విభజన అంశాలు.. మరో మొగిలిరేకులు

By KTV Telugu On 8 November, 2022
image

మీటింగులెడితే సరిపోద్దా.. మనసు పెట్టండి

ఓ మొగిలి రేకులు, ఓ కార్తీక దీపం, అంతకు మించిన సాగదీతల సీరియళ్లలో ఏపీ-తెలంగాణ విభజన అంశాలను కూడా చేర్చేయొచ్చు. నిద్రలో ఉలిక్కిపడి లేచినట్లు కేంద్రానికి అప్పుడప్పుడూ గుర్తుకొస్తుంటుంది. కేంద్రహోంశాఖ రెండు రాష్ట్రాలకు కబురు పంపుతుంది. ఎజెండా టేబుల్‌మీదికి వస్తుంది. చాలా విషయాల్లో ఏకాభిప్రాయం కుదరదు. కేంద్రం చేసేదేమీ ఉండదు. వచ్చామా కూర్చున్నామా కాఫీలు తాగామా కాసేపు కబుర్లాడుకున్నామా అన్నట్లే ఉంటాయా మీటింగులు. ఇప్పటికి ఎన్ని జరిగాయో లెక్కచెప్పేందుకు కాళ్లూచేతుల వేళ్లు సరిపోవు. విభజన సమస్యలపై సమావేశాలు ప్రహసనంగా మారిపోయాయి. అయినా లెక్కకోసం తప్పదన్నట్లు మరోసారి రెండురాష్ట్రాలకు కేంద్రహోంశాఖ కబురంపింది.

నవంబరు 23న జరిగే మీటింగ్‌కి రావాలని ఏపీ, తెలంగాణ అధికారులకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. విభజన సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినా చిత్తశుద్ధిలేని శివపూజల్లాగే ఉంటున్నాయి ఈ సమావేశాలు. చావుకబురు చల్లగా చెప్పడమో, తాంబూలాలిచ్చాం కొట్టుకు చావండనడమో తెలుగురాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం నిర్వహిస్తున్న సమావేశాల్లో అంతకుమించి ఏమీ జరగడం లేదు. ఈ మధ్య నిర్వహించిన సమావేశంలో విశాఖ రైల్వేజోన్ సాధ్యం కాదని తేల్చిచెప్పేశారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, అమరావతికి అనుసంధానం చేసే రైల్వే ప్రాజెక్టులు తదితర అంశాలు గత సమావేశం అజెండాలో ఉన్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. విభజన చట్టంలోని అంశాలన్నీ పదేళ్లలో పూర్తిచేయాల్సి ఉండటంతో ఇన్నేళ్లు సాగదీస్తూ వచ్చిన కేంద్రం ఇప్పుడు హడావుడి పడుతోంది. జంబో అజెండాతో మరో మీటింగ్‌కి రెడీ అవుతోంది. ఈ మీటింగ్‌ కూడా వచ్చామా వెళ్లామా అన్నట్లే ఉంటుందా పనికొచ్చే విషయం ఏదన్నా ఉంటుందా.