అమరావతి వివాదం ఇంకెన్నాళ్లు ?

By KTV Telugu On 19 March, 2022
image

ఏపీ రాజధాని ఏది ? . ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకునన కొత్తల్లో మంత్రి బొత్స సత్యనారాయణను ఓ జర్నలిస్టు ప్రశ్నించాడు. ఆ ప్రశ్న అర్థం కానట్లు మూడు సార్లు రెట్టించి అడిగిన బొత్స.. ఆ.. అది.. రేపు తెలుస్తుంది అన్నాడు. ఆ “రేపు” ఇంకా రాలేదు. ఏపీకి రాజధాని ఏదో ఎవరికీ తెలీదు. ఉన్న రాజధానిని ప్రభుత్వం గుర్తించడం లేదు. కొత్త రాజధాని పెట్టలేకపోతోంది. దీని వల్ల నష్టపోతోంది.. రాష్ట్రమే అంటే ప్రజలే.

ఏకగ్రీవంగా నిర్ణయించిన రాజధాని అమరావతి !

2014 సంవత్సరంలో అసెంబ్లీలో వైసిపి తో సహా అందరూ అమరావతిని రాజధానిగా ఏకగ్రీవంగా నిర్ణయించారు. సుమారు 34 వేల ఎకరాల భూమిని భూ సమీకరణ పద్ధతిలో రైతులు స్వచ్చందంగా ఇచ్చారు. 0కరం భూమి అంటే 4840 చదరపు గజాలు రైతు నుండి తీసుకుని రైతుకి అభివృద్ధి చేసిన ప్లాట్లు 1200 నుండి 1450 చదరపు గజాల వరకు వారికి తిరిగి ఇవ్వాలని ఒప్పందం. గత ప్రభుత్వ హయాంలో అనేక కేసులు.. అడ్డంకులు ఎదుర్కొని చివరి రెండున్నరేళ్ల కాలంలో అమరావతికి ఓ రూపు వచ్చింది. పరిపాలన అంతా అక్కడ్నుంచి సాగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక రాజధానిని .. రాజధాని స్థాయిలో కట్టేలా ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ప్రభుత్వం మారింది.

అధికారంలోకి వచ్చాక మాట మార్చిన జగన్ !

అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు కానీ.. ల్యాండ్ పూలింగ్ సమయంలో కానీ చివరికి గత ఎన్నికల సమయంలో కానీ అమరావతిని రాజధానిగా వ్యతిరేకించని వైసీపీ .. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క సారిగా ప్లేట్ ఫిరాయించేశారు. అప్పట్నుంచి వివాదం ప్రారంభమయింది. వైసిపి ప్రభుత్వం మూడేళ్ళ విలువైన సమయాన్ని రాజధాని వివాదంతో వృధా చేసింది. అమరావతిలో ఖర్చు చేసిన వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారింది. రాజధాని విభజన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పక్కనపెట్టి, ప్రజల దష్టిని మళ్లించి, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకుంది. అభివద్ధి పైన పరిపాలన పైన దష్టి పెట్టలేదు. అటు అమరావతి, ఇటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేయకుండా వదిలేసింది. ఫలితంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది.

రాజధాని రాష్ట్రపరిధిలోదే కానీ గతంలోనే నిర్ణయం తీసేసుకున్నారుగా !?

ఏపీ రాజధాని వివాదాన్ని కేంద్రం ప్రోత్సహించింది. అమరావతి రాజధాని కి తమకు సంబంధం లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాష్ట్రపరిధిలోదని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అది రాష్ట్రపరిధిలోనిదే అందుకే రాజధాని నిర్ణయం ఏదో తీసుకోవాల్సి వచ్చినప్పుడు గత ప్రభుత్వం తీసేసుకుంది. ఇక ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానినిమారుస్తారా ? ఆ విధానం ఉందా..? లేదని కేంద్రం చెప్పలేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం (విభజన చట్టం) ప్రకారం రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. అందుకే రెండున్నర వేల కోట్లను ఇచ్చింది. తర్వాత ఇవ్వాల్సి వస్తుందని వివాదాన్ని ప్రోత్సహించింది.

ఇప్పటికైనా రాజధానిపై రాజకీయం మానేస్తారా !?

రాజధాని అమరావతి పై రైతులతో చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా కొత్త చట్టం చేసే అధికారం, ఉన్న చట్టాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. రైతులతో ఒప్పందాలు చేసుకొని ప్రభుత్వాలు మార్చుకుంటూ పోతే ప్రజల గతి ఏమవుతుంది? 2024 లో మరో ప్రభుత్వం వస్తే మళ్లీ మార్చవచ్చా? మళ్లీ చట్టం చేయవచ్చా? వికేంద్రీకరణ పేరుతో రాజధానిని ముక్కలు చేయడం తెలివైన నిర్ణయం కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని వివాదానికి స్వస్తి పలకాల్సి ఉంది.