బ్యాటరీ ఎన్ని సార్లు రీచార్జ్ చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎంత పరుగులు తీసినా గమ్యం చేరలేకపోవచ్చు. రోజుల తరబడి చదివినా పరీక్ష పాస్ కాలేకపోవచ్చు. అదంతా ఒక ఎత్తు.కొంతమందికి ఛాన్సిస్తే మాత్రం గట్టేక్కిస్తారమన్న విశ్వాసం కలగవచ్చు. అది మరో ఎత్తు… ఎలాంటి ట్రాక్ రికార్డ్ లేకపోయినా.. విశ్వాసం అనే ఒక సన్నని దారం వారిని మళ్లీ మళ్లీ పిలుస్తుంటుంది.. అలాంటి వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు..
కాంగ్రెస్ లో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. ‘ నవ సంకల్ప్ చింతన్ శిబిర్’ వేదికగా అధిష్టానం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని స్పష్టం చేసింది. పార్టీలో పని చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చే నాటికి అనూహ్యంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీకి రావాలని అధిష్టానం కోరింది. పార్టీలో తిరిగి చేరినా.. కిరణ్ కుమార్ చాలా రోజులుగా క్రియాశీలంగా లేరు. ఆయన ఏం చేస్తున్నారు…ఎక్కడున్నారో కూడా కాంగ్రెస్ వర్గాలకు తెలీదు…
ఎందుకు పిలిచారబ్బా….?
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా, రాహుల్ తో భేటీ సందర్భంగా ఈ ప్రస్తావన వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో సీఎం ఉంటూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదిగానే కొనసాగారు. పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. విభజనను ఆపి తీరుతామన్నారు. విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి వైదొలిగి.. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఏపీలో పోటీ చేసినా… ఒక్క స్థానం కూడా సాధించలేదు. కొన్ని రోజులు కనిపించకుండా పోయిన కిరణ్… తర్వాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. తర్వాత మళ్లీ గాయబ్.. ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు అకస్మాత్తుగా అధిష్టానం నుంచి పిలుపు రావడంతో కిరణ్ వార్తల్లో వ్యక్తి అయ్యారు….
కిరణ్ నడిపించగలరా ?
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో ఉంది. నియోజకవర్గానికి ఒక బలమైన నేత కూడా లేక నానా తంటాలు పడుతోంది. చాలా మంది సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేసి… రాజకీయ సన్యాసం కూడా చేశారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. నామ్ కే వాస్తే అన్నట్లుగా ఉన్నారు. రఘువీరా రెడ్డి లాంటి నేతలు గుళ్లూగోపురాలు తిరుగుతూ కృష్ణ రామ అనుకుంటున్నారు. దానితో పార్టీకి ఒక చరిష్మా కావాల్సి వచ్చింది. మాజీ సీఎంగా, దూకుడును ప్రదర్శించగలిగిన నేతగా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని నడిపించగలరని అధిష్టానం విశ్వసిస్తోంది.
నిజానికి కిరణ్ జనంలో తిరిగిన నేత కాదు. ప్రజాబలం ఉన్న నేతగా కూడా ప్రచారం పొందలేదు. ఒక సారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. తన నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వీక్ గా ఉండటంతో గెలిచిన సందర్భాలే ఎక్కువ. పైగా మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం కావడం, ఆయన తండ్రి కాంగ్రెస్ లో కీలక నేతగా ఉండటంతో కిరణ్ కు కలిసొచ్చింది.
కిరణ్ అందరినీ కలుపుకుపోయే నేత కాదన్న అభిప్రాయమూ చాలా రోజులుగా ఉంది. ఆయన అహంకారి అని ఎవరి సలహాలను పట్టించుకోరని, సీనియర్లను లెక్కచేయరని అప్పట్లో చెప్పేవారు. కిరణ్ ను డీల్ చేయడమంటే కొరివితో తల గోక్కోవడమేనని నేతలు అనేవారు. పైగా ఆయనకు పార్టీలో ఒక గ్రూపు లేదు. ఎవరినీ దగ్గరకు రానివ్వరని, ఎవరితో సఖ్యతగా ఉండదన్న పేరు ఉండనే ఉంది. అలాంటి వ్యక్తికి పీసీసీ పగ్గాలు అప్పగించడం అంత ఉత్తమం కాదేమోనన్న వాదన వినిపిస్తోంది…
పాదయాత్ర కీలకం
కిరణ్ కుమార్ కు పీసీపీ పగ్గాలు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కన్యాకుమారి నుంచి కశ్మీర్ పాదయత్ర ఆయనకు కీలక పరీక్ష అవుతుంది. సోనియా, రాహుల్, ప్రియాంక సహా అగ్రనేతలు పాల్గొనే యాత్రను ఆంధ్రప్రదేశ్ లో ఆయన సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. యాత్ర ఏపీలోకి ప్రవేశించినది మొదలు.. పక్క రాష్ట్రంలోకి నిష్క్రమించే వరకు అన్ని తానై నడిపించాలి. జనసమీకరణ చేయాలి. ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. మరి ఏం చేస్తారో చూడాలి