ఏపీ కాంగ్రెస్ కు కష్టకాలం
వెంటాడుతోన్న విభజన పాపం
ప్రతీ ఎన్నికలోనూ ఓటమిపాలు
రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్
పార్టీ పరిస్థితి ఆరా..!
రాహుల్ గాంధీ జోడో యాత్రతో ఏపీ కాంగ్రెస్ కి పునర్ వైభవం వస్తుందా? విభజన తర్వాత రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్ ను…రాహుల్ గాంధీ తన యాత్ర ద్వారా తిరిగి బలపర్చగలరా? అంటే ఇప్పట్లో అది అసాధ్యమనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశవ్యాప్తంగా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో…భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్ పార్టీని నీడలా వెంటాడుతోంది. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో ఆ పార్టీ కనిపించకుండా పోయింది. ఏ ఎన్నికలో పోటీ చేసినా డిపాజిట్లు కోల్పోవడం మినహా కాంగ్రెస్ గట్టెక్కింది లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ కు… కొద్దోగొప్పో కనిపిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘనస్వాగతం చెప్పడం మినహా పార్టీకి పెద్దగా ఓనగూరే ప్రయోజనం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవడమే తప్ప….తిరిగి ఆ పార్టీలోకి వచ్చే నేతలెవరూ కనిపించడం లేదు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చారు రాహుల్ గాంధీ. కర్ణాటక నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గంలోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ కు…ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాధ్ తో పాటుగా మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సహా మరికొందరు నేతలు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నేతలను రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. విభజన తర్వాత హస్తం నేతలంతా వైసీపీ, టీడీపీలవైపు వలస వెళ్లిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఏపీలో ఇప్పుడు ఆ పార్టీకి పదుల సంఖ్యలో మాత్రమే నేతలు కనిపిస్తున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరమైన రఘవీరా రెడ్డి ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర వరకే పాల్గొంటున్నారు. చిరంజీవికి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో కొంత దూరం వరకు మాత్రమే రాహుల్ యాత్ర కొనసాగనుంది. కేవలం ఒక రోజు మాత్రమే ఆయన ఈ యాత్ర చేయనున్నారు. అది కూడా 12 కిలోమీటర్లు మాత్రమే. సీమలోని కొన్ని ప్రాంతాలు తమిళనాడు, కర్ణాటకతో సరిహద్దులు కలిగి ఉన్న కారణంగా…అనంతపురం జిల్లా డి.హీరోహల్ మండలం జాగర గల్ వద్ద ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. తిరిగి మళ్లీ కర్నాటకలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఇక, ఈ నెల 17వ తేదీన కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.