భారత్ లో 5 శ్రీలంకలు…. మనల్ని ముంచేస్తోందెవరు?

By KTV Telugu On 23 July, 2022
image

కొన్ని రాష్ట్రాలను కేంద్రం శ్రీలంకతో ఎందుకు పోల్చింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఘర్షణాత్మక వైఖరిగా భావించాలా… నిజంగానే దేశంలో పరిస్థితులు శ్రీలంక కంటే ఘోరంగా ఉన్నాయా.. అధోగతిపాలు కాకుండా ఉండాలంటే రాష్ట్రప్రభుత్వాలు చేయాల్సిందేమిటి…. ఇప్పుడు చేస్తున్నదేమిటి…

శ్రీలంక పరిస్థితులపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కొంచెం రూటు మారినట్లు కనిపించినా దేశంలో వాస్తవ పరిస్థితులకు దర్పణం పట్టింది. కొన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీలంక తరహా పరిస్థితులు ఉన్నాయని కేంద్రం ప్రజెంటేషన్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు అపరిమితంగా అప్పులు చేస్తూ దివాలా దిశగా పయనిస్తున్నాయని వెల్లడించింది. తెలంగాణకు నాలుగున్నర లక్షల కోట్లు, ఏపీకి దాదాపు అంతే స్థాయిలో అప్పులు ఉన్నట్లు కేంద్రం ప్రస్తావిస్తున్న తరుణంలో రాష్ట్రాల ప్రతినిధులు అభ్యంతరం చెప్పారు,దానితో వెనక్కి తగ్గిన కేంద్రం ద్రవ్య  సమస్యల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతోనే ప్రస్తావించామని చెప్పి ఊరుకుంది…

అఖిలపక్ష సమావేశంలో ఎదురుదాడి చేసేందుకు రాష్ట్రాలు ప్రయత్నించాయి. కేంద్రం చేస్తున్న అప్పులపై కూడా చర్చ జరగాలని పట్టుబట్టాయి. తమలపాకుతో నువ్వొకటంటే… తలుపు చెక్కతో నేను ఒకటి అంటానన్న చందంగా పరిస్తితి తయారైంది. నిజానికి కేంద్రం చేస్తున్న హెచ్చరికలను రాష్ట్రాలు పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ఏపీకి 4 లక్షల 39 కోట్ల వరకు అప్పులు ఉన్నాయంటూ కేంద్రం తన ప్రజెంటేషన్లో ప్రస్తావించినట్లు సమాచారం. కొన్ని అప్పులను లెక్కలోకి తీసుకోలేదని చెబుతున్నారు. వాటిని జోడించి, జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను కూడా లెక్కగడితే అప్పులు ఎనిమిది లక్షల కోట్లకు దరిదాపుల్లో ఉన్నాయి. తెలంగాణ పరిస్థితి కూడా అంతే… రాష్ట్రా జీఎస్డీపీలో అప్పులు నాలుగు శాతం మించకూడదని ఒక నియమం ఉంది. ప్రభుత్వాలు మాత్రం అంతకు ఎన్నో రెట్లు అప్పులు చేస్తున్నాయి. తెలంగాణకు ప్రతీ నెల 10 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంటే.. 16 నుంచి 17 వేల కోట్ల వరకు వ్యయమవుతోంది. జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలకు ఎక్కువ వ్యయమవుతోంది… సెప్టెంబరు నాటికి కొత్త అప్పులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఎదురుచూస్తోంది. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఎదురు చూస్తోంది…

చైనాను నమ్ముకుని శ్రీలంక భారీగా అప్పులు చేసింది. ఏడు బిలియన్ డాలర్ల అప్పులను ఇప్పుడు తీర్చలేక  నానా తంటాలు పడుతోంది. సంక్షేమ పథకాల పేరుతో జనానికి దోచిపెట్టి…. ఆర్థిక స్థితిని అధోగతి పాలు చేసిన పాలకులు ఇప్పుడు చేతులెత్తేశారు. పెట్రోలు దిగుమతి చేసుకునేందకు కూడా డబ్బులు లేక ఇంధన కొరత ఏర్పడింది. అత్యవసర సేవలకు మినహా వేటికి పెట్రోల్ సరఫరా చేయడం లేదు.శ్రీలంకను నమ్మి సాయం చేయలేమని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ కూడా ప్రకటించాయి. దేశంలో నిరసనలు మిన్నంటి… జనం అధ్యక్ష భవనంపై కూడా దాడి చేయడంతో గొటబాయ పారిపోయారు. దేశాన్ని కాపాడే నాధుడు లేక సగటు లంకావాసి గగ్గోలు పెడుతున్నాడు…

శ్రీలంక పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో రాకుండా చూసుకోవాలని బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.వారికి సహకరించాల్సిన బాధ్యత కూడా ప్రజలపై ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతీ నెల చేసే కొత్త అప్పులను తగ్గించుకోవాలి. రకరకాల పేర్లతో నడుస్తున్న ఉచిత పథకాలపై కూడా పరిమితులు పెట్టుకోవాలి, జనాకర్షణ కోసం ప్రారంభించే పథకాలు తగ్గించి.. సహేతుకమైన పథకాలనే కొనసాగించాలి. ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించుకోవాల్సిన అనివార్యత ఉంది. కరోనా తర్వాత కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు చేపట్టాలి. ఇందుకోసం పర్యాటకం సహా పలు పరిశ్రమలను ప్రోత్సహించాలి. రియల్ ఎస్టేట్ రంగం నిదానిస్తున్న తరుణంలో ప్రోత్సాహకాలు ప్రకటించాలి. తెలంగాణలో సాఫ్ట్ వేర్ పరిశ్రమ బలంగా ఉన్న మాట వాస్తవం. దానితో తోడు తయారీరంగాన్ని ప్రోత్సహించాలి. చిన్న మధ్య తరహా  పరిశ్రమలకు రాయితీలు పెంచాలి. ద్రవ్యలోటు మూడు శాతం పరిమితి దాటకుండా చూసుకున్నప్పుడే నిధుల లభ్యతసాధ్యమని గుర్తించాలి. అన్నింటికి మించి కొత్త అప్పులు బాగా తగ్గించాలి.

ఆర్థిక సంక్షోభం రాజకీయ, రాజ్యాంగ సంక్షోభంగా రూపాంతరం చెందుతుందని శ్రీలంక పరిణామాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచించి.. ముందు జాగ్రత్త చర్యలు చేపడితే మంచిది. ప్రభుత్వంపై అన్ని వర్గాలు అసంతృప్తి చెందకుండా చూసుకున్నప్పుడే రాజకీయ వ్యవస్థ మనుగడ సాధిస్తుంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీలు, నేతలకు మంచి పేరు వస్తుంది..