మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతోపాటు ప్రచారం కూడా ఊపందుకుంది. మునుగోడులో విజయం సాధించాలనే పట్టుదలతో మూడు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. తమ పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నాయి. ఇక బీజేపీ విషయానికొస్తే సినిమా నటుల సహాయ సహకారాలను తీసుకుంటోంది. ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత అయిన జీవిత రాజశేఖర్ మునుగోడు లో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారని తెలిసింది. ఈటెల రాజేందర్ జీవిత కి ఫోన్ చేసి మునుగోడు లో ప్రచారం చెయ్యాల్సిందిగా ఆహ్వానించారని, అందుకు జీవిత సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మనుగోడులో జీవిత రాజశేఖర్ ప్రచార కార్యక్రమం ఇంకో రెండు రోజుల్లో ఖరారు అవుతుంది. ఆ తరువాత ఈటెల భార్యతో కలిసి జీవిత రాజశేఖర్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారని భావిస్తున్నారు. జీవిత రాజశేఖర్ భారతీయ జనతా పార్టీ తరపున ఈ వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో తెలంగాణ నుండి కానీ, ఆంధ్ర నుండి కానీ పోటీ చేస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. జీవిత మంచి వక్త, బాగా మాట్లాడతారు…ఆమెను ఎన్నికల ప్రచారంలోకి దింపితే మహిళా ఓటర్లను ఆకట్టుకోవచ్చనేది బీజేపీ అధిష్టానం ఆలోచన. అందుకే జీవితను మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చెయ్యమని పార్టీ అభ్యర్ధించినట్టు తెలుస్తోంది. ఇక అదే పార్టీకి చెందిన సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి కూడా మునుగోడుకు వచ్చి ప్రచారంలో పాల్గొంటారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు.