ఎందరో సలహాదారులు.. లక్షల్లో వేతనాలు
వారిచ్చేదేమిటో.. ప్రభుత్వం తీసుకునేదేంటో
చెప్పుకోవడానికి ఓ పదవి.. లక్షల్లో జీతం
వారం, పదిరోజులకొకరి చొప్పున నియామకం
హైకోర్టు ఆక్షేపించినా మారని ప్రభుత్వ తీరు
ఏపీలో ఇప్పుడు సలహాదారుల ట్రెండ్ నడుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో ఒకటైన నామమాత్రపు సలహాదారుల పందేరం సాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్‌కు సలహాదారులను నియమించారు. ఆ తర్వాత ప్రభుత్వ వ్యవహారాలకు సలహాదారుల నియామకం చేపట్టారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించుకుంటూ పోతున్నారు. రాజకీయంగా ఏ పదవి లేని వారికో సలహాదారు చొప్పున ఇచ్చుకుంటూ పోతోంది జగన్ సర్కార్. అదే సమయంలో తమకు పనికొస్తాడని భావిస్తే వారికి ఓ సలహాదారు పదవిని ఇచ్చేస్తున్నారు. ఇలా ఇప్పుడు జగన్ పాలనలో ఎందరో సలహాదారులు చేరిపోయారు. వారం, పదిరోజులకొకరు చొప్పున ఇంకా చేరుతూనే ఉన్నారు. ఇలా సలహాదారు నియామకాలు చేస్తూ ఏదో ఓ శాఖలో వారిని సర్దేస్తున్నారు. చెప్పుకోవడానికి ఓ పదవి లక్షల్లో జీతం వస్తుంది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ వారిచ్చే సలహాలేమిటో, ప్రభుత్వం తీసుకునేదేమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. ప్రజాధనం మాత్రం భారీగా లూటీ అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి, మంత్రులు అధికారుల సహకారంతో రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంటారు. ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకెళ్లడంతో పాటు సలహాలు ఇచ్చేందుకు అధికారులు తోడ్పాటునందిస్తారు. ఇక అదే సమయంలో ముఖ్యమంత్రికి రాజకీయ సలహాదారుడితో పాటు ఓ ప్రభుత్వ సలహాదారు కూడా ఉంటారు. అయితే వీరే కాకుండా జగన్ తన ప్రభుత్వంలో ప్రత్యేకంగా మరికొందరు సలహాదారులను నియమించుకుంటున్నారు. సలహాదారులు, వారికి సలహాలు ఇచ్చేందుకు మరికొందరు సలహాదారులు.. ఇలా జగన్ పాలనలో ఆ పదవులకు కొదవ లేకుండా పోతోంది. అయితే అలా తీసుకున్న వారికి లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారు. ముఖ్యమంత్రి స్పీచ్‌లు రాసే వ్యక్తికి ఓ సలహాదారు ఉన్నారు. ఆయనకు నెలకు నాలుగైదు లక్షల వేతనం ఇస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయనకు మరో ఐదుగుర్ని సలహాదారులుగా నియమించారు. వారందరికి కలిపి నెలకు ఐదు లక్షల వరకూ జీతం ఉంటుందని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో సినీ నటుడు అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. వైసీపీ అధికార ప్రతినిథి పద్మజను మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగ, వృద్ధుల విభాగానికి సలహాదారుగా నియమించారు. లేటెస్ట్గా ఎవరూ ఊహించని విధంగా సింగర్ మంగ్లీని ఎస్విబిసి సలహాదారుగా నియమించింది ప్రభుత్వం. ఇలాంటి పదవుల నియామకం వరుసగా సాగుతోంది. ఒక్కో సలహాదారుకు రూ. మూడు లక్షల పైనే జీతభత్యాలున్నాయని తెలుస్తోంది. లెక్కలు తీస్తే కనీసం వంద మంది సలహాదారులుంటారని చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. ఎంతమంది సలహాదారులన్నా ప్రభుత్వాన్ని నడిపించేది మాత్రం సజ్జల అనే సలహాదారు మాత్రమేననే టాక్ ఉంది.
ప్రభుత్వ శాఖలకు సలహాదారులేమిటని ఇటీవల కాలంలో హైకోర్టు కూడా ఆక్షేపించింది. గతంలో దేవాదాయశాఖకు ఓ సలహాదారుడ్ని నియమించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలానే వదిలేస్తే రేపు అడ్వకేట్ జనరల్‌కు కూడా సలహాదారుని నియమిస్తారమంటూ వ్యాఖ్యానించింది. సలహాదారులను నియమించేందుకు అధికారుల కొరత ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉందని శాఖలకి సలహాదారు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. .అయినా, కూడ ప్రభుత్వం మళ్లీ నియామకాలు చేస్తోంది. జగన్ సర్కార్ తమ సొంత అవసరాలకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ రాష్ట్రాన్ని మరింతగాఅప్పుల్లోకి నెడుతోందని విపక్షాలు మండిపడితున్నాయి.