పాఠం చెప్పండి చాలు.. సర్కారు కీలక నిర్ణయం!
జగన్ సర్కారు నిర్ణయంతో స్కూళ్లకు మంచిరోజులు
ఎన్నికలొస్తే టీచర్లు.. జనాభా లెక్కలు తీయాలంటే టీచర్లు.. ప్రభుత్వాలకు ఏ గణాంకాలు అవసరమైనా గుర్తుకొచ్చేది గవర్నమెంట్ టీచర్లే. రోజుల తరబడి విద్యాయేతర విధులతో పిల్లల చదువులు అటకెక్కినా పట్టింపు ఉండదు. స్కూళ్లుంటాయి.. పిల్లలొస్తారు. కానీ మాస్టారు ఆ రోజు పాఠం చెబుతారో, మరో పనిలో ఉంటారో ఎవరికీ తెలీదు. పిల్లలకు విద్యాబుద్ధులకంటే తమకు వేరే పనులు ఎక్కువైపోతున్నాయని ఉపాధ్యాయలోకం ఎప్పట్నించో మొరపెట్టుకుంటోంది. టీచర్లను స్కూళ్లకే పరిమితం చేయాలని మేథావివర్గం కోరుకుంటోంది. అందుకే స్కూళ్ల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల బోధనేతర పనుల నుంచి టీచర్లను తప్పించేలా ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని సవరించింది. టీచర్లకు విద్యాబోధన తప్ప మరో పని అప్పగించకూడదని నిర్ణయించింది. ప్రభుత్వ కీలక నిర్ణయంతో టీచర్లకు ఇతర పనుల నుంచి విముక్తి దొరుకుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో టీచర్లకు విద్యాబుద్ధులు చెప్పటం తప్ప మరో వ్యాపకం ఉండదు. అనివార్య పరిస్థితుల్లో ఎప్పుడైనా విద్యేతర పనుల కోసం వారి సేవలు అవసరమైతే ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది అందరినీ వినియోగించాకే టీచర్లను పిలవాలనే నియమం పెట్టుకున్నారు.
స్కూళ్లలో బోధనేతర కార్యక్రమాల బాధ్యతను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల సంక్షేమ, విద్యా అసిస్టెంట్లకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 34 వేలమంది సచివాలయాల సిబ్బంది సేవలను పాఠశాలల మెరుగైన నిర్వహణ కోసం ప్రభుత్వం వినియోగించుకుంటోంది. విద్యేతర పనులనుంచి తప్పించి టీచర్లు ఇకపై పూర్తిగా బోధనపైనే దృష్టి పెట్టేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నేళ్లుగా ప్రభుత్వ యంత్రాంగానికి ఏ అవసరం వచ్చినా టీచర్లకే బాధ్యతలు కేటాయిస్తూ వస్తున్నారు. దీంతో పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేకుండా పోతున్నారు. కొంతమంది టీచర్లు డిప్యుటేషన్లపై ఇతర విభాగాలకు వెళ్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కార్పొరేషన్ల ఛైర్మన్ల పీఏలుగా కూడా టీచర్లు తమ అసలు లక్ష్యంనుంచి పక్కకు వెళ్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ గత ఏడాది ఇతర శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారిని వెనక్కి రప్పించింది. ఇప్పుడు విద్యేతర బాధ్యతలనుంచి తప్పించటంతో టీచర్లంతా విద్యాబోధనపైనే దృష్టి సారించే అవకాశం దొరికింది. కుంటిసాకులతో స్కూళ్లకు ఎగనామం పెట్టే పంతుళ్లపై ప్రత్యేక నిఘా పెట్టబోతోంది ప్రభుత్వం.