తెలుగు రాష్ట్రాల పొలిటికల్ థియేటర్లోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ బుద్ధి పూర్వక డిలే చేస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీ, టీఆర్ఎస్ లు అధికారంలో ఉండగా… టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, షర్మిల పోటీ పడుతున్న తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే కాలుమోపాలని ఆప్ భావిస్తోంది. అందుకే ఆచి తూచి అడుగులు వేస్తోంది…
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్లో హైదరాబాద్ వస్తారని ప్రచారం జరిగింది. భారీ స్థాయిలో మెంబర్ షిప్ డ్రైవ్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తితో వేరు కుంపట్లు పెట్టుకున్న ఇద్దరు ముగ్గురు కీలక నేతలు కేజ్రీవాల్ సమక్షంలో ఆప్ లో చేరతారని ప్రచారం జరిగింది. ఏప్రిల్ గడిచి పోయింది. మే వచ్చింది… అనుకున్నది మాత్రం జరగలేదు. కేజ్రీవాల్ రాలేదు.. ఆప్ జైత్రయాత్ర ప్రారంభం కాలేదు. వ్యూహం మారింది. రూట్ మార్చారని చెప్పుకున్నారు. ఇంతకీ ఏమిటా రూట్…
టార్గెట్ గుజరాత్
ఉత్తర, పడమటి రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు కేజ్రీవాల్.. దక్షిణాదిపై దండయాత్రను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉంటూ.. పంజాబ్ ను చేజిక్కించుకున్న తర్వాత జాతీయ పార్టీగా ఎదగాలన్న ఆప్ ఆశలు చిగురించాయి. . ప్రధని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో పాగా వేయాలన్న దృఢ సంకల్పం కేజ్రీవాల్ బృందంలో కనిపిస్తోంది. ఇప్పుడు కేజ్రీవాల్ గుజరాత్ టూర్లు మొదలు పెట్టారు. ఢిల్లీని పోల్చుకుని చూడాలంటూ గుజరాత్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. హస్తిన తరహా మొహల్లా క్లినిక్స్, ఢిల్లీ గవర్నమెంట్ మాడల్ స్కూల్స్ ని గుజరాత్ లో ప్రారంభిస్తామని చెబుతున్నారు. ప్రస్తుత గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసిందని, పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నా ఢిల్లీలో పీఎం, అహ్మదాబాద్లో సీఎం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆఖరుకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. దమ్ముంటే ముందే పెట్టాలని కేజ్రీవాల్ సవాలు చేస్తున్నారు.
దక్షిణాది కోసం తొందరపడ దలచుకోలేదా….?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం ఇంకా వేడెక్కలేదు. ప్రస్తుతం పాదయాత్రల సీజన్ నడుస్తోంది. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిల, కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలు చేస్తున్నారు. మరి కొందరు నేతలు చెప్పులో కాళ్లు పెట్టి మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వర్సెస్ టీడీపీ, వైసీపీ వర్సెస్ జనసేన పంచాయతీ రోజు వారీగా జరుగుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2023 చివర్లోనూ, ఏపీలో 2024 ప్రథమార్థంలోనూ జరగాలి. దానితో ఇప్పుడే తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టే కంటే.. ఈ ఏడాది ఆఖరులోనూ, వచ్చే ఏడాది మొదట్లోనూ ఉత్తరాదిన జరిగే ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుని తర్వాత ఇటువైపు ఒక చూపు చూద్దామని ఆప్ నేతలు భావిస్తున్నారు.అందుకే దూకుడు కనిపిచడం లేదు.. ప్రస్తుతానికి ఆప్ ద్వితీయ శ్రేణి నాయకులు చాప కింద నీరులా పని చేసుకుపోతున్నారు…