నిన్న శ్రిదేవీ.. నేడు టీనా… ఆటకు అర్థాంతరంగా ఎందుకు తెర పడుతోంది?

By KTV Telugu On 13 May, 2022
image

వినోద పరిశ్రమలో మరో తార రాలిపోయింది. ప్రస్తుతానికి లో ప్రొఫెల్ లో ఉన్న ఆట ఫేమ్ డ్యాన్స్ మాస్టర్ టీనా సాధుకు చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయి. ఆమె ఆకస్మిక మరణం తెలుగు టీవీ ప్రియులు జీర్ణించుకోలేకపోతున్న మాట వాస్తవం. హైదరాబాద్ వచ్చి వెళ్లిన తర్వాత ఆమె స్థిర నివాసం ఏర్పరచుకున్న గోవాలోనే టినా తుది శ్వాస విడిచారు. నిజానికి టీనాది మిస్టరీ డెత్ గానే చెప్పాలి. గతంలో అందాల తార శ్రీదేవి కూడా అనుమానాస్పద పరిస్థితుల మధ్య స్నానాల తొట్టితో నిర్జీవమయ్యారు. ఆమె మృతిపై కచ్చితమైన కారణాలు తెలసుకునే ప్రయత్నం కూడా చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. నాలుగు రకాలుగా ప్రచారం చేసి తర్వాత వదిలేశారన్న వ్యాఖ్యానాలు వినిపించాయి….

టీనా ఎలా…?

ఆట.. రియాల్టీ డ్యాన్స్ షో విన్నర్ టీనాను నిజానికి చాలా మంది తెలుగువాళ్లు మరిచిపోయే ఉంటారు. డ్యాన్స్ లో ఆమెకు తిరుగులేదు. ఆట తొలి సీజన్ లో సందీప్ తో కలిసి ఆమె విన్నర్. అదే షో నాలుగో సీజన్ కు జడ్జిగా వ్యవహరించారు. తర్వాత కొన్ని సినిమాలకు, షోలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. . గోవాలో రఘు అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్న టీనా… అక్కడే ఉంటూ భర్త రిసార్ట్స్ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. ఇటీవలే టీనా హైదరాబాద్ వచ్చి వెళ్లారు. మళ్లీ డ్యాన్స్ షోకు జడ్జిగా రావాలని కోరకుంటున్నట్లు కొందరు మిత్రులకు చెప్పుకున్నారు. తర్వాత గోవా వెళ్లిపోయిన కొద్ది రోజులకే ఆమె చనిపోయారు.

గుండెపోటేనా ?

టీనా గుండెపోటుతో మరణించినట్లు భావిస్తున్నారు. అయితే ఆమె మితిమీరి మద్యం సేవించడం వల్ల గుండెకు రక్త ప్రసారంలో హెచ్చుతగ్గులు సంభవించి ప్రాణాలు కోల్పోయి ఉంటుందని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. టీనా మృతిపై మూడు నాలుగు కోణాల్లో విచారణ జరుగుతోంది. టీనా హైదరాబాద్ ఎప్పుడు వచ్చింది ? తిరిగి గోవా ఎప్పడు వెళ్లింది ? గోవాలో ఏం జరిగింది ? అక్కడ ఆమె ఎవరితోనైనా గొడవ పడిందా ? గొడవపడి అతిగా మద్యం తాగిందా ? ఆమెపై ఎవరైనా దాడి చేశారా ? లాంటి కోణాల్లో గోవా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు….

శ్రీదేవి మరణంపై మిస్టరీ

ప్రముఖ పాన్ ఇండియా నటి శ్రీదేవి 2018లో దుబాయ్ లోని ఒక హోటల్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. బాత్ డబ్ లో ఆమె శవమై కనిపించారు.. భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె దుబాయ్ వెళ్లి.. అక్కడ ఒక హోటల్ లో ఉన్నారు. రెండు రోజులకే కుటుంబ సభ్యులంతా తిరిగి రాగా.. శ్రీదేవి ఒక్కరే అక్కడ ఉండిపోయారు. మరుసటి రోజే భర్త బోనీ కపూర్ తిరిగి దుబాయ్ వెళ్లారు. ఉదయం బయటకు వెళ్లాలని నిర్ణయించుకుని శ్రీదేవి స్నానానికి వెళ్లారు. ఎంత సేపటికి ఆమె బయటకు రాకపోవడంతో బాత్ రూమ్ తలుపు తెరిచి చూడగా.. శ్రీదేవి బాత్ టబ్ లో చనిపోయి కనిపించారు..

మద్యం సేవించి..

శ్రీదేవి మృతదేహానికి దుబాయ్ లోనే శవపరీక్షలు జరిగాయి. ఆమె నీళ్ల తొట్టిలో స్నానం చేస్తున్నప్పుడు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. ఆమె రక్తంలో స్వల్ప పరిణామంలో మద్యం ఉందని దుబాయ్ వైద్యులు నివేదిక ఇచ్చారు. దానితో మృతిపై అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ఉదయమే బయటకు వెళ్లాలనుకున్న వాళ్లు మద్యం సేవిస్తారా అని కొందరి ప్రశ్న. శ్రీదేవికి తరచూ.. లో బీపీ… సమస్యలు వస్తాయని బోనీ కపూర్ సహా ఆమె కుటుంబ సభ్యులు అప్పట్లో వెల్లడించారు. లో బీపీ కారణంగా నడుస్తూనే తరచూ పడిపోయేవారని… వెంటనే నిలదొక్కుకుని ప్రయాణాన్ని కొనసాగించే వారని చెప్పారు. నీళ్ల తొట్టిలో స్నానం చేస్తున్నప్పుడు బహుశా ఆమెకు సడన్ గా లో బీపీ సమస్యలు ఏర్పడి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. నీళ్లలో మునిగి చనిపోయి ఉంటారని కొందరి వాదన. అయితే శ్రీదైవి బాగా పొడగరి. నీళ్ల తొట్టి కంటే ఏడెనిమిది అంగుళాలు పొడుగు ఉంటారు. ఆమె అందులో మునిగిపోవడమేంటని అభిమానుల ప్రశ్న….

కారణం అదేనా ?

ఒక సెలబ్రిటీ జీవితం అర్థాంతరంగా ముగిసిపోతే వంద ప్రశ్నలు తలెత్తుతాయి. శ్రీదేవి చావుకు బీమా సొమ్మే కారణమని కొందరు ఆరోపించారు. రూ. 240 కోట్ల బీమా సొమ్ము కోసం ఆమెను చంపేశారని ఒక వ్యక్తి సుప్రీం కోర్టులో కేసు వేశాడు. అయితే అత్యున్నత న్యాయస్తానం ఆ కేసును కొట్టివేసింది. కొందరు ఇంకో అడుగు ముందుకేసి శ్రీదేవి మరణం వెనుక దావూద్ ఇబ్రహీం హస్తం ఉందని ఆరోపించారు. ఇప్పుడు టీనా సాధు మృతి వెనుక కూడా ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. టీనాకు ఎంత ఇన్సూరెన్స్ ఉందో చూడాలని కొందరంటున్నారు. పోలీసులు ఉదాసీనతకు అవకాశం ఇవ్వకుండా దర్యాప్తు చేయాలంటున్నారు..

ఆ అనుమానాలు వీడేదెన్నడూ…

కొందరి మరణం మిస్టరీ ఎన్నటికీ వీడే అవకాశాలు కనిపించవు. అమెరికాలో మార్లిన్ మన్రో మృతి కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. దివ్యభారతి ఎలాంటి మరణించిందో ఊహాగానాలే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్… ఆత్మహత్య కేసుపై అనుమానాలు వీడనేలేదు. కొంతకాలం మీడియాలో నలిగిన తర్వాత..మీడియాకు వేరే పనులు ఉండటంతో సుశాంత్ ను జనం మరిచిపోయారు. శ్రీదేవి సంగతి కూడా అదే.. ఇప్పుడు టీనా కేసు ఆయినా ఖచితంగా ఎవరైనా చెప్పగలరేమో చూడాలి…