మీడియాలోనూ అదానీకి తిరుగుండదా

By KTV Telugu On 27 August, 2022
image

అదానీ గ్రూపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని మీడియా రంగంలోకి విస్తరించింది. వార్తల పరంగా, విధాన పరంగా బీజేపీని వ్యతిరేకించే ఎన్డీటీవీలో వాటాలను కొనుగోలు చేసింది. వ్యాపార ప్రత్యర్థి అయిన అంబానీకి ఇప్పుడు మీడియాలోనూ పోటీ ఇవ్వాలని డిసైడైంది. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటి ?

అహ్మదాబాద్ కేంద్రంగా దేశమంతా వ్యాపార కార్యకలాపాలు సాగించే అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీకి ఇప్పుడు పట్టిందల్లా బంగారమవుతోంది. మీడియా రంగంలోకి ప్రవేశించాలని అదానీ ఏడాదిగా ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పుడే న్యూఢిల్లీ టెలివిజన్ కంపెనీ .. ఎన్డీటీవీని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా అది సక్సెస్ కాలేదు. ఇప్పుడు మాత్రం కొత్త రూటులో వాటాలు కొనుగోలు చేశారు. లిస్టెడ్‌ కంపెనీ అయిన ఎన్డీటీవీలో గౌతమ్‌ అదానీ తొలుత పరోక్షంగా వాటా దక్కించుకున్నారు. ఇందుకోసం ఎన్‌డీటీవీ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేశారు. తద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్‌ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించారు.

ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికారాయ్ కి తెలియకుండానే గుట్టుచప్పుడు కాకుండా అదానీ గ్రూపు ఈ డీల్ ను సెటిల్ చేసేసుకుంది. దీనితో ప్రణయ్ రాయ్ ఇప్పుడు అభ్యంతరం చెబుతున్నప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నష్టాల నుంచి లాభాల వైపుకు పయనిస్తున్న ఎన్డీటీవీని కొనుగోలు చేయడం మంచి డీలే అవుతుందని కూడా ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెబీ నిబంధనల ప్రకారం.. ఏదైనా లిస్టెడ్‌ కంపెనీలో 25 శాతం, అంతకు పైగా వాటా కొనుగోలు చేసినప్పుడు తప్పక ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. అదానీ మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌, విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కలిసి ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. దీనితో ఇప్పుడు ఎవరూ అడ్డుచెప్పే అవకాశం కూడా లేదనిపిస్తోంది.

తాజా డీల్ తో ఖంగు తిన్న ప్రణయ్ రాయ్ వెంటనే నిలదొక్కుకున్నారు. తమ కుటుంబ షేర్ 31 శాతంలో ఎలాంటి మార్పు ఉండబోదని సెబీకి సమాచారం అందించారు. ఈ డీల్ తో గౌతమ్ అదానీ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నట్లయ్యింది. ఎన్డీటీవీ కొనుగోలుతో తన ప్రధాన వ్యాపార ప్రత్యర్థి ముకేశ్‌ అంబానీతో పోటీని అదానీ మరో మెట్టెక్కించారు. అంబానీ చాలాకాలంగా న్యూస్‌ చానళ్ల విభాగంలో ఉన్నారు. ఆయన యాజమాన్యంలోని నెట్‌వర్క్‌ 18 సంస్థ సీఎన్‌ఎన్‌-న్యూస్‌ 18, సీఎన్‌బీసీ-టీవీ 18 వంటి వార్తా చానళ్లను నిర్వహిస్తోంది. అదానీ గ్రూప్ ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలోకి కూడా విస్తరించే ప్రయత్నంలో ఉంది.

దేశంలో ప్రధాని మోదీకి అనుకూలంగానే మెజార్టీ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. ఎన్డీటీవీ లాంటి ఒకటి రెండు సంస్థలు మాత్రమే ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్నాయి. ఇప్పుడు వాటిని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే తిరుగుండదని భావించిన బీజేపీ.. గౌతం అదానీ ద్వారా ఆ పనిచేయించిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా ప్రణయ్ రాయ్ పై గతంలో మనీ లాండరింగ్ కేసులు కూడా నమోదై ఉన్నాయి. తాజా పరిణామాలతో మీడియా స్వరూపమే మారిపోతుంది. మీడియా సంస్థలు మొత్తం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. మరో పక్క ఎన్డీటీవీ పేరు మారుతుందని.. అదీ నరేంద్ర దామోదర్ దాస్ టీవీ అవుతుందని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.