అప్పుడప్పుడు కొందరు సినీ ప్రముఖులు అనారోగ్యానికి గురయ్యారే వార్తలు వారి అభిమానల్లో ఆందోళన కలిగిస్తాయి.
వారికొచ్చిన జబ్బేంటి…? ఆ జబ్బు ప్రమాదకరమా ? ఎలా నయమవుతుంది..? అని సోషల్ మీడియాలో చర్చ మొదలవుతుంది. తాజాగా ప్రముఖ సినీ నటి సమంత తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని ట్వీట్ చేసింది. దాంతో అసలు మయోసైటిస్ అంటే ఏంటి..? అది ఎందుకు వస్తుంది…దీనికి చికిత్స ఉందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మన శరీరంపై వ్యాధులు దాడి చేయకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ రక్షణ కల్పిస్తుంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనకు రక్షణ కల్పించే వ్యవస్థ మన శరీరంపై దాడి చేస్తుంది. ఈ పరిస్థితిని ఆటో ఇమ్యూనిటీ అంటారు. దీనివల్ల మయోసైటిస్ అనే జబ్బు సోకుతుంది. దీన్ని వైద్య పరిభాషలో పాలి మయోసైటిస్గా వ్యవహరిస్తారు. ఆటో ఇమ్యూన్ కారణంగా వచ్చే పాలి మయోసైటిస్ వల్ల భుజాలు, తుంటి వద్ద కండరాలు బలహీనమైపోతాయి. కూర్చుంటే పైకి లేవడం కష్టమవుతుంది. కొంతమంది అసలు లేవలేరు. ఇది ఏ వయసువారికైనా రావడానికి అవకాశం ఉంది. చిన్న పిల్లల్లో 5-15 సంవత్సరాల వారికి, పెద్దల్లో 45-65 మధ్య వయసుండేవారికి ఎక్కువగా కన్పిస్తుంది. పురుషులకన్నా మహిళలే ఎక్కువగా మయోసైటిస్ బారిన పడుతుంటారు. చర్మానికి కూడా సమస్య వస్తే…దానిని డెర్మటో మయోసైటిస్గా వ్యవహరిస్తారు. దీనివల్ల కనురెప్పలపై ఊదా, ఎర్రరంగు మచ్చలు రావడంతోపాటు కళ్లు ఉబ్బడం, ఎండలోకి వెళ్తే ముఖం ఎర్రగా మారిపోవడం జరుగుతుంది. ఆటో ఇమ్యూన్తోపాటు వైరస్, కొన్ని మందుల ప్రభావంవల్ల కూడా ‘మయోసైటిస్’ సోకుతుంది. వైరల్ మయోసైటిస్లో కండరాల నొప్పులు తీవ్రంగా ఉండటమే కాకుండా కదలించలేని పరిస్థితి ఏర్పడుతుంది. వైరస్ ప్రభావం తగ్గగానే ఆటోమాటిక్ గా ఇది కూడా తగ్గుతుంది. కొన్ని మందుల కారణంగా వచ్చే మయోసైటిస్…అవి వేసుకోవడం మానేయగానే తగ్గిపోతుంది.
మయోసైటిస్ను కొన్ని బయోకెమిస్ట్రీ పరీక్షల ద్వారా గుర్తిస్తారు. సాధారణంగా రక్తంలో క్రియాటిన్ ఇన్ ఫాస్పోకైనేజ్ స్థాయులు 150-200 వరకు ఉంటాయి. అదే మయోసైటిస్ రోగుల్లో అయితే ఈ సంఖ్య వేలల్లో ఉంటుంది. అంతేకాకాకుండా మయోసైటిస్కు సంబంధించిన యాంటీబాడీలు పెరుగుతాయి. ఎలక్ట్రోమయోగ్రఫీ పరీక్షతో కండరం ఎంత ధృఢంగా ఉందనేది తెలుసుకొని అప్పుడు వ్యాధిని అంచనా వేస్తారు. దీన్ని త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటేనే మంచిది. ఆలస్యం చేస్తే కొందరిలో ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అది కాస్తా పల్మనరీ పైబ్రోసిస్ కు దారితీస్తుంది. అధికంగా బరువుండటం, తగినంత నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడంలాంటివి కూడా మయోసైటిస్ సోకడానికి కారణమవుతాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సమతులాహారం తీసుకోవడంతోపాటు ప్రతిరోజు గంటసేపు వ్యాయామం చేస్తే ఈ తరహా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఈ సమస్య నుంచి సమంత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.