అంబానీ రేంజ్‌ ఇప్పుడు ఇండియా కాదు!

By KTV Telugu On 7 October, 2022
image

– అంబానీ వస్తున్నాడు.. పారాహుషార్‌!
– సింగపూర్‌లో ఆఫీస్‌-అంబానికో లెక్కుంటుంది!

రాజు తలచకుంటే దెబ్బలకు కొదవా. అలాంటిది బిజినెస్ రారాజు అంబానీ అనుకుంటే ఆకాశంలో కూడా అడ్రస్‌ సృష్టించగలడు. ఆసియాలోనే రెండవ సంపన్నుడైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ సింగపూర్‌లో కూడా ఆఫీస్‌ ఓపెన్‌ చేయాలనుకుంటున్నారు. ఓపక్క అదానీ అన్ని రంగాల్లో దూసుకొస్తుంటే, ఇజ్జత్‌కా సవాల్‌ అనుకుంటూ అంబానీ కూడా వ్యాపార విస్తరణమీద పూర్తి దృష్టిపెట్టారు.
ఇండియాలో అంబానీ సామ్రాజ్యం ఓ రేంజ్‌లో విస్తరించింది. అదానీ పోటీకి వచ్చేదాకా అంబానీకి ఎదురేలేకుండాపోయింది. ఇండియాలో అంబానీ తలుచుకుంటే కానిదేమీ లేదు. ఇండియన్‌ మార్కెట్‌మీద ఎలాగూ పట్టుచిక్కింది. అందుకే అంబానీ కన్ను ఇప్పుడు విదేశాలమీద ఉంది. అందుకే సింగపూర్‌లో ఫ్యామిలీ ఆఫీస్‌ తెరవబోతున్నారు ముకేష్‌. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ముకేష్‌ సతీమణి నీతాఅంబానీ స్వయంగా సింగపూర్‌ ఆఫీస్‌కి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
సంపన్నులు తమ కుటుంబ సంపద, పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆఫీస్‌లుగా పిలవబడే కార్యాలయాల్ని తెరుస్తుంటారు. ఫ్యామిలీ ఆఫీస్‌లకోసం ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లకు సింగపూర్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. పన్నులభారం లేకపోవటం, భద్రతాపరంగా సురక్షితం కావటంతో చాలామంది సింగపూర్‌ని ఎంచుకుంటున్నారు. 2021కి ముందు సింగపూర్‌లో సంపన్నుల ఫ్యామిలీ ఆఫీస్‌లు 400దాకా ఉండేవి. ఇప్పుడు వీటిసంఖ్య 700కు చేరింది. ఈ లిస్ట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత కూడా చేరిపోయారు.
ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో భాగంగానే సింగపూర్‌లో ఆఫీస్‌ తెరుస్తున్నారు ముకేష్‌ అంబానీ. అందుకే వ్యూహాత్మకంగా ఆయన విదేశాల్లో కొన్నాళ్లుగా ఆస్తులు కొంటున్నారు. 2021లో యూకేలోని ప్రఖ్యాత స్టోక్‌ పార్క్‌ని ముకేష్‌ కుటుంబం 79 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకుంది. 2022 జనవరిలో మాండరిన్‌ ఓరియెంటల్‌ న్యూయార్క్‌లో 73శాతం వాటాలు కొనుగోలు చేసింది. దుబాయ్‌లో 80 మిలియన్‌ డాలర్లకు పెద్ద విల్లాని కొనేశారు రిలయన్స్ అధినేత. సింగపూర్‌ ఆఫీస్‌తో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లో దూసుకెళ్లాలనేది అంబానీ ప్లాన్‌.