ఉంటూ…పక్క పార్టీకి సహకరించే నేతలు వెళ్లిపోవచ్చంటూ చురకలంటించారు. ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని చెప్పడం…తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వరుసగా జిల్లాల పర్యటన చేస్తూ…ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు జనసేనాని.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు…తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయ్. కొంత మంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కోవర్టుల కారణంగా…అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. ప్రజారాజ్యం ఉంటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఉండేదన్నారు. ప్రజారాజ్యంలో కోవర్టులు ఉన్నట్లే జనసేన ఉన్నారా అంటే పవన్ కల్యాణ్ అవునని అంటున్నారు. జనసేనలో ఉంటూనే…మరో పార్టీకి కోవర్టులుగా కొందరు పని చేస్తున్నారని వెల్లడించారు. పార్టీలో కోవర్టులు తనను వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. జనసేనలో ఉంటూ…మరో పార్టీకి సహకరించే వ్యక్తులు…వెంటనే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవచ్చంటూ హెచ్చరించారు. పార్టీలో తప్పులు చేస్తే…సహించే ప్రసక్తే లేదని…సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి పార్టీలో నిర్మాణ లోపాలు సరిదిద్దుకుంటామన్న జనసేనాని….క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
పార్టీలో ఉన్న నమ్మకద్రోహులపై ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఫుల్ క్లారిటీతో ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఎన్నికలకు వెళతామంటూ.. ప్రత్యర్థి పార్టీలకు స్పష్టత ఇచ్చేశారు. అయితే ఏ పార్టీ పల్లకిలు మోయడానికి సిద్ధంగా లేనంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీలో కలిసి పోటీ చేస్తారా లేదంటే…ఒంటరిగా పోటీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోనూ మూడో ప్రత్యామ్నాయం ఉండాలంటూనే.. అవసరమైతే ప్రత్యర్ధులతోనూ కలుస్తానంటూ బాంబు పేల్చారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే.. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న కేసీఆర్…ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు గుర్తు చేశారు. కేసీఆర్ కు వ్యూహాలు ఉన్నట్లే…తమకు ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు. పార్టీలో పక్క చూపులు చూస్తున్నా.. పార్టీ నిర్ణయాలను లీక్ చేస్తున్న నేతలకు.. పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేనాని పవన్ కల్యాణ్ కు పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎదురైన పరిస్థితులు మరోసారి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగా….పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ….గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. నేరుగా రైతు కుటుంబానికి కలిసి…వారితో మాట్లాడి ధైర్యం చెబుతున్నారు. జనసేన పార్టీ అండగా ఉంటుందంటూ…కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల్లోపు రాష్ట్రం మొత్తం పర్యటించి…పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు జనసేనాని. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కీలక శక్తిగా ఎదిగేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నారు.