జగన్‌ను కేసీఆర్ టార్గెట్ చేశారా?

By KTV Telugu On 18 November, 2022
image

తెలుగు ప్రభుత్వాల మధ్య పోలరణం
వైసీపీ సర్కార్‌పై మళ్లీ హరీష్ రావు పంచ్
మరో ఐదేళ్లయినా పోలవరం పూర్తికాదంటూ కామెంట్
తెలంగాణ మంత్రికి అంబటి చురక

గత కొంతకాలంగా జగన్ సర్కార్ వైఫల్యాలపై తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో తెలంగాణ మంత్రి హరీష్ రావు మళ్లీ వేలు పెట్టారు. గతంలో కరెంటు, ఉద్యోగుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు… తాజాగా పోలవరం విషయంలో వైసీపీని టార్గెట్ చేశారు. కాళేశ్వరం కంటే ముందే పోలవరం ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదన్నారు. మరో ఐదేళ్లయినా పోలవరం పనులు పూర్తి చేయలేరంటూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ఫలాలు తెలంగాణ ప్రజలకు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. గతంలోనూ కరెంటు విషయంలో ఏపీ కంటే తెలంగాణయే బెటరంటూ హరీష్ చేసిన కామెంట్స్, రెండు ప్రభుత్వాల మధ్య వేడి రాజేసింది. అది చల్లారకముందే, జగన్ ప్రభుత్వంపై మరో బాంబ్ పేల్చారు హరీష్ రావు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను కేసులు పెట్టి వేధిస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. అంతకుముందు ఏపీలో రోడ్ల దుస్థితిపైనా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ అయ్యాయి. ఈ పరిణామాలన్నీ చూడబోతే ఏపీలో ఏదో జరగబోతోందన్న అనుమానం కలుగుతోంది. కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దాంట్లో భాగంగానే హరీష్ రావుతో కేసీఆర్ జగన్ పై బాణం ఎక్కుపెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

హరీష్ కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ మాటల యుద్ధానికి దారితీశాయి. గులాబీ మంత్రుల వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు అటు వైసీపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని ఘాటు రిప్లై ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజ్ అని, అది పూర్తిగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అని అంబటి తెలిపారు. పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు అంటూ తేల్చి చెప్పారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. వైఎస్సార్టీపీ అధినేత షర్మిల స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్రదర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అయితే, కాళేశ్వరంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని గులాబీ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. ఇలాంటి సమయంలో హరీష్ రావు కాళేశ్వరం ఘనతను చాటుకుంటూ, పోలవరాన్ని ముందుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.

ఇక, పోలవరం ప్రాజెక్ట్‌ను 2022నాటికి పూర్తిచేస్తామని అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రకచించింది. అయితే, అనుకున్న లక్ష్యాలను మాత్రం నెరవేర్చలేకపోతోంది. పోలవరం నిర్మాణంలో జాప్యాన్ని ప్రభుత్వం అంగీకరిస్తోంది. అయితే, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఆలస్యం జరుగుతోందనే విషయాన్ని నొక్కి వక్కానిస్తోంది. స్పిల్ వే తర్వాత డయాఫ్రం వాల్ నిర్మించాలని, కానీ అలా కాకుండా ముందే డయాఫ్రం వాల్ నిర్మించడం వల్ల ఇబ్బంది తలెత్తినట్లు ఇరిగేషన్ మంత్రి అంబటి తెలిపారు. డయాఫ్రం వాల్ వరదలకు దెబ్బతినడంతో పరిశీలన జరుగుతోందని, దానిపై క్లారిటీ వచ్చాకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పైన కూడా ఒక స్పష్టత వస్తుందని అంబచి వెల్లడించారు. అంటే, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు, టీడీపీ నేతలు మాత్రం తమ హయాంలోనే 70శాతానికి పైగా పనులు పూర్తిచేశామని చెబుతున్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి పోలవరాన్ని జగన్ సర్కార్ పడుకోబెట్టిందని విమర్శిస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు కామెంట్స్ తో అటు ఏపీలోని విపక్షాలు జగన్ సర్కార్ పై పోలరణం ప్రారంభించాయి.