టెక్కలి టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు. అచ్చెన్నపై బరిలోకి దువ్వాడ. అంతర్గత కుమ్ములాటల కారణంగా ముందే అభ్యర్థిని ఫిక్స్ చేసిన జగన్. వివిభేదాలు పక్కనపెట్టి దువ్వాడను గెలిపించాలని నేతలకు సూచన
కుప్పం మాదిరే టెక్కలి టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న టెక్కలిపై వైసీపీ నాయకత్వం గురిపెట్టింది. అచ్చెన్నపై దూసుకుపోవాలని దువ్వాడకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్. వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తారని చెప్పిన జగన్…ఆయనకు అంతా సహకరించాలని నియోజకవర్గ నేతలకు సూచించారు. ఎన్ని గొడవలు ఉన్నా అవన్నీ పక్కనపెట్టి, అందరూ కలిసి కట్టుగా పని చేసి దువ్వాడను గెలిపించుకొని రావాలని నిర్దేశించారు.
గత ఎన్నికల్లో జగన్ వేవ్ లోనూ టెక్కలి నుంచి గెలుపొందారు అచ్చెన్నాయుడు. ఈసారి 175కు 175 స్థానాలు గెలవాలని కసితో ఉన్న వైసీపీ అధినేత… టెక్కలిలో గెలుపు అవకాశాలపై నియోజకవర్గ నేతలతో నిర్వహించిన సమీక్షలో లెక్కలతో సహా వివరించారు. టెక్కలి నియోజకవర్గ పరిధిలో 136లో 119 పంచాయితీలు.. 78కి 74 ఎంపీటీసీ స్థానాలు… 4కి 4 ఎంపీపీ ..జడ్పీటీసీ పదవులను వైసీపీ గెలుచుకుంది. టెక్కలి లో మార్పు అంత స్పష్టంగా కనిపిస్తోందని, వైసీపీ ఎమ్మెల్యే గెలవాలని స్పష్టం చేసారు. ఏమైనా సమస్యలు ఉంటే ఇంఛార్జ్ మంత్రి బొత్సా సత్యనారాయణతో మాట్లాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సారి క్లీన్ స్వీప్ చేస్తే వచ్చే 30 ఏళ్లు వైసీపీదే అధికారమని సీఎం వ్యాఖ్యానించారు.
టెక్కలి వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. మూడు వర్గాల మధ్య ఆధిపత్య పోరు వైసీపీకి ప్రతికూలంగా మారుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్, శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి గ్రూపు రాజకీయాలతో టెక్కలిలో వైసీపీ పరేషాన్ అవుతోంది. ఇటీవలే ముగ్గురు నేతలను తాడేపల్లికి పిలిపించుకున్న జగన్…గట్టిగానే క్లాస్ పీకారని తెలిసింది. అయినా కూడా, నియోజకవర్గంలో ఆ ముగ్గురు క్షేత్రస్థాయిలో కలిసి పని చేయడం లేదనే ప్రచారం ఉంది.
నేతల మధ్య సఖ్యత లేని కారణంగానే గత ఎన్నికల్లో టెక్కలి చేజారిపోయిందని భావించిన వైసీపీ నాయకత్వం…ఈసారి ముందే మేల్కొంది. నియోజకవర్గంలో టికెట్ ఖరారు పైన అనిశ్చితి, కలహాలు ఉండకూడదనే… ముందుగానే దువ్వాడ శ్రీను పేరు ఖరారు చేస్తున్నట్లు సీఎం వివరించారు. శ్రీనును ఎమ్మెల్యేగా గెలిపించి తీసుకొస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని పేరాడ తిలక్ కు సీఎం హామీ ఇచ్చారు. టెక్కలి సీటు ఆశిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని సైతం… దువ్వాడకు సహకరించాలని సూచించారు జగన్.